జ్ఞానేశ్‌ కుమార్‌తో పాటు మోదీ సైతం..: కేజ్రీవాల్‌ | Arvind Kejriwal Gyanesh KumarModiji should resign | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్‌ కుమార్‌తో పాటు మోదీ సైతం..: కేజ్రీవాల్‌

Oct 11 2026 3:04 PM | Updated on Oct 11 2026 3:35 PM

Arvind Kejriwal Gyanesh KumarModiji should resign

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలపై పోలీసులు చేపట్టిన చర్యలను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరును హిట్లర్‌తో పోల్చిన ఆయన.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌తో పాటు మోదీ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు.

శనివారం ఢిల్లీలో నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన చర్యల్లో యువతులు, న్యాయవాదులు, పాత్రికేయులు సహా పలువురు ఇబ్బందులకు గురయ్యారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

‘‘నిన్న మోదీజీ భయానక పాలనను తలపించేలా వ్యవహరించారు. అన్ని హద్దులూ దాటిపోయారు. హిట్లర్‌ను కూడా వెనక్కి నెట్టేశారు. ఆయన దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. యువతులు వేధింపులకు గురవుతున్నారు. న్యాయవాదులను వదల్లేదు.. పాత్రికేయులనూ వదల్లేదు. ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. ఈ సారి జ్ఞానేశ్‌ కుమార్‌తో పాటు మోదీజీ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి రాకూడదని అనుకోలేం’’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో ప్రముఖుల నిర్బంధాలు 
స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వ్యతిరేకిస్తూ, జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీజేపీ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే, పోలీసులు విస్తృతంగా భద్రతా చర్యలు చేపట్టి ఆందోళనను అడ్డుకున్నారు. దేశ రాజధానిలో పలువురు పార్టీ నాయకులు, మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు.

సీజేపీ నాయకులు అభిజీత్‌ దీప్కే, ఆశుతోష్‌ రంకా, సౌరవ్‌ దాస్‌ కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. కేజ్రీవాల్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ, పలువురు ప్రతిపక్ష నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకే అణచివేత: సౌరవ్ దాస్

ఈ పరిణామాలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అక్రమ నిర్బంధాలు, రవాణా సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిరసనకారుల నిర్బంధాలపై కేంద్రం, ఢిల్లీ పోలీసుల స్పందనతో పాటు సుప్రీంకోర్టు తదుపరి చర్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement