బిడ్డను బడికి పంపాలంటేనే.. భయంగా ఉంది | School or Fear: What Happens When Punishment Goes Too Far | Sakshi
Sakshi News home page

బిడ్డను బడికి పంపాలంటేనే.. భయంగా ఉంది

Aug 21 2026 8:05 AM | Updated on Aug 21 2026 8:25 AM

School or Fear: What Happens When Punishment Goes Too Far

ఆ వీడియోలు చూస్తే ప్రతి తల్లిదండ్రి గుండెల్లో ఒకటే ప్రశ్న.. ‘స్కూల్‌కు పంపిన నా బిడ్డ సురక్షితంగా ఇంటికి తిరిగొస్తారా?’.. మొన్న రాజస్థాన్‌ జైపూర్‌లో అమైరా.. నిన్న విశాఖపట్నంలో ఆరేళ్ల ఎల్‌కేజీ విద్యార్థి ప్రణయ్‌ తేజ మృతి ఘటనలు.. ప్రతి తల్లిదండ్రినీ కలవరపెడుతున్న ప్రశ్నలుగా మారాయి.

విశాఖపట్నంలో హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో టీచర్‌ బాలుడిని మందలించడం, కొట్టడం.. ఆ తర్వాత చిన్నారి ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం కలచివేస్తోంది. అయితే బాలుడి మృతికి అసలు కారణం ఏంటన్నది పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే ఈ ఘటన మరో పెద్ద ప్రశ్నను మన ముందుంచింది. పిల్లలను క్రమశిక్షణలో పెట్టేందుకు ‘పనిష్మెంట్‌’ అవసరమా? లేక ఆ పేరుతో మనం వాళ్లలో భయాన్ని పెంచుతున్నామా?..

వీడియో చూస్తున్నప్పుడు కోపం రావడం సహజం. ఒక పసివాడిని భయపెట్టి, కొట్టడం సమర్థించలేం. అదే సమయంలో ఒక ప్రశ్న కూడా వెంటాడుతుంది.. ఆ టీచర్‌ కూడా ఓ బిడ్డకు తల్లే అయ్యి ఉండొచ్చు కదా? తన పిల్లవాడిని ఎవరైనా ఇలా భయపెడితే ఆమె ఎలా స్పందిస్తారు?. ఇక్కడ సమస్య ఒక్క టీచర్‌తో ముగిసేది కాదు. పిల్లలపై చేయి చేసుకోవడం తప్పు అని తెలిసినా.. ‘కొంచెం కొడితేనే చదువుకుంటారు’, ‘భయపెడితేనే మాట వింటారు’ అనే పాత ఆలోచన టీచర్లలోనే కాదు తల్లిదండ్రుల్లోనూ ఇంకా ఎందుకు బతికే ఉంది?.

ఆరేళ్ల పిల్లవాడికి హోంవర్క్‌ పూర్తి చేయకపోవడం ఒక ‘నేరం’ కాదు. అతడి వయసుకు తగ్గ కారణం ఉండొచ్చు. అర్థం కాకపోయి ఉండొచ్చు. ఆడుకోవాలనిపించి ఉండొచ్చు. అలసిపోయి ఉండొచ్చు. చెప్పలేని భయం ఏదైనా ఉండొచ్చు. అతడిని కొట్టడం కంటే.. ‘హోంవర్క్‌ ఎందుకు చేయలేకపోయావు?’ అని అడగాల్సింది.

స్కూల్‌ అంటే భయపడాలా?
ఒక పిల్లవాడు టీచర్‌ను చూస్తే భయపడుతున్నాడంటే అది క్రమశిక్షణ కాదు. అతడు తప్పు చేసినప్పుడు తన మాట చెప్పగలిగేంత భద్రతను అనుభవించాలి. స్కూల్‌ అంటే భయపడాల్సిన చోటు కాదు.. నేర్చుకోవడానికి, తప్పులు చేయడానికి, వాటిని సరిదిద్దుకోవడానికి సురక్షితమైన స్థలం.

ఇక్కడే రాజస్థాన్‌లోని అమైరా ఘటనను మరోసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి తనకు ఎదురవుతున్న ఇబ్బందిని మాటల్లో చెప్పేందుకు, సహాయం కోసం టీచర్‌ను ఆశ్రయించేందుకు ప్రయత్నించినట్లు ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలు చూపించాయి. కానీ ఆ చిన్నారి ఆర్తనాదాన్ని సకాలంలో ఎవరైనా గుర్తించారా? ఆమె ప్రవర్తనలో కనిపించిన ఆందోళనను ఎవరైనా అర్థం చేసుకున్నారా? అనే ప్రశ్నలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. పిల్లలు ప్రతిసారీ ‘నాకు సమస్య ఉంది’ అని స్పష్టంగా చెప్పలేరు. వారి ఏడుపు, భయం, ప్రవర్తనలో మార్పు.. ఇవన్నీ కూడా సహాయం కోసం చేసే పిలుపులే కావచ్చు.

మానసికంగా చూస్తే చిన్నారులపై శారీరక శిక్ష తక్షణ భయాన్ని కలిగించవచ్చు. కానీ దీర్ఘకాలంలో చదువుపై ఆసక్తి తగ్గడం, ఆత్మవిశ్వాసం దెబ్బతినడం, పెద్దలను చూసి భయపడటం, సమస్య వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ‘పనిష్మెంట్‌’కు బదులుగా పాజిటివ్‌ డిసిప్లిన్‌ అవసరం.

..అయితే పరిష్కారం ఏంటి?

  1. పాఠశాలల్లో పిల్లలపై చేయి చేసుకోవడం, అవమానించడం, బెదిరించడం విషయంలో జీరో టాలరెన్స్‌ ఉండాలి. ప్రతి పాఠశాలలో ఫిర్యాదు వ్యవస్థ ఉండాలి. పిల్లలు నేరుగా చెప్పలేకపోయినా.. తల్లిదండ్రులు, కౌన్సిలర్‌ లేదా నమ్మకమైన ఉపాధ్యాయుడికి విషయం చేరే మార్గం ఉండాలి.

  2. ఉపాధ్యాయులకు కేవలం సబ్జెక్ట్‌ బోధనే కాదు.. చైల్డ్‌ సైకాలజీ, కోపాన్ని నియంత్రించుకోవడం, పాజిటివ్‌ డిసిప్లిన్‌పై తప్పనిసరి శిక్షణ ఇవ్వాలి. ఒత్తిడిలో ఉన్న టీచర్‌కు కూడా కౌన్సెలింగ్‌ అవసరమే.

  3. తల్లిదండ్రులు ప్రతిరోజూ ఒక్క ప్రశ్న అడగాలి. “ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు?”. అంతేకాదు.. “ఎవరైనా నిన్ను కొట్టారా? భయపెట్టారా? నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించిందా?”.. అని కూడా ప్రేమగా అడగాలి. ఎందుకంటే పిల్లలు తమ బాధను చెప్పడం నేర్చుకున్నప్పుడే మనం వారిని రక్షించగలం.

ఒక చిన్నారి స్కూల్‌ బ్యాగ్‌లో పుస్తకాలు మాత్రమే ఉండాలి.. మనసులో భయం కాదు. టీచర్‌ చేతిలో చాక్‌ ఉండాలి.. పిల్లల మీద కోపం కాదు. తల్లిదండ్రుల గుండెల్లో నమ్మకం ఉండాలి.. ఏదో ఆందోళన కాదు. పనిష్మెంట్‌తో పిల్లలను మార్చలేం.. ప్రేమతో, ఓర్పుతో, అర్థం చేసుకోవడంతోనే వారి భవిష్యత్తును మార్చగలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement