ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. గత 24 గంటల్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కుకీ తెగకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ మహిళ కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఈ దాడుల వెనుక నాగాలాండ్‌కు చెందిన నాగా తిరుగుబాటు సంస్థలు NSCN(IM), ZUF(K) ఉన్నాయని కుకీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
తమ్లాంగ్ జిల్లాలోని టోలెన్ గ్రామంలో తొలి దాడి జరిగింది. అక్కడ సైనెహ్ సింగ్‌సిట్, ఆయన భార్య లింగ్జాంగైపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన దంపతుల ఆరేళ్ల కుమారుడు కూడా గాయపడ్డాడు. లింగ్జాంగై అక్కడికక్కడే మృతి చెందగా.. సైనెహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బాలుడి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌ను తొలగించేందుకు వైద్యులు ఆపరేషన్ చేయనున్నారు. మరో ఘటనలో బియ్యం తీసుకెళ్తున్న ఓ బృందంపై గుర్తుతెలియని సాయుధులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో జూలీ గాంగ్టే, థాంగ్రోయెల్ గాంగ్టే అక్కడికక్కడే మృతి చెందారు. వారితో ఉన్న మరో మహిళ కనిపించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలపై మణిపూర్ ముఖ్యమంత్రి వైకే మేఘచంద్ర సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక పౌరులపై జరిగిన కాల్పులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి హింసకు సమాజంలో చోటు లేదని, బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
मणिपुर में एक बार फिर हिंसा भड़क गई है. तामेंगलोंग और नोनी जिलों में अलग-अलग हमलों में कुकी समुदाय के 4 लोगों की मौत हो गई, जिनमें 2 महिलाएं शामिल हैं. वहीं, 6 साल के एक बच्चे को भी गोली लगी है. घटना के बाद दोनों इलाकों में अलर्ट बढ़ा दिया गया है.#Manipur #Violence #Kuki pic.twitter.com/tADsxzxPJX
— zingabad (@zingabad) September 14, 2026
మణిపూర్‌లో కుకీ–నాగా వర్గాల మధ్య ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1992లో ప్రారంభమైనజాతి ఘర్షణలు దాదాపు ఆరేళ్లపాటు కొనసాగి వెయ్యికి పైగా ప్రాణాలను బలిగొన్నాయి. అయితే 2023లో ప్రారంభమైన కుకీ–మెయితీ హింసలోనూ 260 మందికి పైగా మృతి చెందారు.
ఇటీవలి కాలంలో కుకీ–నాగా ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ఏడాది మే 13న కాంగ్‌పోక్ఫీ జిల్లాలోని ఓ గ్రామం నుంచి ఆరుగురు నాగా తెగకు చెందిన వారిని బందీలుగా తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. జూన్ 10న కుకీ నివాస ప్రాంతానికి సమీపంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అంతకుముందు ఫిబ్రవరిలో నాగా వర్గాలతో జరిగిన ఘర్షణల్లో 14 మంది కుకీలు మృతి చెందారని, పలు ఇళ్లు దగ్ధమయ్యాయని కుకీ సంఘాలు ఆరోపించాయి.
తాజా కాల్పులతో మణిపూర్‌లో ఇప్పటికే సున్నితంగా ఉన్న కుకీ–నాగా సంబంధాలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఇదీ చదవండి: బ్రిక్స్ దేశాల్లోనూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సేవలు


