నియంతృత్వం దిశగా నెడుతున్నారు!  | Constitution amendment bill amounted to the murder of Indian democracy | Sakshi
Sakshi News home page

నియంతృత్వం దిశగా నెడుతున్నారు! 

Nov 29 2026 5:35 AM | Updated on Nov 29 2026 5:35 AM

Constitution amendment bill amounted to the murder of Indian democracy

రాహుల్‌ గాంధీ ధ్వజం

డీలిమిటేషన్‌ బిల్లుతో ప్రజాస్వామ్యం హత్య 

ఇష్టారీతిన నియోజకవర్గాలకే ఈ కుట్ర అని ఆరోపణ 

ఓటు చోరీ కుట్రలు సాగవనే కొత్త ఐడియా 

జెన్‌–జీ మొత్తానికి ఓటుచోరీ తెలుసని వ్యాఖ్య

న్యూఢిల్లీ: బీజేపీ దేశాన్ని నియంతృత్వం దిశగా నెడుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం దేశంలో 850 నియోజకవర్గాలు ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్న బిల్లు భారతీయ ప్రజాస్వామ్యం హత్యకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌లకు దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసే అవకాశం ఇవ్వడమే ఈ బిల్లు ఉద్దేశమని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో దాదాపు రెండు గంటల సమావేశం నిర్వహించిన రాహుల్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ దేశపు పునాదులను మార్చేసేందుకు ఈ బిల్లు కొత్త దారులు వేస్తోందని వ్యాఖ్యానించారు.

 ‘‘850 స్థానాలు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం అసోం, జమ్మూ కశ్మీర్‌లలో ఉంది. 850 స్థానాలుంటే వాళ్లు తమకు అనుకూలంగా ఉండేలా నియోజకవర్గాలను రూపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది. తమను వ్యతిరేకించిన సామాజిక వర్గాలను బలహీనపరచవచ్చు. కొంతమంది ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది’’అని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. 

ఒక్క ఓటు పడకున్నాసరే బీజేపీకి లాభం చేకూర్చేందుకు ఈ బిల్లులు ఉపయోగపడతాయని ఆరోపించారు. ‘‘జెన్‌జీ గుర్తుంచుకోండి. ఈ 850 సంఖ్య భారతీయ ప్రజాస్వామ్యం హత్యకు నిదర్శనం. నియోజకవర్గాల రూపురేఖలు పూర్తిగా మార్చేసేందుకు మోదీ, షా, జ్ఞానేశ్‌ కుమార్‌లకు అవకాశమిచ్చే ఆలోచన’’ అని అన్నారు. డీలిమిటేషన్‌ చట్టం క్రిమినల్‌ దొంగలు అదానీ, మోదీ, షా వీరి అనుచరుడు జ్ఞానేశ్‌ కుమార్‌లు ఈ దేశాన్ని దోచుకోవడానికి కొనసాగించే ప్రణాళిక అని ఆరోపించారు. 

డిలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటులో కూడా జ్ఞానేశ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తారని, మరో సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎంపిక చేసిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉండవచ్చని, మూడో సభ్యుడిని కూడా జ్ఞానేశ్‌ కుమార్‌ ఎంపిక చేసే అవకాశముందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసిందని, డిలిమిటేషన్‌ కమిషన్‌ను కూడా నియంత్రించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. 

డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్లను వివరిస్తూ, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను కొనసాగించాలని, 2027 జనాభా లెక్కలు, కుల గణన ఆధారంగా పునరి్వభజన జరగాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అలాగే ఇరుపక్షాల ప్రాతినిథ్యంతో డిలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని, రాష్ట్రాల ప్రాతినిధ్య వాటాలో మార్పులు చేయకూడదని, 543 స్థానాల పరిధిలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, అందులో ఓబీసీలకు ఉప కోటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

2024 లోక్‌సభ ఎన్నికలు చట్టబద్ధంగా జరగలేదని, ‘‘మోదీ ఒక అక్రమ ప్రధానమంత్రి’’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికలను మోసం చేయగలమనే భావన ఇక పనిచేయదు. బీజేపీ ఎన్నికలను ప్రభావితం చేస్తోందని దేశ ప్రజలకు తెలుసు. ముఖ్యంగా యువత దీనిని గుర్తించింది’’అని ఆయన అన్నారు.

జెన్‌–జీకి తెలుసు 
కేంద్రం ప్రవేశపెడుతున్న డీలిమిటేషన్‌ బిల్లు కేవలం రాష్ట్రాల వాటా అంశం కాదని. భారత ప్రజాస్వామ్య పునాదులను మార్చేందుకు, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచేందుకు బీజేపీకి ఖాళీ చెక్కు ఇచ్చే ప్రయత్నమని అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘‘బీజేపీ ఎన్నికలను రిగ్‌ చేయవచ్చునని అనుకుంటోంది. ఆ కాలం పోయింది. వాళ్లు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారన్న విషయం ఇప్పుడు దేశమంతా తెలిసిపోయింది’’అని అన్నారు.

 దేశంలో 80 శాతం మందికి... జెన్‌–జీలో వందకు వందశాతం మందీ బీజేపీ ఎన్నికల రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు విశ్వసిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగానే వాళ్లు ఇప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారని చెప్పారు. ‘‘మోదీ, షా, జ్ఞానేశ్‌ కుమార్‌లను ట్రాప్‌ చేసేశాం. అందుకే ఇప్పుడు ఈ ముగ్గురు మొనగాళ్లు కొత్త ఆలోచనతో వచ్చారు. తమకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించుకునే ఆలోచన ఇది’’అని విమర్శించారు.

సామాజిక న్యాయానికి దెబ్బ 
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్‌ బిల్లు అమల్లోకి వస్తే దేశంలో సామాజిక న్యాయం తీవ్రంగా దెబ్బతింటుందని రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘వచ్చే నలభై ఏళ్లు సామాజిక న్యాయం సంగతి మరచిపోండి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుతుంది కానీ.. వారి ప్రాతినిథ్యం మాత్రం పెరగదు. దీంతో వారి హక్కులు బలహీనపడటమే కాకుండా, మైనారిటీల సాధికారత కూడా దెబ్బతింటుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కుల గణన ను పక్కన పెట్టారని, 2027 జనాభా లెక్కలు బీజేపీకి అసౌకర్యకరమైన వాస్తవాలను బయటపెడతాయని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement