నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
లోక్‌సభలో బిల్లు నెగ్గాలంటే 360 ఓట్ల మద్దతు తప్పనిసరి
శిరోమణి అకాలీదళ్ చేరికతో 300కు చేరిన ఎన్డీయే బలం
స్పీకర్ మినహా నికర ఓటింగ్ బలం 299
ఏప్రిల్‌లో 54 ఓట్లుగా ఉన్న లోటు..
తాజా సమీకరణాలతో 61కి చేరిన వైనం
విపక్షాలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టడంపై కేంద్రం ముమ్మర కసరత్తు
డీఎంకే, ఎన్సీపీ, వైఎస్సార్‌సీపీ వంటి ప్రాంతీయ పార్టీల వైఖరిపైనే బిల్లు భవితవ్యం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయి. ఈ నెల 30న ప్రారంభం కానున్న సమావేశాల్లో అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లోక్‌సభలో ‘నంబర్ గేమ్’పెను సవాలుగా పరిణమించింది.
సాధారణ బిల్లుల తరహాలో కాకుండా రాజ్యాంగ సవరణకు సభలో మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి కావడంతో అధికార కూటమికి సంఖ్యాబలం సరిపోని పరిస్థితి నెలకొంది.
ఇటీవల శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) మళ్లీ ఎన్డీయే గూటికి చేరడంతో కూటమి బలం 300కు చేరినప్పటికీ, ప్రభుత్వానికి ఇంకా 61 ఓట్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అంతరాన్ని పూడ్చుకునేందుకు కూటమి పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర ఎంపీల మద్దతు కూడగట్టడంతోపాటు ఓటింగ్ సమయంలో కొందరు సభ్యుల గైర్హాజరీ అంశంపైనా ప్రధానంగా దృష్టి సారించారు.
లోక్‌సభలో లెక్కలివీ..
లోక్‌సభలో పూర్తి బలం 543 స్థానాలు కాగా, ప్రస్తుతం 539 స్థానాలు భర్తీ అయ్యాయి. సభలో మూడు స్థానాలు ఖాళీగా ఉండగా, స్పీకర్‌కు సాధారణ ఓటింగ్‌లో ఓటు హక్కు ఉండదు. ఈ లెక్కన ప్రస్తుతం సభలో 539 మంది సభ్యులు ఓటింగ్‌కు అందుబాటులో ఉన్నట్లు పరిగణిస్తున్నారు.
ఒకవేళ సభలోని 539 మంది సభ్యులూ ఓటింగ్‌లో పాల్గొంటే సాధారణ బిల్లు ఆమోదానికి సగం కంటే ఒక ఓటు ఎక్కువగా.. అంటే 270 ఓట్లు సరిపోతాయి. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఈ బిల్లు నెగ్గాలంటే సభలో ఉన్న 539 మంది సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది.. అంటే కనీసం 360 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. ఈ 360 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్.
ఏప్రిల్ నుంచి పెరిగిన లోటు
గత కొద్ది నెలల వ్యవధిలో సభలోని సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 2026 ఏప్రిల్ నాటి లెక్కలను పరిశీలిస్తే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి ప్రభుత్వానికి 54 ఓట్ల లోటు మాత్రమే ఉండేది. కానీ, తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ లోటు 62 ఓట్లకు పెరిగింది. ఇటీవల శిరోమణి అకాలీదళ్ తిరిగి ఎన్డీయేలో చేరడంతో ఆ లోటు ఒక్క ఓటు తగ్గి 61కి పరిమితమైంది. ఒక్క ఓటు కూడా అత్యంత కీలకంగా మారిన తరుణంలో ఈ భారీ లోటును పూడ్చుకోవడం ఎలా అన్నది అధికార పక్షాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
అకాలీదళ్ చేరికతో పెరిగిన ఎన్డీయే బలం
ఒక్క సభ్యుడున్న శిరోమణి అకాలీదళ్ రాకతో లోక్‌సభలో అధికార ఎన్డీయే మొత్తం బలం 299 నుంచి 300కు పెరిగింది. ఇందులో స్పీకర్‌ను మినహాయిస్తే కూటమి నికర ఓటింగ్ బలం 299గా తేలుతోంది. అంటే రాజ్యాంగ సవరణకు అవసరమైన 360 ఓట్లను సాధించాలంటే ప్రభుత్వానికి అదనంగా 61 ఓట్లు అవసరం. కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీకి 241 మంది సభ్యులు ఉన్నారు.
