వైమానిక కేంద్రంపై దాడి కుట్ర భగ్నం | Jaish-e-Mohammed Terror Operative Arrested By Gujarat ATS | Sakshi
Sakshi News home page

వైమానిక కేంద్రంపై దాడి కుట్ర భగ్నం

Nov 28 2026 6:15 AM | Updated on Nov 28 2026 6:15 AM

Jaish-e-Mohammed Terror Operative Arrested By Gujarat ATS

గుజరాత్‌లోని వడోదరలో జైషే ఉగ్రవాది అరెస్ట్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని వడోదర వైమానిక దళ కేంద్రం(ఐఏఎఫ్‌)తోపాటు ఇతర రక్షణరంగ విభాగాలపై ఉగ్ర దాడికి పన్నిన కుట్రను గుజరాత్‌ పోలీసు యాంటీ టెరర్రిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌) భగ్నం చేసింది. జైషే మొహ్మద్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసి, అతడి నుంచి తుపాకీతోపాటు మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకుంది. అసోంలోని కరీంగంజ్‌కి చెందిన మహ్మద్‌ సహరుల్‌ ఇస్లాం కబీరుద్దీన్‌ను గురువారం రాత్రి వడోదర–హలోల్‌ రోడ్డులోని హోటల్‌ సమీపంలో అరెస్ట్‌ చేశామని డీఐజీ సునీల్‌ జోషి శుక్రవారం వెల్లడించారు. 

ఇతడు దహోడ్‌ నుంచి ఏకే–47ను పోలిన రైఫిల్‌తో వస్తుండగా పట్టుకున్నామన్నారు. ముందుగా అందిన సమాచారం ప్రకారం..ఒక రహస్య ప్రదేశంలో ఈ ఆయుధంతోపాటు మందుగుండు సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లగా ఇతడు తీసుకువచ్చాడని వివరించారు. ఏకే–47ను పోలిన రైఫిల్‌తోపాటు రెండు ఖాళీ మేగజీన్లు, 23లైవ్‌ కార్‌ట్రిడ్జిలు, జైషే మొహ్మద్‌ జెండా, రెండు సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులు, రూ.20వేల నగదు ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. 

వడోదరలోని ఐఏఎఫ్‌ కేంద్రం మెయిన్‌ గేట్‌పై దాడి చేయాలంటూ ఆదేశాలందాయని, ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా సెల్‌ ఫోన్‌లో పంపించినట్లు ఇతడు విచారణలో వెల్లడించాడని డీఐజీ వివరించారు. గుజరాత్‌ వెలుపలి వ్యక్తి రక్షణ కేంద్రాలపై దాడులకు ఉగ్రదాడులకు పథకం పన్నినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో అప్రమత్తమయ్యామన్నారు. వడోదరకు వెళ్లే క్రమంలో ఇతడిని పట్టుకున్నామని తెలిపారు. ‘పాకిస్తాన్‌కు చెందిన ముఫ్తీ రఫీక్‌ అలియాస్‌ ఇబన్‌ అబ్దుల్దా అనే హ్యాండ్లర్‌తో ఇతడు ఏడాదిగా టచ్‌లో ఉన్నాడు. ఏకే–47ను వాడటంపై ఇతడు యూట్యూబ్‌ వీడియోల సాయంతో నేర్చుకున్నాడు. 

ఐఏఎఫ్‌ కేంద్రంతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ, ఏమేం చేయాల్సిందీ పాక్‌ హ్యాండ్లర్‌ ఇతడికి ఫోన్‌లో గుర్తులతో వివరాలను పంపించాడు. కొత్త సెల్‌ కొనేందుకు, రవాణా తదితర ఖర్చుల కోసం ఇతడికి రూ.50 వేలు ముట్టాయి’అని డీఐజీ చెప్పారు. దాడికి పాల్పడిన అనంతరం ఇతడు పాకిస్తాన్‌కు వెళ్లి, జైషే మొహ్మద్‌ ఉగ్ర గ్రూపులో చేరాలనుకున్నాడని తెలిపారు. దాడులకు కుట్రలో ఇతడితోపాటు ఇతరుల హస్తంపైనా దర్యాప్తు చేపట్టామని డీఐజీ జోషి చెప్పారు. కబీరుద్దీన్‌పై ఉపా సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement