‘నాకు ఏది కావాలంటే అది వెంటనే నా ముందుండాలి, ఎందుకంటే నేను ప్రత్యేకం!’ – నేటితరం పిల్లల్లో, ముఖ్యంగా నగరాల్లోని విద్యా సంస్థల్లో ప్రమాదకరంగా పెరుగుతున్న మనస్తత్వం ఇది. ఒక సర్వే ప్రకారం, గత దశాబ్ద కాలంలో పాఠశాలల్లో క్రమశిక్షణా రాహిత్యం, తోటి విద్యార్థులను తక్కువ చేసి చూచే ధోరణులు దాదాపు ముప్పై ఐదు శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం, ఈ ఎంటైటిల్డ్ మనస్తత్వమే. తరగతి గది అనేది సమాజానికి చిన్న ప్రతి రూపం లాంటిది. అక్కడ ఒకరిద్దరు పిల్లలు తామే సర్వోన్నతులు అనే భావనతో ఉంటే, అది మిగతా పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ‘మా నాన్న ఎవరో తెలుసా?’ అనే అహంకారంతో గ్రూపులు కట్టి, సాధారణ నేపథ్యం ఉన్న పిల్లలను మానసికంగా వేధించే బెదిరింపులు, వర్గ రాజకీయాలు ఎక్కువవుతాయి. ఇలాంటి పిల్లలు సమూహ పనులు చేసేటప్పుడు కేవలం నాయకత్వం కోసం పట్టుబడ తారు తప్ప, ఇతరులతో కలిసి పని చేయడానికి ఇష్టపడరు.
ఇందువల్ల సహకార భావన పూర్తిగా లోపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రముఖ నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలోని అంతర్జాతీయ పాఠశాలలు, కార్పొరేట్ ఇంటర్ కాలే జీలలో ఇలాంటి యథార్థాలు చూడవచ్చు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ అంతర్జాతీయ పాఠశాలలో ఒక మంత్రి కుమారుడికి ఆశించిన విద్యార్థి సంఘ నాయకుడి పదవి ఇవ్వనందుకు సదరు ఉపాధ్యాయుడిని స్కూల్ ముందే అవమానించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే విజయవాడలోని ఒక ప్రముఖ పాఠశాలలో ఒక పెద్ద వ్యాపారవేత్త కుమార్తె తను తెచ్చుకున్న లక్షన్నర రూపాయల ఫోన్‌ను ప్రదర్శిస్తూ, పక్క విద్యార్థినిని కనీసం బ్రాండెడ్ వాచ్ కూడా లేదనీ, తనతో స్నేహం చేయడానికి అర్హురాలివి కావనీ కించపరిచిన ఘటనలు ఉన్నాయి. హైదరాబాద్‌లోనే మరో ఘటనలో ఒక ఈవెంట్ నాయకత్వం మార్చలేదని ప్రధానోపాధ్యాయునికే ఫోన్ చేసి బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఎంటైటిల్డ్ మనస్తత్వానికి ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. లైకులు, వ్యూస్ కోసం తమ విలాసవంతమైన జీవితాన్ని, పాఠశాల ఈవెంట్లను వైరల్ చేయడం ఒక ట్రెండ్‌గా మారడం వల్ల పిల్లల్లో తక్షణ సంతృప్తి అలవాటై, ఓపిక నశిస్తోంది. ఇక్కడే మనకు ‘డిజిటల్ పౌరసత్వం’ విద్య ఎంతైనా అవసరమవుతుంది.
పరిష్కార మార్గాలు
పాఠశాలల యాజమాన్యాలు కఠినమైన ఏక రూప నియమాలను అమలు చేయాలి. ముఖ్య మంత్రి కొడుకైనా, ఐఏఎస్ కూతురైనా స్కూల్ గేటు దాటి లోపలికి వస్తే అందరూ సమానమే అనే నియమం పెట్టి, యూనిఫాం, మొబైల్ ఫోన్ల నిషేధాన్ని అందరికీ ఒకేలా వర్తింపజేయాలి. ఇలాంటి పిల్లలకు కేవలం అధికారం మాత్రమే కాదు, క్లాస్‌రూమ్ శుభ్రతను పర్యవేక్షించడం, తోటి బలహీన విద్యార్థులకు చదువులో సహాయ పడటం వంటి క్షేత్రస్థాయి బాధ్యతలను అప్పగించాలి. హోదాను చూసి భయపడకుండా, పిల్లాడి ప్రవర్తన సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులను పిలిచి సంప్రదింపులు జరిపి నిర్మొహమాటంగా నిజాలు చెప్పాలి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా అడి గిందల్లా ఇవ్వకుండా, సమాజంలో ఎలా బత కాలో నేర్పాలి. అడిగిన కొన్ని వస్తువులను తిరస్కరించడం వల్ల వారికి జీవితంలో అన్నీ అను కున్నట్టు జరగవు అనే చేదు నిజం చిన్నప్పుడే బోధపడుతుంది. క్రమశిక్షణతో కూడిన విద్యే నిజమైన సంస్కారం అని అందరూ గ్రహించాలి.
– డా‘‘ మేడా జగన్మోహన రావు ‘ విద్యారంగ నిపుణులు


