రాజ్యాంగ సవరణ గతంతో పోలిస్తే విపక్షంలో తగ్గిన సంఖ్యా బలం
ఏప్రిల్‌లో బిల్లును వ్యతిరేకించిన 230 మంది సభ్యులు.. ప్రస్తుత బలం 203కి తగ్గుదల
డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) పార్టీల తీరుపై కొనసాగుతున్న అయోమయం
పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై మరోసారి మొదలైన రాజకీయ సమరం విపక్షాల ఐక్యతకు అగ్నిపరీక్ష పెడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 230 మంది ఎంపీలతో ప్రభుత్వాన్ని నిలువరించిన విపక్షాలు ఇప్పుడు అదే ఐక్యతను కొనసాగించగలవా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ సమీకరణాల్లో వచ్చిన గణనీయమైన మార్పుల కారణంగా విపక్షాల్లో చీలికలు చోటుచేసుకున్నాయి. కొందరు అధికార పక్షానికి దగ్గరవ్వగా, మరికొన్ని పార్టీలు తమ వైఖరిని పునఃపరిశీలిస్తుండటంతో విపక్షాల ఐక్యత సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో విపక్షాల బలం ఎంత అన్నది ఆసక్తికరంగా మారింది.
బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు
ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో రాజ్యాంగ(131వ సవరణ) బిల్లుపై ఓటింగ్ జరిగిన సమయంలో విపక్షాలు తమ ఐక్యను చాటుకున్నాయి. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా 298 మంది, బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ 352కి మరో 54 సీట్లు తగ్గడంతో బిల్లు వీగిపోయింది. అప్పట్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన(ఉద్ధవ్) తదితర పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. విపక్షాల సమష్టి వ్యూహం ఫలించింది. బిల్లు గట్టెక్కలేదు.
ప్రస్తుతం మారిన రాజకీయ లెక్కలు
ఏప్రిల్ తర్వాత విపక్ష శిబిరంలో మూడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు పార్టీని వీడి, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ)లో విలీనమయ్యారు. వీరంతా బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు శివసేన(ఉద్ధవ్)లో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. వీరు కేంద్రానికి మద్దతుగా నిలవనున్నారు. శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీ ఇటీవలే పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి చెందిన ఏకైక లోక్‌సభ సభ్యురాలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నారు. ఏప్రిల్‌లో బిల్లును వ్యతిరేకించిన శిబిరం నుంచి 27 మంది ఎంపీలు అధికార పక్షానికి అనుకూలంగా మారడంతో నేడు విపక్షాల బలం 203కి తగ్గింది.
అస్పష్టంగా డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) వైఖరి
గతంలో బిల్లును వ్యతిరేకించిన డీఎంకేకు లోక్‌సభలో 22 మంది సభ్యులున్నారు. ఎన్సీపీ(ఎస్పీ)కి ఎనిమిది మంది ఉన్నారు. ఈ రెండు పార్టీలూ కొత్త బిల్లును పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల వాటా తగ్గకుండా హామీ ఇవ్వాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. దానికి కేంద్రం ఒప్పుకుంటే వారు మద్దతివ్వడమో లేకుంటే, సభకు గైర్హాజరు కావడమో జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వంతో కాంగ్రెస్ చేతులు కలపడం పట్ల డీఎంకే గుర్రుగా ఉంది.
దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ వైఖరిని డీఎంకే వ్యతిరేకించే అవకాశం ఉంది. అదే జరిగితే సభలో విపక్షాల బలం గణనీయంగా తగ్గనుంది. ఇటీవలి కాలంలో ఎన్సీపీ(ఎస్పీ)తో బీజేపీ సానుకూల వాతావరణం నెలకొల్పుతూ వస్తోంది. శరద్‌పవార్, సుప్రియా సూలేలతో ఇటీవల బీజేపీ నేతలు చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఎన్సీపీ(ఎస్పీ) సభ్యులు బిల్లుకు మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదు. చివరకు 173 మంది మాత్రమే విపక్షంలో మిగులుతారు. గతంలో బిల్లును ఓడించడంలో కీలక పాత్ర పోషించిన విపక్షాల సంఖ్యాబలంలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది.


