డీలిమిటేషన్ కొత్త బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. కీలక నిర్ణయాలు | 50pc Increase In Seats 25 Year Freeze Centres Delimitation Push | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్ కొత్త బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. కీలక నిర్ణయాలు

Nov 27 2026 4:25 PM | Updated on Nov 27 2026 4:28 PM

 50pc Increase In Seats 25 Year Freeze Centres Delimitation Push

న్యూఢిల్లీ: డీలిమిటేషన్ కొత్త బిల్లుకు, మహిళా రిజర్వేషన్ల సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.

మూడు కీలక మార్పులకు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. 1) జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలలో సమానంగా లోక్‌సభ సీట్లలో 50% పెంపు 2) మరో 25 ఏళ్లు పాటు ఫ్రీజ్‌ పొడిగింపు 3) రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు.

లోక్‌సభ స్థానాలు 50% పెంపునకు కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత సవరణల ప్రకారం, లోక్‌సభ స్థానాల కేటాయింపులో మార్పులు లేకుండా 25 ఏళ్లపాటు, అంటే 2051 వరకు కొనసాగించనున్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఎన్డీఏ ప్రభుత్వం బిల్లులో 2 కీలక సవరణలు చేసింది. లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాల ప్రధాన డిమాండ్‌కు అనుగుణంగా ఉంది. అలాగే లోక్‌సభలో ప్రతి రాష్ట్రానికి దక్కే స్థానాల సంఖ్యను నిర్ణయించేందుకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకునే విధానంపై ఉన్న నిలుపుదలను మరో 25 ఏళ్లపాటు పొడిగించింది.

దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరాలు 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రధాన ఆందోళనగా ఉంది. అధిక జనాభా వృద్ధి నమోదైన రాష్ట్రాలతో పోలిస్తే, జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన తమ రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఈ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దీంతో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించడం, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటం మధ్య సమతుల్యత సాధించడంపై చర్చ కొనసాగుతోంది. నవంబర్ 30 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. వర్షాకాల సమావేశాలకు కొనసాగింపుగా ఈ భేటీలు జరగనున్నాయి. ఆగస్టు 13న పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, సమావేశాల ముగింపునకు సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తికాలేదు. డిసెంబర్ 3తో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ భేటీల్లో ఏయే బిల్లులను చేపడతారో ప్రభుత్వం వెల్లడించలేదు.

లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలనే లక్ష్యంతో రూపొందించిన బిల్లు ఏప్రిల్‌లో ఆమోదం పొందలేదు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని కేంద్రం సాధించలేకపోయింది. అప్పటి నుంచి లోక్‌సభలో పార్టీల బలాబలాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే శనివారం తన నివాసంలో సమావేశానికి హాజరుకావాలని ప్రతిపక్ష పార్టీల సభా పక్ష నేతలను ఆహ్వానించారు. ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వర్గాలు తెలిపాయి.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను బీజేపీ చేసిన అతిపెద్ద తప్పిదంగా అభివర్ణించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించాలనే లక్ష్యంతోనే ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రతిపాదిత 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, పార్టీ ఫిరాయింపులు, దేశ పార్లమెంటరీ వ్యవస్థలో మార్పుల ద్వారా బీజేపీ రాజకీయ అధికారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. నవంబర్ 30న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే, 2026 నాటికి దేశంలో మిగిలి ఉన్న ప్రజాస్వామ్యం కూడా అంతమవుతుందని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement