మణిపూర్‌ను చక్కదిద్దలేరా! | Sakshi Editorial On Kuki–Naga conflict in Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్‌ను చక్కదిద్దలేరా!

Sep 19 2026 1:11 AM | Updated on Sep 19 2026 1:11 AM

Sakshi Editorial On Kuki–Naga conflict in Manipur

గత మూడేళ్లుగా అనుచిత కారణాలవల్లే ఎప్పుడూ వార్తల్లో ఉంటున్న మణిపూర్‌ మళ్లీ ప్రతీకారేచ్ఛతో రగులుతోంది. 2023 మేలో మొదలైన జాతుల ఘర్షణలు ఎప్పుడూ పెద్దగా ఆగిందేమీ లేదుగానీ... మీడియాలో ప్రముఖంగా వచ్చేంత పెద్ద సంఘటనలు జరగలేదు. కానీ ఆ స్వల్పకాల నిశ్శబ్దం కాస్తా గత ఆదివారం బద్దలైంది. ఆ రోజు తమెంగ్లాంగ్‌ జిల్లాలోని టోలెన్‌ గ్రామంలో వేకువజామున ఒక మహిళతో సహా నలుగుర్నిదుండగులు కాల్చిచంపారు. అటుతర్వాత సాయంకాలం అదే జిల్లాలో లోంగ్పి అనే గ్రామంలో ఒక యువకుణ్ణి, మహిళను కాల్చిచంపారు. 

మొదటి దాడి కుకీ ప్రాబల్య గ్రామంలో నాగాలే లక్ష్యంగా జరిగితే, రెండో దాడి నాగాలు మెజారిటీగావున్నచోట కుకీలపై జరిగింది. 1992–97 మధ్య కుకీ–నాగాల ఘర్షణల్లో బలైనవారి స్మారకార్థం ఆదివారం కుకీలు ‘బ్లాక్‌ డే’ పాటించిన రోజునే ఈ రెండు దాడులూ చోటుచేసుకోవడం గమనించదగింది. మణిపూర్‌ పలు జాతులకు నిలయం. ఇన్ని దశాబ్దాల పాలనలో భిన్న రాజకీయపక్షాల నాయకులు గద్దెనెక్కినా, ఏ ఒక్కరూ ఆ జాతులమధ్య సామరస్య వాతావరణాన్ని నెలకొల్పలేకపోయారు.

2023 నాటి ఘర్షణల సమయంలో అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రధాన తెగలైన మెయితీ–కుకీల మధ్య పరస్పర హననం సాగుతుంటే, దాన్ని భద్రతా బలగాలకూ, కుకీ మిలిటెంట్లకూ మధ్య సాగుతున్న ఘర్షణగా చిత్రించే యత్నం చేశారు. చివరకు భద్రతా బలగాలే బీరేన్‌ సింగ్‌ ప్రకటనను ఖండించాల్సి వచ్చింది. ఆ ఘర్షణల్లో దాదాపు 300 మంది మరణించగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ వారిలో చాలా మంది సహాయ శిబిరాల్లోనే బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది.

కొందరు ఇప్పుడిప్పుడే గ్రామాలకు వెళ్తున్న తరుణంలో మళ్లీ హింస చెలరేగింది. మెయితీల ఆధిక్యతగల ఇంఫాల్‌ లోయలో 2023లో వారివైపు నుంచి హింస మొదలైనప్పుడు అదుపు చేయగలిగి ఉంటే సమీప కొండ ప్రాంతాల్లోని కుకీలు రెచ్చిపోయేవారు కాదు. అయితే మూడేళ్లనాటి హింసకూ, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సాగుతున్న హింసకూ మౌలికంగా వ్యత్యాసం ఉంది. అప్పట్లో వందలమంది గుంపులుగా ఊళ్లపైబడి దాడులు చేశారు. ఇళ్లకు నిప్పంటించటం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడటంవంటివి చోటు చేసుకున్నాయి. 

కానీ ఇప్పుడు చడీచప్పుడూ లేకుండా వచ్చి దాడులు చేసి పోతున్నారు. అలాగే మొన్నటివరకూ ప్రధానంగా మెయితీ–కుకీ తెగలమధ్యే ఘర్షణలుండగా, మూడు దశాబ్దాల క్రితం నాటి ఉదంతాలను గుర్తు తెస్తూ ఇప్పుడు కుకీ–నాగా జాతులమధ్య వైరం సాగుతోంది. మెయితీలు తమను సైతం గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్‌ చేయగా, దాన్ని కుకీలు వ్యతిరేకించారు. ఇప్పుడు కుకీలు, నాగాలూ క్రైస్తవులే అయినా వారిమధ్య భూమి విషయంలో కొట్లాటలు సాగుతున్నాయి. బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం పోయి, కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన కొనసాగి మొన్న ఫిబ్రవరిలో ఖేమ్‌చంద్‌ సింగ్‌ ఆధ్వర్యంలో కొత్త సర్కారు ఏర్పడింది. 

నిండా రెండునెలలు కూడా ప్రశాంతత లేకుండా నాగా–కుకీలమధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఒక మహిళపై అత్యాచారం కూడా చోటుచేసుకుంది. ఇవన్నీ సహాయ శిబిరాల్లో జరిగినవే. ఈ ఉదంతాలపై సమగ్ర నివేదిక కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మరణాలపై లోగడే సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య సంఘాన్ని నియమించగా, ఆ సంఘం 25 అసహజ మరణాలను ప్రస్తావించింది.
వీటిపై జూన్‌ 11నుంచి వివరణ కోరుతున్నా, ఇంతవరకూ జవాబులేదని ఆ సంఘం చెప్పటంపై ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. 

మృతుల వారసులకు అరకొర ఆర్థికసాయం అందించటంపైనా నిలదీసింది. మొత్తంగా 8 జిల్లాల్లోని శిబిరాల్లో 640 మంది మరణించగా, అందులో 34 మంది మరణాలు అసహజమైనవని తేలింది. కానీ 25 మృతదేహాలకు మాత్రమే పోస్టుమార్టం జరిపించారు. ఈ వరస చూస్తుంటే పాలకులు మారినా మారిందేమీ లేదని అర్థమవుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రాలు సమగ్రంగా చర్చించుకుని తగిన కార్యాచరణకు దిగనట్టయితే అక్కడ శాంతిభద్రతలు మరింత క్షీణించటం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement