ప్రతి గదిలో అలంకరణ లెక్కలు...
టీవీలు, కర్టెన్లకు కోట్లు ఖర్చు అని విమర్శ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు ప్రదర్శించింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని ఈ బంగ్లాలో కేజ్రీవాల్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ బంగ్లాలో మొత్తం 20 గదులు, 8 బెడ్‌రూమ్స్, రెండు వంటగదులు, సమావేశ మందిరం, వెల్‌నెస్ సూట్, జిమ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఢిల్లీ మంత్రులు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, కపిల్ మిశ్రాలు మీడియా ప్రతినిధులకు బంగ్లాను చూపించారు.
గత ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవినీతి ఆరోపణల అంశంగా మారిన ఈ బంగ్లా ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఈ శీష్ మహల్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీని దోచుకున్న ఆప్ ప్రభుత్వం ఇప్పుడు పంజాబ్‌లోనూ అదే విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆరోపించారు.
రూ.58 కోట్ల ఖర్చు....
బంగ్లా ప్రవేశ ద్వారం వద్ద ‘‘శీష్ మహల్’’ పేరుతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేశారు. 1,905 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం పునర్నిర్మాణం, అంతర్గత అలంకరణల కోసం సుమారు రూ.58 కోట్లు ఖర్చు చేసినట్లు బోర్డులో పేర్కొన్నారు. 2015 నుంచి 2024 అక్టోబర్ వరకు అరవింద్ కేజ్రీవాల్ ఈ నివాసాన్ని ఉపయోగించినట్లు వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం... బంగ్లాలో ఏర్పాటు చేసిన 11 టెలివిజన్ల కోసం మొత్తం రూ.82.56 లక్షలు ఖర్చు చేశారు.
లాబీలో ఉన్న ఒక టీవీ ధర రూ.28.92 లక్షలు కాగా, లాంజ్‌లోని మరొక టీవీ విలువ రూ.17.53 లక్షలు. కర్టెన్ల కోసం రూ.1.07 కోట్లు, ఖర్చు చేయగా.. ప్రధాన బెడ్‌రూమ్ కర్టెన్లకు మాత్రమే రూ.12.02 లక్షలు ఖర్చు చేశారు. ‘బైఠక్’గా పిలిచే సమావేశ మందిరంలో రూ.2.40 లక్షలతో స్లైడింగ్ డోర్, కర్టెన్లకు రూ.7.94 లక్షలు, కార్పెట్కు రూ.5.53 లక్షలు, అలంకార దీపం కోసం రూ.2.66 లక్షలు ఖర్చు పెట్టారు. డైనింగ్ టేబుల్ కోసం రూ.13.70 లక్షలు, 14 కురీ్చలకు రూ.17.45 లక్షలు వ్యయం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. భోజన బల్ల పైన అమర్చిన రెండు భారీ షాండ్లియర్‌ల విలువ రూ.23.12 లక్షలుగా అంచనా వేసింది.
వంటగదిలోనూ అత్యాధునిక సదుపాయాలు
డైనింగ్ ప్రాంగణానికి అనుసంధానమైన మాడ్యులర్ కిచెన్‌పై మొత్తం రూ.61.13 లక్షలు ఖర్చు చేసినట్లు వివరించింది. వంటగది నిర్మాణం, ఇంటీరియర్స్ కోసమే రూ.31.62 లక్షలు వెచ్చించగా, అంతస్తుల మధ్య ఆహారం తరలించేందుకు ఉపయోగించే డంబ్‌వెయిటర్ విలువ రూ.7.20 లక్షలు అని ప్రభుత్వం తెలిపింది. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసిన డబుల్ డోర్ ఫ్రిజ్ ధర రూ.3.17 లక్షలు కాగా, చిమ్నీ విలువ రూ.5.41 లక్షలు, లాండ్రీ ఫిట్టింగ్స్ ఖర్చు రూ.3.07 లక్షలని పేర్కొన్నారు.
బెడ్‌రూమ్‌లలో లగ్జరీ హంగులు
గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెండు ప్రధాన పడకగదుల అలంకరణకు రూ.75.74 లక్షలు, రూ.85.89 లక్షలు చొప్పున ఖర్చు పెట్టారని ఒక గదిలో ఇంటీరియర్ పనులు రూ.34.50 లక్షలు, టీవీ రూ.6.90 లక్షలు, కర్టెనకు రూ.12.01 లక్షలు వ్యయం చేశారని పేర్కొన్నారు. మరో గదిలో బెడ్ కోసం రూ.6.50 లక్షలు, వార్డ్‌రోబ్ కోసం రూ.5.56 లక్షలు, కర్టెన్లకు రూ.5.84 లక్షలు వ్యయం చేశారని వెల్లడించారు. ఫ్యామిలీ లాంజ్‌గా ఉపయోగించిన గదిలో మొత్తం రూ.61.36 లక్షలు ఖర్చు పెట్టారని ఒక్క గుండ్రటి బెడ్ కోసమే రూ.9.36 లక్షలు చెల్లించారని తెలిపింది.
రూ.1.48 కోట్ల విలువైన లివింగ్ రూమ్
లివింగ్ రూమ్ లాంజ్ అలంకరణ ఖర్చు రూ.1.48 కోట్లుగా చూపించారు. ఇంటీరియర్ పనులు రూ.62.74 లక్షలు, టీవీ రూ.17.52 లక్షలు, టీవీ కన్సోల్ రూ.13.19 లక్షలు ఖర్చయినట్లు పేర్కొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మందిరం విలువ రూ.6.71 లక్షలు, ఎల్–ఆకారపు సోఫా రూ.6.40 లక్షలు, సెంటర్ టేబుళ్ల విలువ రూ.5.65 లక్షలుగా పేర్కొన్నారు. వెల్‌నెస్ గదిలో స్టీమ్ రూమ్, సౌనా, జకూజీ వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ గది కోసం రూ.31.75 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పారు.
స్టీమ్ రూమ్ కోసం రూ.11.38 లక్షలు, సౌనా కోసం రూ.8.68 లక్షలు, జకూజీ కోసం రూ.5.95 లక్షలు వ్యయం చేసినట్లు తెలిపారు. ఈ బంగ్లాను వచ్చే నెల నుంచి ప్రజల సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ రుసుము సుమారు రూ.20గా ఉండే అవకాశం ఉందని, వృద్ధులు, కళాశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. అదేవిధంగా, అధికారిక సమావేశాలు, భోజన విందులు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఈ భవనాన్ని వినియోగించేందుకు ప్రైవేట్ హాస్పిటాలిటీ సంస్థను నిర్వహణ బాధ్యతలకు నియమించే యోచన కూడా ఉందని అధికారులు తెలిపారు.


