ముంబైలోని మాలాద్ ప్రాంతంలో ఒక దిగ్భాంతికరమైన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం మృతి చెందిన 80 ఏళ్ల వృద్ధుడి మృతదేహం బయటపడటం కలకలం రేపింది. భవిష్యత్తులో వైద్య రంగంలో వచ్చే అధునాతన మార్పులతో చనిపోయిన వారిని మళ్లీ బతికించవచ్చనే (క్రయోనిక్స్) నమ్మకంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం 80 ఏళ్ల వృద్ధుడు నాలుగేళ్ల క్రితం కన్నుమూశాడు. అయితే అతని భార్య, పిల్లలు అమెరికాలోని క్రయోనిక్స్ సెంటర్‌కు మృతదేహాన్ని తరలించాలనుకున్నారు. స్థానిక క్లినిక్‌లోనే ఆయన డెడ్‌బాడీని భద్రపరిచారు. ఈ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ఒక సమాచారకర్త ఇచ్చిన సమాచారం మేరకు మలాడ్‌లోని ఒక స్థానిక వైద్యశాలలో ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. తాము తీవ్ర మనోవేదనకు గురయ్యామని, మృతదేహాన్ని దీర్ఘకాలిక సంరక్షణ సేవలు అందించే అమెరికాలోని క్రయోనిక్స్ కేంద్రానికి తరలించాలనుకుంటున్నామని చెబుతూ, అతని మరణానంతరం మృతదేహాన్ని భద్రపరచమని కుటుంబం ఆ క్లినిక్‌కు సూచించింది. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు నిపుణుల సలహాలు తీసుకుంటూ తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు.
క్రయోనిక్స్ అంటే ఏమిటి?
మరణం తరువాత మానవ శరీరాన్ని అత్యంత అల్ప ఉష్ణోగ్రతలలో (ఫ్రీజింగ్) భద్రపరిచే ప్రక్రియ ఇది. భవిష్యత్తులో సైన్స్ అభివృద్ధి చెందితే వారిని తిరిగి బతికించవచ్చనే నమ్మకంతో కొందరు ఈ విధానాన్ని ఆశ్రయిస్తారు.
భారతదేశంలో క్రయోనిక్స్‌ను స్పష్టంగా నిషేధించే లేదా అనుమతించే నిర్దిష్ట చట్టాలు ఏవీ లేవు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం మరణించిన వ్యక్తుల గౌరవం, హక్కులు కాపాడాలని, మృతదేహాలకు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గతంలో 2014లో ఆధ్యాత్మిక గురువు అశుతోష్ మహారాజ్ మరణించినప్పుడు, ఆయన సమాధి స్థితిలో ఉన్నారని చెప్పి అనుచరులు మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచడాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు అనుమతించింది. అయితే, అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా మృతదేహాలను భద్రపరచడం చట్టపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: తల్లి, ఆమె బోయ్‌ఫ్రెండ్ హత్య: 18 ఏళ్ల యువతికి 50 ఏళ్ల జైలు శిక్ష


