గంభీర్‌తో వైభవ్ (PC: BCCI X)
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ.. గత కొన్నాళ్లుగా బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో అదరగొట్టినప్పటికీ.. ఈ పదిహేనేళ్ల పిల్లాడిని యాజమాన్యం వరుస మ్యాచ్‌లలో పక్కనపెట్టింది. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్ తిరిగి రాగా.. వైభవ్‌పై వేటు పడింది.
సంజూ కోసం తప్పదు
వైభవ్ సూర్యవంశీ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రపంచకప్ వీరుడు సంజూ కోసం అతడిని పక్కనపెట్టక తప్పదని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తుదిజట్టులో చోటు కోసం మరికొన్నాళ్లు చూడాల్సిందేనని కుండబద్దలు కొట్టాడు.
ఈ నేపథ్యంలో జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌లోనూ వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం భారత టీ20 జట్టు ఆసియా క్రీడలు-2026 టోర్నీ కోసం జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా ఈ ఈవెంట్లో నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
అయితే, ఈసారి కూడా వైభవ్ సూర్యవంశీకి మొండిచేయి చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ ఉన్నప్పటికీ త్వరలోనే ఈ బిహారీ పిల్లాడు కూడా తుదిజట్టులోకి వస్తాడని అంచనా వేశాడు.
వాళ్లిద్దరిలో ఒకరిని తప్పిస్తే వైభవ్‌కు లైన్ క్లియర్!
ఇందుకోసం తిలక్ వర్మ లేదంటే శివం దూబేను యాజమాన్యం పక్కనపెట్టాల్సి ఉంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘తిలక్ వైస్ కెప్టెన్ అన్న సంగతి నాకూ తెలుసు. అయితే, గతంలో వైస్ కెప్టెన్‌ను కూడా తుదిజట్టు నుంచి తప్పించిన దాఖలాలు ఉన్నాయి.
మరోవైపు.. శివం దూబే. అతడి ఆటలో నిలకడ లేదు. ఫీల్డింగ్‌లో కూడా బలహీనంగా ఉన్నాడు. అతడు సరైన బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా కాదు. కేవలం బ్యాటర్‌గానే తుదిజట్టులో ఉంటున్నాడు. కాబట్టి ఆరు నెలల తర్వాత తిలక్ లేదంటే దూబే తుదిజట్టు నుంచి కనుమరుగు కావడం ఖాయం.
వీరిద్దరిలో ఒకరిని తప్పించి వైభవ్‌కు మార్గం సుగమం చేస్తారనుకుంటున్నా. నా ప్రస్తుత అభిప్రాయం. ఆసియా క్రీడల్లో వైభవ్‌ను తప్పక ఆడించాలి.
బౌలర్ యశ్ ఠాకూర్‌కు ఇంకా తనను తాను పూర్తిగా నిరూపించుకోలేదు. కాబట్టి అతడిని పక్కనపెట్టవచ్చు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 మ్యాచ్‌లు ఆడి 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.


