ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు తన ప్రాధాన్యం కాదని ఆయన చెప్పారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే పని చేస్తున్నానని ఆయన అన్నారని ఎల్లో మీడియా అత్యంత ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. ఇండియా టుడే మీడియా కేరళంలో నిర్వహించిన ఒక సదస్సులో సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
నిజంగా ఆయన అదే ప్రకారం పనిచేస్తే మంచిదే. కాని ప్రస్తుతం షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాలలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిలో లేరన్న మాట మినహాయించి, ప్రభుత్వంలో లోకేష్‌కు తెలియకుండా ఏమి జరగవన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఇది ఏమైనా మంచి పనుల కోసం అయితే ఫర్వాలేదు. పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాని రెడ్‌బుక్ పేరుతో ఏపీలో సాగుతున్న అరాచకాలన్నిటికి ఆయనే బాధ్యుడున్న విమర్శ వైఎస్సార్‌సీపీతో సహా వివిధ సంఘాలు చేస్తుంటాయి. ఇందులో చాలావరకు నిజం ఉందనిపించేలా ఆయన పార్టీ సమావేశాలలో వైఎస్సార్‌సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టించడం గురించి రెడ్‌బుక్ పేజీలు అంటూ ప్రసంగిస్తుంటారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని రెచ్చగొట్టేవారు. అధికారంలోకి వచ్చాక టీడీపీవారిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయించే పనిలో ఉన్నారు. ఎక్కడైనా అలా ఎత్తివేయకపోతే డీజీపీని పంపిస్తానని ముఖ్యమంత్రి మాదిరే ప్రకటనలు చేశారు. నిజానికి ఇదంతా సీఎం లేదా, హోం మంత్రి పరిధిలో ఉండే విషయం. అయినా పెత్తనం అంతా లోకేష్‌దే అన్నమాట.
ఇక పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఎక్కడ ఉంటారో తెలియదు. కాని మొత్తం ఆ పరిశ్రమకు సంబంధించిన అంశాలన్నిటిపైన నిర్ణయాలు ఈయనే ప్రకటిస్తుంటారు. విదేశాలకు టూర్లు వెళుతుంటారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లినా పారిశ్రామికవేత్తలతో తాను చర్చలు జరుపుతానని ఆయనే ఈ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 99 పైసలకే పరిశ్రమలకు భూములు ఇస్తా.. తన ఇష్టం అన్నట్లుగా కొంతకాలం క్రితం ఆయన మాట్లాడారు. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా అదే పరిస్థితి. లోకేష్ పేషీకి తెలియకుండా బిల్లులు పాస్ అవడం అరుదని చెబుతున్నారు.
గత టరమ్‌లో టీడీపీ ప్రభుత్వంలో చెట్టు-నీరు స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వేల కోట్ల అవినీతి టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసింది. దాని ప్రకారం కొందరి బిల్లులు నిలిచిపోయాయి. ఈసారి టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటున్నారట. లోకేష్ ఏ బిల్లుల గురించి చెప్పారో కాని, ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తాము ఇప్పటికే చాలావరకు బిల్లులు క్లియర్ చేశామని, మరో 200 కోట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో ఆర్దిక మంత్రి ప్రస్తావనను తెచ్చినప్పటికి అది నామమాత్రమే అన్నది తెలుస్తూనే ఉంది.
ప్రభుత్వ విషయాలలోనే కాదు.. పార్టీ వర్కింగ్ అధ్యక్షుడి హోదాలో కూడా ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు 15 శాతం సీట్లే ఇస్తామని స్పష్టం చేసింది కూడా ఆయనే. ఒకవైపు పార్టీపరంగా సమావేశాలు నిర్వహిస్తూ, మరో వైపు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ, ఇంకో వైపు తన ఇమేజీని పెంచుకోవడం కోసం ఎల్లో మీడియాను, ఐటీడీపీ తదితర సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు.
సాధారణంగా దేశస్థాయిలో జరిగే సదస్సులకు చంద్రబాబే వెళుతుండేవారు. కాని ఈ మధ్యకాలంలో ఢిల్లీ, లేదా ముంబై తదితర నగరాలలో జాతీయ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు లోకేషే హాజరవుతున్నారు. ఆయా సభలలో లోకేష్, చంద్రబాబులు పరస్పరం పొగుడుకోవడం, తండ్రికి బహిరంగ కార్యక్రమాలలో పాదాభివందనం చేస్తున్న ఘట్టాలు అందరు గమనిస్తున్నవే. ఇదంతా పీఆర్‌లో భాగమేనని వేరే చెప్పనవసరం లేదు.
ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?
కాగా, డీఎస్సీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు యధా ప్రకారం తండ్రి మాదిరి అసత్యాలు చెప్పడానికి ఆయన పెద్దగా ఫీల్ అవలేదు. ఎన్నికల కమిషన్‌పై వచ్చిన విమర్శలకు కూడా ఆయన ఇచ్చిన జవాబు తన తండ్రికే వర్తిస్తుందన్న సంగతి ఆయన గమనించనట్లే వ్యవహరించారు. గతంలో ఓటమి ఎదురైనప్పుడు ఈసీపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసింది తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే తనకు సీఎం పదవి ఇప్పుడు ప్రాధాన్యం కాదని ఆయన చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే సీఎం పదవిలో లేరన్నమాటే కాని, మొత్తం అధికారం అంతా ఆయన చేతిలోనే ఉందని చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆఫీస్ వద్దే జనం ఎక్కువగా కనిపిస్తారట.
