టీచర్‌ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి | UKG student dies after being beaten by teacher | Sakshi
Sakshi News home page

టీచర్‌ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి

Aug 21 2026 5:19 AM | Updated on Aug 21 2026 5:19 AM

UKG student dies after being beaten by teacher

హోంవర్క్‌ చేయలేదనే కోపంతో చేయిచేసుకున్న ఉపాధ్యాయురాలు  

పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన  

డాబాగార్డెన్స్‌ (విశాఖపట్నం):  హోంవర్క్‌ చేయలేదన్న కోపంతో టీచర్‌ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందిన ఘటన విశాఖపట్నం పాత నగరంలోని లిటిల్‌ గార్డెన్‌ స్కూల్‌లో గురువారం జరిగింది. హోంవర్క్‌ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించి, కొట్టిన తర్వాతే బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు.  పాతనగరం ఏవీఎన్‌ కళాశాల డౌన్‌రోడ్డు సమీపంలో కృష్ణప్రసాద్, సాయిలక్ష్మి దంపతులు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ప్రణయ్‌తేజ్‌ (6) రీడింగ్‌రూమ్‌ సమీపంలోని లిటిల్‌ గార్డెన్‌ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. 

గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే బాలుడికి అస్వస్థతగా ఉందని తల్లిదండ్రులకు సమాచారం అందింది. హోంవర్క్‌ చేయలేదని ఉపాధ్యాయురాలు ప్రణయ్‌తేజ్‌ను మందలించడంతోపాటు చెంపపై కొట్టారు. అనంతరం ఉపాధ్యాయురాలిపైనే బాలుడు కుప్పకూలాడు.  కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా బాలుడు మృతి చెందాడు. పాఠశాల సీసీ కెమెరాలో ఉపాధ్యాయురాలు బాలుడి చొక్కా పట్టుకుని తనవైపు లాగుతున్నట్లు, బాలుడు తనను కొట్టొద్దంటూ చేతులతో సైగలు చేస్తున్నట్లు కనిపించింది.

అనంతరం ఉపాధ్యాయురాలు చెంపపై కొట్టిన వెంటనే ఆమెపైనే బాలుడు కుప్పకూలిపోయాడు. కేజీహెచ్‌లో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయురాలు, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement