Representative image
భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త, టీసీఐ ఎక్స్‌ప్రెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ అగర్వాల్ తన మాజీ ప్రేయసి ఫెలిషియా లీ నుంచి సుమారు రూ.3.5 కోట్లు తిరిగి ఇప్పించాలంటూ దాఖలు చేసిన కేసును సింగపూర్ హైకోర్టు కొట్టివేసింది. ఆ మొత్తం రుణంగా ఇచ్చినట్లు నిరూపించే ఆధారాలు లేవని, ఎక్కువ భాగం ఖర్చులు బహుమతులేనని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మాజీ ప్రేయసి న్యాయ ఖర్చులను కూడా చందర్ చెల్లించాలని ఆదేశించింది.
చందర్, ఫెలిషియా లీ తొలిసారి 2019లో విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. అనంతరం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం కొనసాగింది. 2022 సెప్టెంబర్‌లో వారి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. అయితే అంతకుముందు నుంచే చందర్ ఆమె కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని కోర్టులో వెల్లడైంది.
లూయీ విట్టాన్ హ్యాండ్‌బ్యాగ్, ప్రాడా వోచర్లు, ఆపిల్ హెర్మిస్ గడియారాలు వంటి ఖరీదైన వస్తువులను ఆయన కొనిచ్చారు. బార్సిలోనా, లిస్బన్, లండన్ పర్యటనలకు సంబంధించిన విమానాలు, హోటళ్లు, షాపింగ్ ఖర్చులను కూడా భరించారు. 2023 డిసెంబర్‌లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మార్చి 2024లో చందర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించి 4,68,090 సింగపూర్ డాలర్లు, అంటే దాదాపు రూ.3.5 కోట్లు తిరిగి ఇప్పించాలని కోరారు. ఇవి బహుమతులు కాదని, వడ్డీ లేని రుణంగా ఇచ్చిన డబ్బు అని ఆయన వాదించారు.
అయితే లీ ఆ వాదనను తిరస్కరించారు. సంబంధం కొనసాగిన సమయంలో తనపై చేసిన ఖర్చులన్నీ స్వచ్ఛందంగా ఇచ్చిన బహుమతులేనని, విడిపోయిన తర్వాత తిరిగి చెల్లించాలనే ఒప్పందం ఎప్పుడూ లేదని తెలిపారు. రుణంగా ఇచ్చినట్లు నిరూపించే స్పష్టమైన ఒప్పందం లేదా ఆధారాలు కూడా కోర్టుకు లభించలేదు. సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పులో కోర్టు చందర్ వాదనను తోసిపుచ్చింది. ఇక ఈ కేసులో ముందుకు వచ్చే అంశం న్యాయస్థానం ఆదేశించిన న్యాయ ఖర్చుల చెల్లింపే.


