సీట్ల పెంపుపై ఖర్గే ఎద్దేవా
శాశ్వతంగా గద్దెపై ఉండేందుకు మోదీ కుట్ర
నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఎలాగైనా ఓడిస్తాం
విపక్షాల ‘ఇండియా’ కూటమి అగ్రనేతల స్పష్టీకరణ
ఖర్గే నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
భేటీకి డీఎంకే, శరద్ పవార్ పార్టీల గైర్హాజరు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గత సార్వత్రిక ఎన్నికల్లో 400 చోట్ల గెలుపే లక్ష్యంగా దూసుకొచ్చి కేవలం 240 సీట్లు సాధించి చతికిలపడిన బీజేపీ ఈసారి 800 చోట్ల గెలవాలనే అత్యాశతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తెస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ సర్కార్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల ‘ఇండియా’కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచి మొత్తం సీట్లను 815కు చేర్చే లక్ష్యంతో కేంద్రం తీసుకొస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఖర్గే విమర్శించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచి, శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. శనివారం న్యూఢిల్లీలోని ఖర్గే అధికార నివాసంలో ఆయన అధ్యక్షతన విపక్షాల ‘ఇండియా’కూటమి కీలక సమావేశం నిర్వహించారు.
11 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు, పార్లమెంటరీ పార్టీల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. డీలిమిటేషన్ బిల్లు నెగ్గకుండా పార్లమెంట్‌లో అనుసంచాల్సిన ఉమ్మడి వ్యూహం, కార్యాచరణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై నేతలు చర్చించారు. సమావేశం అనంతరం ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ తదితర పార్టీల నాయకులతో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రజాస్వామ్యానికి అంతం పలికే కుట్ర జరుగుతోంది. బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లో ప్రభుత్వం కొనసాగాలని చూస్తున్నారు. అదే జరిగితే మనుస్మృతి అమలు తథ్యం. మోదీ ప్రభుత్వం తెస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. మరోవైపు టీఎంసీ, శివసేన, ఇతర పార్టీలను చీలుస్తూ మరో మార్గంలోనూ తమ ఎత్తుగడ పారేలా చేస్తున్నారు. బిల్లుతో దేశం మరింత బాధలు పడుతుంది.
పార్లమెంట్‌లో ఉమ్మడి పోరాటం
ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలు డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఓడించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని, విస్తృత చర్చ అనంతరమే ముందుకు తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయనున్నట్లు సమాచారం. అవసరమైతే దేశవ్యాప్తంగా సంయుక్త ఆందోళనలు చేపట్టే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.
సమావేశానికి హాజరైన నేతలు...
కాంగ్రెస్ తరఫున ఖర్గే, ప్రియాంక గాం«దీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్, సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాం గోపాల్ యాదవ్, ఆర్జేడీ తరఫున అభయ్ కుమార్‌సింగ్, సీపీఐ నేత పి.సంతోశ్ కుమార్, మనోజ్ ఝా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) తరఫున ఈటీ మొహమ్మద్ బషీర్, ఆర్‌ఎస్పీ తరఫున ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్ హాజరయ్యారు. జార్ఖండ్ ముక్తి మోర్చా, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన(యూబీటీ) పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ సైతం హాజరయ్యారు.
డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) గైర్హాజరు
ఈ కీలక సమావేశానికి ఇండియా కూటమిలో భాగమైన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ నేతలు హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్లు పెంచితే బిల్లుకు మద్దతు ఇస్తామని ఆ పార్టీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బిజూ జనతాదళ్, డీఎంకేలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపినప్పటికీ ఆ పార్టీలు ఈ భేటీకి దూరంగా ఉండిపోయాయి.
400 పార్ నుంచి 800 పార్ వరకు...
‘‘2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ‘400 పార్’నినాదం ఇచ్చింది. అయితే ప్రజలు వారికి పూర్తి మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు సీట్ల గరిష్ట సంఖ్యను 850కు పెంచుతూ ‘800 పార్’లక్ష్యంతో రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నం జరుగుతోంది. ఒకసారి విపరీతమైన మెజారిటీ లభిస్తే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. డీలిమిటేషన్ బిల్లులో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్యాన్ని విస్మరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలు సైతం పెరగాలి. తాజా జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపడితే వారికి మరింత ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది. అయితే పాత లెక్కల ఆధారంగా ప్రక్రియ చేపట్టి వారి హక్కులకు భంగం కలిగించే కుట్ర జరుగుతోంది’’అని ఖర్గే ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సర్వే ప్రక్రియను ఖర్గే ప్రస్తావించారు. ‘గతంలో అసోం, జమ్మూ కశ్మీర్‌లో రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు అదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది’’అని అన్నారు.


