పెద్దయ్యాక క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చు
తొలి 1,000 రోజుల చక్కెర నియంత్రణతో దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణ
36–69 శాతం వరకు క్యాన్సర్ల బారినపడే అవకాశం తగ్గుతుందంటున్న శాస్త్రవేత్తలు
టైప్–2 మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు వంటి
జీవక్రియ వ్యాధుల ముప్పు కూడా తగ్గే అవకాశం
64 వేల మందిపై చైనా, యూకే పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
సాక్షి, స్పెషల్ డెస్క్: మనం చిన్నప్పుడు తినే ఆహారం మన భవిష్యత్ ఆరోగ్యాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేస్తుందో తాజా అంతర్జాతీయ పరిశోధన నిరూపించింది. శిశువు తల్లి గర్భంలో రూపుదాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్లు నిండే వరకు (తొలి 1,000 రోజులు) ఆహారంలో చక్కెర వినియోగాన్ని నియంత్రిస్తే, పెద్దయ్యాక ప్రాణాంతక క్యాన్సర్ల ముప్పు 36–69 శాతం వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు డా. చెన్ జు, డా. వీలాంగ్ జాంగ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ప్రతిష్ఠాత్మక పీఎన్‌ఏఎస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
చక్కెర రేషన్‌తో ముగియడంతో..: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌లో అమలులో ఉన్న చక్కెర రేషన్ విధానం 1953 సెప్టెంబర్‌లో అకస్మాత్తుగా ముగిసింది. రేషన్ సమయంలో రెండేళ్లలోపు పిల్లలకు చక్కెర కేటాయింపు అసలు ఉండేది కాదు. పెద్దలకు కూడా రోజుకు సుమారు 40 గ్రాముల వరకు మాత్రమే అందేది. రేషన్ ఎత్తివేసిన వెంటనే రోజువారీ చక్కెర వినియోగం రెట్టింపు అయి 80 గ్రాములకు చేరింది. ఈ మార్పును ఆధారంగా చేసుకొని 1951–1956 మధ్య పుట్టిన 64,761 మంది యూకే బయోబ్యాంక్ సభ్యుల ఆరోగ్య వివరాలను ఐదు దశాబ్దాల పాటు విశ్లేషించారు.
కేన్సర్ ముప్పు భారీగా తగ్గుదల..: తొలి వెయ్యి రోజుల పాటు చక్కెర నియంత్రణ కాలంలో పెరిగిన వారిలో పెద్దయ్యాక ఐదు ప్రధాన క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గినట్లు ఈ అధ్యయనంలో తేలింది. కాలేయ క్యాన్సర్ ముప్పు 69%, ప్రోస్టేట్ క్యాన్సర్ 52%, ఊపిరితిత్తుల క్యాన్సర్ 41%, పెద్దపేగు/పురీషనాళ క్యాన్సర్ 40%, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు 36% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనితో పాటు టైప్–2 మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు వంటి జీవక్రియ వ్యాధుల ముప్పు కూడా తగ్గింది.
ప్రధాన కారణాలు రెండు..
బాల్యంలో తీపి వాడకం తగ్గించటం వల్ల 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్య ప్రయోజనాలు కొనసాగటానికి పరిశోధకులు రెండు ముఖ్య కారణాలను గుర్తించారు. చిన్నతనంలో తీపికి దూరంగా ఉండటం వల్ల మెదడులో తీపి పట్ల అమితమైన వ్యామోహం కలగలేదు. ఫలితంగా వారు యాభై ఏళ్ల వయసులోనూ తక్కువ చక్కెర, మితమైన ఆహారం తీసుకుంటూ పండ్లు, కూరగాయలతో కూడిన పోషకాహారాన్ని ఇష్టపడుతున్నారు.
వీరి రక్త కణాల్లోని ‘టెలోమియర్’పొడవు ఎక్కువగా ఉండటం వల్ల, సాధారణ వ్యక్తుల కంటే వీరి శారీరక వృద్ధాప్యం సుమారు 2.2 సంవత్సరాలు నెమ్మదిగా సాగుతున్నట్లు తేలింది. అలాగే శరీరంలో దీర్ఘకాలిక వాపును కలిగించే గ్రాంజైమ్ బి స్థాయిలు తక్కువగా ఉండి రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. రెండేళ్ల వయసు వరకు పిల్లలకు అదనపు చక్కెర ఇవ్వకుండా, సహజసిద్ధమైన పండ్లు, ఇంట్లో తయారు చేసిన పోషకాహారం అలవాటు చేస్తే భావి తరాలను క్యాన్సర్ వంటి మహమ్మారుల నుంచి కాపాడుకోవచ్చని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.


