హిమాన్షు, రుద్రాంష్ ‘డబుల్‌’ ధమాకా | India shines in Shooting, MMA and Table Tennis in Asian Games 2026 | Sakshi
Sakshi News home page

హిమాన్షు, రుద్రాంష్ ‘డబుల్‌’ ధమాకా

Sep 22 2026 6:06 AM | Updated on Sep 22 2026 6:06 AM

India shines in Shooting, MMA and Table Tennis in Asian Games 2026

ఆసియా క్రీడల షూటింగ్‌లో భారత్‌కు మరో 3 పతకాలు

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో సుచికకు కాంస్యం 

ఓవరాల్‌గా 6 పతకాలతో ప్రస్తుతం 12వ స్థానంలో భారత్‌

ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు భారత షూటర్ల జోరు కొనసాగింది. షూటింగ్‌ తొలి రోజు రెండు రజతాలు అందించగా... సోమవారం మన ఖాతాలో మరో రెండు రజతాలు, ఒక కాంస్యం చేరాయి. వీటికి తోడు మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఎ)లో భారత్‌కు కాంస్యం దక్కింది. భారత్‌ తరఫున రుద్రాంష్  పాటిల్, హిమాన్షు ఢిల్లాన్, పార్థ్‌ మానే, సుచిక పతకధారులుగా నిలిచారు. ఎప్పటిలాగే అంచనాలకు అనుగుణంగా బ్యాడ్మింటన్, కబడ్డీ, హాకీలతో పాటు టేబుల్‌ టెన్నిస్‌లో భారత ఆటగాళ్లు కీలక విజయాలు సాధించి పతక రేసులో మరో అడుగు ముందుకు వేశారు.

నగోయా: అంచనాలను అందుకుంటూ షూటింగ్‌లో మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భారత్‌ రెండు రజత పతకాలు సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ రెండో స్థానంలో (1890.1 పాయింట్లు) నిలిచింది. రుద్రాంష్  పాటిల్, హిమాన్షు ఢిల్లాన్, పార్థ్‌ మానే ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురి వ్యక్తిగత స్కోర్లు మొత్తం కలిపి వచ్చిన మొత్తం పాయింట్లతో భారత్‌కు రజతం దక్కింది. 

రుద్రాంష్  631.8 పాయింట్లు, హిమాన్షు 630 పాయింట్లు, పార్థ్‌ 628.3 పాయింట్లు స్కోర్‌ చేశారు. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం (1899 పాయింట్లు) గెలుచుకోగా, దక్షిణ కొరియాకు కాంస్యం (1884.2 పాయింట్లు) లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలోనూ హిమాన్షు, రుద్రాంష్   సత్తా చాటారు.

 హిమాన్షు (252.4 పాయింట్లు) రజతం గెలుచుకోగా, రుద్రాంష్  (230.9 పాయింట్లు)కు కాంస్యం దక్కింది. ఈ ఈవెంట్‌లో లిహోవా షెంగ్‌ (చైనా–254.2 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. అయితే రజతం నెగ్గిన భారత జట్టులో ఉన్న మూడో షూటర్‌ పార్థ్‌ మానేకు మాత్రం వ్యక్తిగత ఈవెంట్‌ కలిసి రాలేదు. క్వాలిఫయింగ్‌లో 11వ స్థానంలో నిలిచిన అతను ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు.

700 గ్రామ్‌ల తేడాతో... 
మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఎ) మహిళల 60 కేజీల విభాగంలో భారత ఫైటర్‌ సుచిక తరియాల్‌ను దురదృష్టం వెంటాడింది. సోమవారం జరిగిన సెమీఫైనల్‌ పోరులో సింగపూర్‌కు చెందిన హుయ్‌ హూన్‌ టియో చేతిలో సుచిక పరాజయం పాలైంది. దాంతో ఆమె కాంస్య పతకానికే పరిమితమైంది. ఫైనల్‌ చేరే లక్ష్యంతో సోమవారం బరిలోకి దిగిన సుచిక పైచేయి సాధించినట్లు కనిపించినా... చివరకు 0–2తో ఓటమిపాలైంది. 

ముగ్గురు జడ్జీల సమక్షంలో రెండేసి నిమిషాల పాటు జరిగిన తొలి రెండు రౌండ్‌ల తర్వాత ఇద్దరు ప్లేయర్లు 1–1తో సమంగా నిలిచారు. ఒక జడ్జీ 19–19తో సమంగా పాయింట్లు ఇవ్వగా, మరొకరు సుచితకు 20–19తో ఆధిక్యం అందించారు. మూడో జడ్జీ సింగపూర్‌ ప్లేయర్‌కు అనుకూలంగా 20–19 పాయింట్లు ఇచ్చారు. అయితే అదనపు నిమిషంలో ఇద్దరు జడ్జీలు 10 చొప్పున పాయింట్లు ఇవ్వడంతో సింగపూర్‌ ప్లేయర్‌ విజేతగా నిలిచింది. కానీ ఈ ఫలితాన్ని భారత బృందం సవాల్‌ చేసింది. 

నిబంధనల ప్రకారం ఇందుకు 1000 డాలర్లు (సుమారు రూ. 96 వేలు) ఆర్బిటేషన్‌ ఫీజు కూడా చెల్లించింది. దాంతో అదనంగా మరో ముగ్గురు జడ్జీలను కేటాయించి వీడియో రీప్లేల ద్వారా మళ్లీ స్కోరింగ్‌ చేయించారు. అన్ని పరిశీలించిన తర్వాత ఈ న్యాయ నిర్ణేతల బృందం ఈ పోరు సమంగా సాగిందంటూ ‘డ్రా’గా ప్రకటించింది. అయితే ఇలాంటి స్థితిలో నిబంధనలను అనుసరించి తక్కువ బరువు ఉన్న ఫైటర్‌ను విజేతగా ప్రకటించారు. సుచిక (59.20 కేజీలు)తో పోలిస్తే టియో (58.50 కేజీలు) 700 గ్రామ్‌లు తక్కువ బరువు ఉంది. దాంతో టియో ఫైనల్‌కు చేరగా, భారత ప్లేయర్‌ ఆవేదనతో ని్రష్కమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement