మొన్నీమధ్యే రోబోట్ గేమ్స్‌తో అబ్బురపరిచిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు మరో టెక్నాలజీ మాయాజాలంతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇప్పటివరకు డ్రోన్లు అంటే ఆకాశంలో ఎగిరేవే.. కానీ చైనా మాత్రం వాటి పరిధిని నీటి అడుగునకూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అచ్చం చేపలా కనిపిస్తూ.. చేపలాగే ఈదుతూ.. నీటిలో తన ఉనికి ఏమాత్రం అనుమానం రాకుండా కదిలే ఓ రోబోటిక్ చేపను అభివృద్ధి చేసింది. దూరం నుంచి చూస్తే నిజమైన చేపే అనిపించే ఈ యంత్రం.. దగ్గరగా పరిశీలిస్తే మాత్రం సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికతతో కూడిన నిఘా రోబోగా కనిపిస్తుంది.
బీజింగ్‌లోని షౌగాంగ్ పార్క్‌లో జరుగుతున్న 2026 చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ (CIFTIS)లో రోబో చేప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు మూడు కిలోల బరువు ఉన్న ఈ బియోనిక్ రోబో చేప పేరు.. గోల్డెన్ డ్రాగన్ ఫిష్(BG-5). గోల్డెన్ అరోవానా చేపకు జిరాక్స్‌లా ఉందది. అంతేకాదు.. నీళ్లలో ఈదుతూ.. అడ్డంకులు ఎదురైతే తన దారిని తానే మార్చుకుంటూ ముందుకు సాగింది. దీనికి ఏ రిమోట్ అక్కర్లేదు. ఏ ప్రొగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు. లోపల మాత్రం మోటార్లు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉంటాయి. సాధారణ అండర్‌వాటర్ డ్రోన్లు ప్రొపెల్లర్లతో కదులుతాయి. కానీ ఇది మాత్రం తోకలో ఉండే 3 కదిలే జాయింట్లు, 7 సెగ్మెంట్లు ఉంటాయి. వాటిని ఊపుతూ ముందుకు సాగుతూ నీటిలో అలల తరహా కదలికలను చూపిస్తుంది. దీంతో ఏదో యంత్రం కదులుతున్నట్లు కాకుండా.. అచ్చం జీవం ఉన్న చేప ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ సహజమైన కదలికే దీని అసలు బలం.
3 కిలోలే.. కానీ టెక్నాలజీ మాత్రం భారీదే!
BG-5 పరిమాణం చూస్తే ఆశ్చర్యమే. ఇది సుమారు 640 మిల్లీమీటర్ల పొడవు, 204 మిల్లీమీటర్ల వెడల్పు, 90 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. బరువు కేవలం 3 కిలోలు. గరిష్టంగా 5 మీటర్ల లోతులో పనిచేయగలదు. గరిష్ట వేగం సెకనుకు 0.6 మీటర్లు. అంటే ఇది సముద్రంలో నిఘాకు పనికి రాదన్నమాట!. తక్కువ లోతున్న నీళ్లలో పని చేసే రోబో మాత్రమే.
Look at the quality of this fish drone that China just revealed pic.twitter.com/v24asLP4d1
— The Gulag (@WelcomeTheGulag) September 15, 2026
అయితే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో గూఢచర్యానికి ఉపయోగపడుతుందా? అనే ఆందోళనను కూడా రేకెత్తిస్తోంది. దాని చుట్టూ ఉన్న సెన్సార్లు.. ఏదైనా ఆటంకాలు ఎదురైతే దానంతట అదే తప్పించుకుని ముందుకు సాగుతుంది. అంటే నీటిలో పరిస్థితులు మారినా.. ఎదురుగా ఏదైనా వస్తే ఆగిపోకుండా, దాన్ని తప్పించుకుని ఓ నిజం చేపలా ముందుకు వెళ్లగలదు. పైగా మనుషులు సాధారణంగా ఉపయోగించే అండర్‌వాటర్ డ్రోన్‌లా బయటికి యంత్రంలా కనిపించదు. దీంతో చేప రూపంలోనే నిఘా పెట్టే కొత్త రోబోను చైనా ప్రదర్శించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు మాయ ఇక్కడే..
