నేడు శ్రీలంకతో భారత మహిళల టి20 జట్టు ఫైనల్
ఉదయం గం.10:30 నుంచి సోనీ స్పోర్ట్స్–1,3,4 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
నిషిన్: ఆసియా క్రీడల్లో తొలి రెండు రోజులు రజత, కాంస్యాలకే పరిమితమైన భారత్‌కు మంగళవారం తొలి స్వర్ణం గెలుచుకునే చాన్స్ ఉంది. మహిళల క్రికెట్‌లో స్వర్ణపతకం కోసం జరిగే ఫైనల్ పోరులో నేడు శ్రీలంకతో భారత్ తలపడనుంది. గత ఆసియా క్రీడల ఫైనల్లోనూ శ్రీలంకనే ఓడించి హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల ఫామ్ ప్రకారం చూస్తే టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది.
ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో కూడా లంకను చిత్తు చేసి విజేతగా నిలిచిన భారత్... అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఆసియా క్రీడల్లో రెండు టీమ్‌లూ ప్రత్యర్థులపై అలవోక విజయాలతో ఫైనల్‌కు చేరాయి. ఓపెనర్లుగా చెలరేగుతున్న షఫాలీ వర్మ, స్మృతి మంధానలను నిలువరించడం లంకకు సాధ్యం కాకపోవచ్చు. మిడిలార్డర్‌లో హర్మన్ తదితరులు కొంత తడబడుతున్నా... రిచా ఘోష్ దూకుడు భారత్‌కు సానుకూలాంశం. బౌలింగ్‌లో శ్రీచరణి ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తోంది.
క్రాంతి, నందని, దీప్తి శర్మ కూడా బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించగలరు. మరోవైపు లంక ఆశలన్నీ కెపె్టన్ చమరి అటపట్టుపైనే ఉన్నాయి. ఆమె బాగా ఆడితేనే జట్టుకు విజయావకాశాలు ఉన్నాయి. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆడిన తరహాలోనే ఆమె నుంచి జట్టు మరో మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. హర్షిత, కవీషా దిల్హారీ, సుగంధిక ఇతర కీలక ప్లేయర్లు. భారత్‌తో ఆడిన గత 7 మ్యాచ్‌లలోనూ శ్రీలంక ఓడింది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అదే జరిగి మ్యాచ్ రద్దయితే మాత్రం మెరుగైన సీడింగ్ ఉన్న జట్టు (భారత్) విజేతగా ఖరారవుతుంది.


