బ్రిక్స్‌ సూపర్‌ సక్సెస్‌! | Sakshi Editorial On BRICS Summit super success | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ సూపర్‌ సక్సెస్‌!

Sep 16 2026 12:48 AM | Updated on Sep 16 2026 1:10 AM

Sakshi Editorial On BRICS Summit super success

చేరుకోవాల్సిన లక్ష్యంపై స్పష్టత, అందుకు అనుసరించాల్సిన మార్గంపై ఏకాభిప్రాయం సాధించగలిగితే శిఖరాగ్ర సమావేశాలు విజయవంతమవుతాయి. ఆ రెండూ లేకుంటే ఉత్త లాంఛనప్రాయ సమావేశాలుగా మిగులుతాయి. ఆ కోణంలో శని, ఆదివారాల్లో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ఘన విజయం సాధించినట్టు లెక్క. అలాగని ఈ సమావేశాలు సమీప భవిష్యత్తులో బ్రిక్స్‌ కరెన్సీని తీసుకురావాలని నిర్ణయించలేదు. అలాగే ఎడాపెడా సుంకాలు విధిస్తున్న అమెరికాను నిలదీయలేదు. పశ్చిమాసియా కల్లోలానికి నువ్వే కారణమని వేలెత్తి చూపలేదు. ఈ అంశాల్లో లౌక్యం ప్రదర్శిస్తూనే చేయదల్చుకున్నది చేయటంలో బ్రిక్స్‌ సఫలీకృతమైంది. ఇవి మాత్రమే కాదు... పరస్పరం కలహించుకుంటున్న ఇరాన్, దాని ప్రత్యర్థులు యూఏఈ, సౌదీలను సమావేశాలకు రప్పించగలిగింది. పైగా ఇరాన్, యూఏఈ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. దక్షిణ చైనా సముద్రం విషయంలో విభేదాలున్న చైనా, ఫిలిప్పీన్స్‌ కూడా సదస్సుకు హాజరయ్యాయి. భారత్, చైనాల వివాదం సరేసరి. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు గల దేశాలన్నీ ఒక ఉమ్మడి డిక్లరేషన్‌ ప్రకటించటం చిన్న విషయం కాదు. అతిథేయ దేశంగా భారత్‌ ప్రత్యేక కృషి ఇందులో కనబడుతుంది. సభ్య దేశాలతో ఓపిగ్గా చర్చించాలి. ఒప్పించాలి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన టీమ్‌ ఆ పని చేయగలిగినందుకు అభినందించాలి.

ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో దక్షిణార్ధ గోళ దేశాల స్వరం వినిపించటంలో ఏదోమేరకు కృషి చేసిన అలీనోద్యమ సంస్థతో బ్రిక్స్‌కు పోలికలున్నాయి. కానీ వాటిమధ్య వ్యత్యాసం కూడా ఉంది. అప్పటి ద్విధ్రువ ప్రపంచంలో స్వతంత్రంగా మనగలగటానికి అవసరమైన ఆర్థిక సంపత్తి అలీనోద్యమానికి లేదు. బ్రిక్స్‌ అలా కాదు. అందులో పూర్తి స్థాయి సభ్యత్వంగల 11 దేశాలను చూసినా వాటి ఉమ్మడి దేశీయోత్పత్తి (జీడీపీ) వాటా ప్రపంచ జీడీపీలో 40 శాతం. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉంది. ప్రపంచంలో చైనా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ. రష్యావద్ద అపారమైన చమురు నిక్షేపాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయి. మనతోసహా బ్రిక్స్‌ దేశాలన్నీ ఆర్థికంగా చురుగ్గా ఎదుగుతున్న దేశాలు. బ్రెజిల్‌ అయితే దక్షిణమెరికా ఆర్థిక వ్యవస్థల్లో అతి పెద్దది. ఇవన్నీ సమష్టిగా దక్షిణార్ధ గోళ దేశాలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నాయి. 

ఇన్ని అనుకూలాంశాలున్నా అమెరికాపై నేరుగా ధిక్కార స్వరం వినిపించనప్పుడు ప్రయోజనమేమిటన్న సందేహం వస్తుంది. ఆ ప్రక్రియ క్రమబద్ధంగా సాగాలి. భద్రతా మండలి, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర సంస్థల్లో వర్ధమాన దేశాలకు మరింత మెరుగైన చోటీయాలని బ్రిక్స్‌ కోరుతోంది. కానీ అది అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే డిమాండ్‌గా మారకుండా సదస్సు జాగ్రత్తపడింది. డాలర్‌ వాడకాన్ని క్రమేపీ తగ్గించుకునే ప్రక్రియలోనూ అదే ఎత్తుగడ పాటించింది. ఆ దిశగా అడుగులేస్తే బ్రిక్స్‌ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయటానికి ముందే 2024 డిసెంబర్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఆ బెదిరింపుల్ని ఆయన అడపా దడపా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌ ఉనికిలో లేకుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది మరి! 

అందుకే కావొచ్చు... ఆ విషయంలో బ్రిక్స్‌ సంయమనం పాటించింది. అది వేరే రూపంలో ఇప్పటికే అమలవుతోంది. చైనా, రష్యా 90 శాతం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమ తమ కరెన్సీల్లో జరుపుకొంటున్నాయి. రష్యా చమురు విక్రయాలకు మన దేశం రూపా యిల్లో చెల్లించింది. డాలర్‌ రద్దు చేయకుండానే దాని వాడకాన్ని తగ్గించటం బ్రిక్స్‌ దేశాలు ఎంచుకున్న పద్ధతి. ఐఎంఎఫ్‌ డేటా ప్రకారం ఇప్పటికీ ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్‌ వాటా 56.77 శాతం. యూరో కరెన్సీ వాటా 20.25 శాతం. చైనా కరెన్సీ రెన్‌మిన్‌బి(ఆర్‌ఎంబీ) వాటా కేవలం 1.95 శాతం. డాలర్‌ నిల్వలు పుష్కలంగా ఉన్న చైనా మరో కరెన్సీని వినియోగించాలనుకున్నా దానికే నష్టం. మనకూ ఆ సమస్యవున్నా, అమెరికా ఆధిపత్యం స్థానంలో చైనాను అంగీకరించటానికి సిద్ధపడలేం. ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో ఎవరి జాగ్రత్తలు వారివి. ఈ దశలో అస్పష్టతతోనైనా బ్రిక్స్‌ ఉమ్మడి ప్రకటన వెలువరించటం దానికదే ఘన విజయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement