మురికి గోడలను బడిగా మార్చిన టీచర్‌! | Indian Teacher Rouble Nagi Who Painted Murals In Slums Wins Global Teacher Prize | Sakshi
Sakshi News home page

మురికి గోడలను బడిగా మార్చిన టీచర్‌!

Jul 29 2026 3:30 AM | Updated on Jul 29 2026 3:31 AM

Indian Teacher Rouble Nagi Who Painted Murals In Slums Wins Global Teacher Prize

‘‘మీ చేతిలో ఉన్న ఆ చెక్కని ఏమంటారు?’’ అని అడిగింది ఒక చిన్నారి. ఆ ప్రశ్న అర్థం కాక, ఆమె తన చేతిలోనే వస్తువును చూసుకొని ‘‘దీన్ని పెన్సిల్‌ అంటారు’’ అంది. ‘‘దాంతో ఏం చేస్తారు?’’ అని అమాయకంగా ప్రశ్నించింది ఆ చిన్నారి. ఆ ప్రశ్న ఆమెని క్షణం పాటు నిశ్శబ్దంగా నిలబెట్టింది. ప్రపంచంలో అతి సాధారణమైన ఒక పెన్సిల్‌ కూడా తెలియని స్థితిలో కొందరు పిల్లలు ఈ లోకంలో ఉన్నారన్న నిజం ఆమెని కలచివేసింది. ప్రతి పిల్లవాడి చేతిలో పెన్సిల్‌ ఉండాలి అన్న సంకల్పానికి ఆ క్షణమే అంకురం పడింది.

ఆ సంకల్పంతో ఆమె మురికివాడల్లోకి వెళ్లినప్పుడు అక్కడ పాఠశాలలు లేవు, కేవలం పాడైపోయిన గోడలు మాత్రం ఉన్నాయి. ఆ గోడలను చూసి ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది..!

పాఠశాల అంటే నాలుగు గోడలు, ఒక నల్లబల్ల, ఎదురుగా పిల్లలు, వారికి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు– ఇది మనందరికీ తెలిసిన నిర్వచనం. కానీ ‘రూబుల్‌ నాగి’ అనే మహిళకు పాఠశాల గురించి మరో ఆలోచన ఉంది. ‘‘పిల్లలు పాఠశాలకు రాలేకపోతే, పాఠశాలనే వారి దగ్గరకు తీసుకెళ్లాలి’’అన్న ఆలోచన అది..! ఒక పిల్లవాడికి చదువు చెప్పటం అంటే అతడి చేతిలో పుస్తకం పెట్టడం కాదు. అతడి భవిష్యత్తుకు ఒక తలుపు తెరవటం– అని నమ్మింది. 

‘రూబుల్‌ నాగి’ ఒక చిత్రకారిణి. సాధారణ చిత్రకారుడు తన బొమ్మల కోసం మంచి కాన్వాస్‌ను వెతుకుతాడు. ఆమె మాత్రం ‘‘చదువుకు దూరమైన పిల్లల’’ను వెతికింది. నిన్నటి వరకూ నిర్లక్ష్యానికి గుర్తుగా నిలిచిన గోడలు, పిల్లలకు పాఠాలు చెప్పే సజీవ పుస్తకాలుగా మారాయి. ఒక గోడ మీద అక్షరాలు, మరో గోడ మీద అంకెలు, ఇంకో గోడమీద సైన్స్, ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణానికి సంబంధించిన రంగురంగుల బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి.

అర్బన్‌ ఆడిటోరియంలో ఖరీదైన కళాప్రదర్శనల కన్నా, మురికి వాడల గోడల మీద తన చిత్రకళకు ఎక్కువ ప్రయోజనం ఉందని నమ్మింది..! కేవలం ముప్పైమంది పిల్లలతో ప్రారంభమైన ఆమె ప్రయత్నం, క్రమంగా వందలాది ప్రాంతాలకు విస్తరించింది. పాఠశాల ముఖమే చూడని పిల్లలను చదువువైపు నడిపించడం, చదువులో వెనుకబడినవారికి సహాయం చేయడం, వారిలో ‘‘నేనూ నేర్చుకోగలను’’ అనే నమ్మకాన్ని కలిగించడం ఆమె లక్ష్యంగా మారింది.

ఆమె శిక్షణ కేంద్రాల్లో చదువుకున్న కొందరు విద్యార్థులు బాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ పట్టాలు సాధించగా, మరికొందరు సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు భారతసైన్యంలో అధికారులుగా చేరేందుకు శిక్షణ పొందుతున్నారు. మురికివాడలో మొదలైన వారి ప్రయాణం, ఉన్నత విద్యాసంస్థల వరకూ చేరింది.ఒక పిల్లవాడికి అక్షరం నేర్పడం మనకు చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ అతడి కుటుంబంలో చదవడం వచ్చిన మొదటి వ్యక్తి అతడే అయితే, అది ఒక అక్షరం కాదు– ఆ కుటుంబ చరిత్రలో ప్రారంభమైన కొత్త అధ్యాయం..! ఒక అమ్మాయికి లెక్కలు నేర్పడం సాధారణంగా అనిపించవచ్చు. కానీ రేపు తన సంపాదనను తానే లెక్కపెట్టుకుని, ఎవరూ తనను మోసం చేయకుండా నిలబడగలిగితే, అది కేవలం గణితం కాదు– ఆత్మగౌరవం..! ‘నువ్వు పుట్టటం మురికివాడలో అయ్యుండొచ్చు. కానీ నీ కలలు అక్కడే ముగియాల్సిన అవసరం లేదు’ అంటుంది రూబుల్‌ నాగి.

ఒక విద్యావేత్త భవనం కట్టి పాఠశాలను నిర్మించవచ్చు. కానీ చదువుకోలేని పిల్లవాడి మనసులో ‘‘నాకూ ఒక భవిష్యత్తు ఉంది’’ అనే నమ్మకాన్ని నిర్మించినవాడే నిజమైన ఉపాధ్యాయుడు..! రూబుల్‌ నాగి వేసింది గోడల మీద రంగులు కాదు. పిల్లల జీవితాల్లో రంగులు నింపే భవిష్యత్తు!

ఈ అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఆమెకి మిలియన్‌ డాలర్ల ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ లభించింది..! అంత భారీ బహుమతి (దాదాపు కోటి రూపాయలు) వచ్చిన తరువాత కూడా ఆమె తన సౌకర్యాల గురించి కాదు; నిరుపేద పిల్లలకు ఉచితంగా వృత్తివిద్య అందించే సంస్థను నిర్మించడం గురించి ఆలోచించింది. అందుకే ఆమెకు అవార్డు వచ్చిందని చెప్పడం కన్నా, ఆమె చేస్తున్న పనిని వెతుక్కుంటూ అవార్డే వచ్చిందని చెప్పడం సరైనది..!

– యండమూరి వీరేంద్రనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement