మొహర్రం సెలవుపై క్లారిటీ.. ఇక ‘లాంగ్ వీకెండ్’.. | Muharram holiday 2026 Is it on June 25 or 26 | Sakshi
Sakshi News home page

మొహర్రం సెలవుపై క్లారిటీ.. ఇక ‘లాంగ్ వీకెండ్’..

Jun 24 2026 12:10 PM | Updated on Jun 24 2026 12:28 PM

Muharram holiday 2026 Is it on June 25 or 26

న్యూఢిల్లీ: మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది! ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 1448 హిజ్రీ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అయితే, చంద్రుని దర్శనాన్ని అనుసరించి గల్ఫ్ దేశాలకు, భారతదేశానికి మధ్య ఈసారి ఒక రోజు తేడా వచ్చింది. గల్ఫ్ దేశాలలో జూన్ 16న మొహర్రం ప్రారంభం కాగా, భారతదేశంలో జూన్ 17న నెలవంక కనిపించింది. దీంతో అత్యంత పవిత్రమైన ‘ఆషూరా’ దినాన్ని భారత్‌లో ఎప్పుడు నిర్వహిస్తారు? ఆ రోజు ప్రభుత్వ సెలవు ఉంటుందా లేదా అనే సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

తేదీ మారడానికి అసలు కారణం ఇదే
మొహర్రం నెలలో 10వ రోజైన ‘ఆషూరా’ అత్యంత ముఖ్యమైన ఘట్టం. స్థానిక చంద్ర దర్శనం ఆధారంగా ఈ ఏడాది సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలలో జూన్ 25, గురువారం నాడు ఆషూరాను జరుపుకుంటున్నారు. కానీ, భారతదేశంలో చంద్రుడు ఒక రోజు ఆలస్యంగా కనిపించడంతో ఇక్కడి ముస్లింలు జూన్ 26, శుక్రవారం నాడు ఈ పవిత్ర దినాన్ని పాటించనున్నారు. ఈ తేడా కారణంగానే సెలవు తేదీలలో మార్పు వచ్చింది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. లాంగ్ వీకెండ్
భారత ప్రభుత్వం జూన్ 26 (శుక్రవారం)న మొహర్రం సందర్భంగా గెజిటెడ్ పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ రోజున దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, అలాగే బీఎస్‌ఈ , ఎన్‌ఎస్‌ఈ వంటి స్టాక్ ఎక్స్ఛేంజీలు మూతపడనున్నాయి. శుక్రవారం సెలవు రావడంతో, ఆ తర్వాత వచ్చే శని, ఆదివారాలతో కలిపి ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ దొరకడం విశేషం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, మిజోరంలలో శుక్రవారం మొహర్రం సెలవు ప్రకటించారు. అయితే గోవా, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలు తమ అధికారిక క్యాలెండర్‌లో  మొహర్రంను ప్రభుత్వ సెలవు దినంగా చేర్చలేదు.

మొహర్రం ప్రాముఖ్యత
ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నాలుగు నెలల్లో మొహర్రం ఒకటి. సున్నీ ముస్లింలు ఈ రోజున ప్రవక్త మూసాను ఈజిప్ట్ రాజు ఫారో నుండి దేవుడు రక్షించినందుకు గుర్తుగా ‘ఆషూరా’ నాడు (9, 10వ రోజుల్లో) ఉపవాసాలు ఉంటారు. మరోవైపు, షియా ముస్లింలు దీనిని శోకదినంగా పాటిస్తారు. క్రీస్తుశకం 680లో కర్బలా యుద్ధంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ.. నల్లటి వస్త్రాలు ధరించి, మొదటి 10 రోజుల పాటు భారీ ఊరేగింపులు, సంతాప దినాలు నిర్వహిస్తారు.

ఇది కూడా చదవండి: సిఏ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ చూసుకోండిలా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement