ఓట‌మి బాధ‌లో ఉన్న ఆసీస్‌కు షాక్‌.. స్వ‌దేశానికి స్టార్ ఆట‌గాడు! | Big Blow-Australia-Josh-Inglis-Returns-Home-Injury-2nd ODI Vs SA | Sakshi
Sakshi News home page

ఓట‌మి బాధ‌లో ఉన్న ఆసీస్‌కు షాక్‌.. స్వ‌దేశానికి స్టార్ ఆట‌గాడు!

Sep 26 2026 5:53 PM | Updated on Sep 26 2026 6:56 PM

Big Blow-Australia-Josh-Inglis-Returns-Home-Injury-2nd ODI Vs SA

Photo Credit: Twitter

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ను ఓట‌మితో ఆరంభించిన ఆస్ట్రేలియా జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు, వికెట్ కీప‌ర్ జోష్‌ ఇంగ్లిస్ గాయంతో వ‌న్డే సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. డ‌ర్బన్ వేదిక‌గా జ‌రిగిన‌ తొలి వ‌న్డేలో కీపింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఇంగ్లిస్ కుడిచేయి చూపుడువేలికి బంతి బ‌లంగా త‌గిలింది. చికిత్స అనంత‌రం ఇంగ్లిస్ బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డాడు. 

మ్యాచ్ అనంత‌రం ఇంగ్లిస్ గాయాన్ని ప‌రిశీలించ‌గా, చూపుడువేలిలో చీలిక వ‌చ్చిన‌ట్లు తేలింది. దీంతో ఇంగ్లిస్‌ను చికిత్స కోసం స్వ‌దేశానికి తిరిగిరావాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పెర్త్‌లో ఇంగ్లిస్ చేతి వేలి గాయానికి ట్రీట్‌మెంట్ తీసుకోనున్నాడు. వ‌న్డే సిరీస్‌కు దూర‌మైన జోష్ ఇంగ్లిస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది అత‌డు కోలుకోవ‌డంపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.

అయితే మిగిలిన మ్యాచ్‌ల‌కు ఇంగ్లిస్ స్థానంలో ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఆట‌గాడిని ఎంపిక చేయ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో రేపు జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో వ‌న్డేలో అలెక్స్ కేరీ కీపింగ్ బాధ్య‌త‌లు తీసుకోనున్నాడు. డ‌ర్బ‌న్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన‌ తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా 67 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. 

రేపు జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో వ‌న్డేలోనూ విజ‌యం సాధించి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని స‌ఫారీలు భావిస్తుండ‌గా, రెండో వ‌న్డేలో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని ఆసీస్ భావిస్తోంది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశం  లేక‌పోలేదు.

తొలి వ‌న్డేకు దూరంగా ఉన్న రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ రెండో వ‌న్డేలో ఆడే అవ‌కాశ‌ముంది. అయితే మిచెల్ స్టార్క్‌, హాజిల్‌వుడ్ రెండో వ‌న్డేకు విశ్రాంతి తీసుకునే చాన్స్ ఉంది. వ‌చ్చే ఏడాది డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ నేప‌థ్యంలోనే ఆసీస్ జ‌ట్టు ప్ర‌ధాన బౌల‌ర్ల‌ను కాపాడుకోవాల‌నే ఉద్దేశంతోనే క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా ప్లాన్ చేసింది.

ఇక మూడో వ‌న్డే సెప్టెంబ‌ర్ 30న జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత ఇరుజ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అక్టోబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానుంది. డ‌ర్బ‌న్ వేదిక‌గా అక్టోబ‌ర్ 9 నుంచి 13 వ‌ర‌కు తొలి టెస్టు, అక్టోబ‌ర్ 18 నుంచి 22 వ‌ర‌కు గెహ్రా వేదిక‌గా రెండో టెస్టు, అక్టోబ‌ర్ 27 నుంచి 31 వ‌ర‌కు కేప్‌టౌన్ వేదిక‌గా చివ‌రి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఇదీ చదవండి: రేపు తొలి వ‌న్డే.. విండీస్‌కు అచ్చిరాని వేదిక‌; గ‌త రికార్డులు ఇలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement