రాంచీ: ఝార్ఖండ్‌లోని రాంచీ–పట్నా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రజరప్ప ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. బిహార్‌లోని నలందా జిల్లా జాంఘారో గ్రామానికి చెందిన 14 మంది స్కార్పియో వాహనంలో ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ రజరప్ప ఆలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో రాంచీ–పట్నా జాతీయ రహదారిపై రామ్‌గఢ్ జిల్లా పైన్కీ ప్రాంతం సమీపంలో వారి వాహనం గుర్తుతెలియని మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కార్పియో తీవ్రంగా దెబ్బతింది.
ప్రమాద తీవ్రతకు 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గాయపడటంతో అతడిని రామ్‌గఢ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. వీరంతా నలందా జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. రామ్‌గఢ్ ఎస్‌డీపీఓ ఆలోక్ రంజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనా స్థలంలో లభించిన పత్రాలు, ఆధార్ కార్డుల ఆధారంగా కొంతమంది మృతుల గుర్తింపును నిర్ధారించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