2014 టరమ్‌లో లోకేష్ ఎన్నికలలో పోటీచేయలేదు. కాని పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలానికి చంద్రబాబుపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి, ఆ తర్వాత మంత్రిగా చేయించారని అంటారు. అప్పట్లో షాడో ముఖ్యమంత్రి అన్న విమర్శ రాలేదు. ఆ తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి జనంలో తిరగడానికి కృషి చేశారు. వాటిలో యువగళం ఒకటి.
2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు ప్రధానంగా పర్యటనలు, ఉపన్యాసాలకే పరిమితం అవుతుంటే, లోకేష్ కథ నడుపుతున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా చంద్రబాబుతో దాదాపు సమానంగా సానుకూల కథనాలు అనండి.. భజన స్టోరీలు అనండి.. నిత్యం ఇస్తుంటాయి. లోకేష్‌ను సీఎం చేయాలన్న వాదన కుటుంబంలోను, ఆయన మద్దతుదారులలో బలంగా ఉన్నప్పటికి, వివిధ కారణాల రీత్యా అది జరగడం లేదన్న అభిప్రాయం ఉంది.
ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేయవలసి ఉందని అంటారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను అన్న అని లోకేష్ సంభోధించడమే కాక, సభలలో వారిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నిస్తున్నారు. పవన్ ఈయనను ఓరే అన్నంత చనువు ఉన్నంతగా ఆ మధ్య చెప్పారు. కాని పవన్ అసలు ఎవరిని ఓరేయ్, అరేయ్ అనరని ఆయన మద్దతుదారులు చెబుతూ లోకేష్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది వేరే కథ. బహుశా తను సీఎం పదవి తీసుకున్నా పవన్ సహకారం అవసరమన్న భావనతో ఆయనతో సలహా, సంప్రదింపులు జరుగుతున్నాయన్న అభిప్రాయం కల్పించడం లోకేష్ లక్ష్యం కావచ్చు. కాని, పవన్‌కు తెలియకుండానే ప్రభుత్వంలోని అనేక విషయాలు జరుగుతుంటాయి. డీఎస్సీకి అక్రమాల ఆరోపణలపై పవన్ ఇంతవరకు ప్రత్యక్షంగా లోకేష్‌కు మద్దతుగా ఖండన ఇవ్వకపోవడం కూడా గమనించదగిందే.
ఇక్కడ మరో విషయం గుర్తు చేయాలి. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవిని రెండేళ్లపాటు పవన్ కళ్యాణ్‌కు కూడా ఇవ్వాలని జనసేనలో కొందరు ప్రచారం చేశారు. కాని మొహమాటం లేకుండా అది కుదిరే పని కాదని లోకేష్ మీడియా ముందు ఆ రోజుల్లోనే కుండబద్దలు కొట్టారు. బహుశా ఆ అవకాశం పవన్‌కు వస్తే తన భవిష్యత్తుకు అడ్డంకి అవుతుందని అనుకొని ఉండవచ్చు. అంతేకాక పవన్‌కు డిప్యూటి సీఎం పదవిపై కూడా టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ కాకుండా సర్దుకుపోయారు. ఇప్పుడు పవన్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో బయటపడడం లేదు. లోకేష్ తనకు సీఎం పదవి ప్రాధాన్యం కాదని అన్నారే తప్ప, ఈ టరమ్ అంతా చంద్రబాబే సీఎంగా ఉంటారని, వచ్చే ఎన్నికలలో సీఎం అభ్యర్ధి కూడా ఆయనే అని లోకేష్ స్పష్టంగా చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.
2029 ఎన్నికలలో లోకేష్‌నే సీఎం అభ్యర్ధిగా ఫోకస్ చేస్తారా? లేదా? అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలం క్రితం లోకేష్ సీఎం కాబోతున్నారంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. కాని అది జరగలేదు. ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలలో ఒక వైఎస్ జగన్ తప్ప మరే సీఎం కుమారుడు, లేదా కుమార్తె ముఖ్యమంత్రులు కాలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం కోసం లోకేష్ ఎదురుచూస్తుండవచ్చు.
1986 ప్రాంతంలో ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను వారసుడుగా ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకుని వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి ఆ ప్రకటనను ఉపసంహరింప చేశారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కాని ఆ తర్వాత అతనిలో ఉన్న పొటెన్షియాల్టిని గమనించి, లోకేష్ భవిష్యత్తుకు ఆటంకం అవుతాడని సందేహించి ఆయనను పక్కన పెట్టేశారని చెబుతారు. ఒకప్పుడు ఎన్టీఆర్ వద్ద కర్షక పరిషత్ చైర్మన్‌గా ఉంటూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చక్రం తిప్పారు. ఇప్పుడు లోకేష్ ఆ పాత్ర పోషిస్తున్నారు.
లోకేష్ తన కుమారుడు కనుక వారసత్వ, కుటుంబ రాజకీయాల సమస్య, విమర్శలు రావని చంద్రబాబు భావిస్తుండవచ్చు. అందుకే పార్టీలోను, ప్రజలలోను లోకేష్ పట్ల సానుకూలత పెంచేందుకు వివిధ ప్లాన్‌లు అమలు చేసున్నారనుకోవచ్చు. కాలచక్రం అలా ఉంటుందన్నమాట. కాకపోతే లోకేష్ పాజిటివ్ కోణం కన్నా, నెగిటివ్ ధోరణిలోనే ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లోకేష్ కోరిక ఈ టరమ్‌లో తీరుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే. మనసులో ఎంత బలమైన కోర్కె ఉన్నా కొంత కాలం అణచుకోక తప్పదు కదా!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