మిత్రపక్షాల్లో టీడీపీకి 16, శివసేనకు 13, జేడీ(యూ)కు 12, ఎల్‌జేపీకి 5 స్థానాలు ఉన్నాయి. వీటితోపాటు జనసేన(2), ఆర్‌ఎల్‌డీ(2), జేడీఎస్(2) సభ్యులు కూటమిలో ఉన్నారు. అలాగే ఎన్సీపీ(1), ఏజీపీ(1), ఏజేఎస్‌యూ(1), అప్నాదళ్–ఎస్(1), హెచ్‌ఏఎం–ఎస్(1), సిక్కిం క్రాంతికార్ మోర్చా(1) పార్టీలతో పాటు కొత్తగా చేరిన శిరోమణి అకాలీదళ్(1) ఎన్డీయేకు మద్దతుగా నిలుస్తున్నాయి. కూటమిలోని ఈ పార్టీల సభ్యులంతా ఏకతాటిపై నిలిచి ఓటు వేసినా 299 మార్కును దాటే అవకాశం లేదు.
లోటు పూడ్చుకునే వ్యూహమిదే..
సొంత కూటమి బలం సరిపోని పరిస్థితుల్లో బిల్లులను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం విపక్షేతర, ప్రాంతీయ పార్టీల వైపు చూస్తోంది. ఈ క్రమంలోనే డీఎంకే(22), ఎన్సీపీ–ఎస్పీ(8), వైఎస్సార్‌సీపీ(4) వంటి పార్టీల వైఖరి అత్యంత కీలకంగా మారింది. వీటికి తోడు ముగ్గురు స్వతంత్ర సభ్యులు, ఎస్పీ తదితర పార్టీల నుంచి అదనంగా 4 ఓట్ల మద్దతు లభించే అవకాశాలను కేంద్ర పెద్దలు పరిశీలిస్తున్నారు.
ఈ సమీకరణాలన్నింటినీ కలుపుకుంటే మద్దతు సంఖ్య 354కు చేరుతుందని, దానికి స్వతంత్రులు, ఇతర పార్టీల అదనపు ఓట్లను జతచేస్తే బలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఓటింగ్ సమయంలో కొందరు సభ్యులు గైర్హాజరయ్యే (అబ్‌స్టెయిన్) అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే తమ గెలుపు ఖాయ మని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటోంది.
గైర్హాజరీ అస్త్రం పనిచేస్తుందా?
రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్‌లో హాజరై, ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో పాటు సభ మొత్తం బలంలో మెజారిటీ ఉండటం కీలకం. ఈ నేపథ్యంలో విపక్షాల్లోని కొందరు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరైతే తమకు కలిసొస్తుందని అధికార పక్షం భావిస్తోంది. ఒకవేళ ప్రతిపక్షాలు విప్ జారీ చేసి, తమ సభ్యులందరినీ సభకు రప్పిస్తే పరిణామాలు మరోలా ఉండే అవకాశం ఉంది. గైర్హాజరీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఆ 6–7 ఓట్లే అసలు చిక్కు
కేంద్రం వేసుకుంటున్న ఈ లెక్కలు కాగితంపై సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయ డం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ము ఖ్యంగా ఎన్సీపీ, డీఎంకే, వైఎస్సార్‌సీపీ వంటి కీలక ప్రాంతీయ పార్టీల నిర్ణయంపైనే బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంది. ఆయా పార్టీల నుంచి సభ్యుల గైర్హాజరీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నా ప్రభు త్వానికి ఇంకా 6 నుంచి 7 ఓట్ల లోటు ఏర్ప డే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ స్వల్ప తేడానే బిల్లు ఆమోదానికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.