ఒక పెద్ద అండర్‌వాటర్ డ్రోన్ నీటిలోకి వస్తే దాన్ని గుర్తించడం కొంత సులభం. కానీ చేపల గుంపులో ఒక చేపలా కనిపించే రోబోను గుర్తించడం అంత సులభం కాకపోవచ్చు. ఇదే కారణంగా BG-5ను షాలో-వాటర్ రీకానైసెన్స్, సర్వైలెన్స్ కోణంలో నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం చైనా సైనిక గూఢచర్యానికి ఉపయోగిస్తోందని నిర్ధారించే ఆధారం లేదు. కంపెనీ మాత్రం పౌర అవసరాలకూ ఉపయోగించవచ్చని చెబుతోంది.
కానీ, ఈ రోబోను తయారు చేసిన సంస్థకు రక్షణ రంగానికి సంబంధించిన అండర్‌వాటర్ రోబోటిక్స్‌లో పనిచేసిన నేపథ్యం ఉంది. ఈ సంస్థ గతంలో రోబో షార్క్ (ROBO-SHARK) అనే బయోమిమెటిక్ అండర్‌వాటర్ రోబోను సైనిక యూనిట్‌తో కలిసి అభివృద్ధి చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే నీటి అడుగున బయోమిమెటిక్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన రక్షణ ప్రాజెక్టులో పనిచేసినట్లు సంస్థే పేర్కొంది.
China will turn anything that moves into a spying machine—Chinese cars, Chinese products, and now even fish. China wants to control all of us. China is a real threat to the freedom of every person on the planet. pic.twitter.com/ycou8OaVQy
— Israel & World News (@Nonstopnews_) September 15, 2026
..గుంపుగా వస్తే?
ఇక్కడ ఇంకో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. BG-5కు సంబంధించిన రూట్ మ్యాప్, పనుల కేటాయింపు, ఫార్మేషన్ కంట్రోల్, బహుళ రోబోట్ల మధ్య సమన్వయం వంటి సామర్థ్యాలను కంపెనీ ప్రస్తావించింది. అంటే భవిష్యత్తులో ఒక్క రోబో చేప కాకుండా.. చేపల గుంపులా అనేక రోబోలు నీటిలోకి వెళ్లి, ఒక్కొక్కటి ఒక్కో ప్రాంతాన్ని గమనించే పరిస్థితి రావొచ్చు. ఒకటి సమాచారం సేకరిస్తే.. మరొకటి మరో ప్రాంతాన్ని పరిశీలించడం.. వాటన్నింటినీ సమన్వయం చేయడం సాధ్యమయ్యే దిశగా టెక్నాలజీ వెళ్తోంది.
ఇప్పటివరకు BG-5ను “స్పై ఫిష్” అని అధికారికంగా పిలవడం లేదు. కానీ దాని సహజమైన రూపం, స్వయంచాలకంగా దారి మార్చుకునే సామర్థ్యం, నీటి అడుగున పరిశీలనకు అనువైన డిజైన్, తయారీ సంస్థకు ఉన్న రక్షణ రంగ అనుసంధానాలు.. ఇవన్నీ కలిపి చూస్తే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో నిఘా, పరిశఋలన వంటి భద్రతా కార్యకలాపాలకు ఉపయోగపడే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేం.
యంత్రం యంత్రంలా కనిపించకుండా.. ప్రకృతిలోని జీవిలా కలిసిపోయేలా చేయడమే ఈ టెక్నాలజీ వెనుక అసలు ఆలోచన. నేడు చేప రూపంలో కనిపించిన ఈ రోబోట్.. రేపు పురుగు, తేనెటీగ, డ్రాగన్‌ఫ్లై రూపంలోనూ నిఘా కోసం రంగంలోకి దిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో! అసలు ప్రశ్న ఒక్కటే.. మన చుట్టూ కనిపిస్తున్న జీవుల్లో ఎన్ని నిజమైనవో.. ఎన్ని నిఘా యంత్రాలో గుర్తించడం ఎలా?.
ఇదీ చదవండి: కరాచీలో ‘ధురంధర్-3’ షూటింగ్


