జుట్లు పట్టుకుని కొట్టుకున్న నర్సింగ్ అమ్మాయిలు | Clash Between Nursing Students In Kakinada | Sakshi
Sakshi News home page

జుట్లు పట్టుకుని కొట్టుకున్న నర్సింగ్ అమ్మాయిలు

Aug 24 2026 11:52 AM | Updated on Aug 24 2026 11:55 AM

Clash Between Nursing Students In Kakinada

కాకినాడ రూరల్‌: తమ నర్సింగ్‌ విద్యార్థులు కాకినాడలో దాడులకు గురవుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలుసుకున్న మణిపూర్, అసోం, నాగాలాండ్‌ ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కాకినాడలో నర్సింగ్‌ విద్యార్థునుల వివాదం, కొట్లాటల వ్యవహారంలో పరువు పోతోందని భావించి, ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరిస్థితి సద్దుమణిగిందని కాకినాడ జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే, పరిస్థితి ఇంకా నివురు గప్పిన నిప్పులానే ఉండటంతో నర్సింగ్‌ కళాశాల ప్రాంగణాన్ని పోలీసుల సాయంతో అధికారులు తమ ఆ«దీనంలోనే ఉంచుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) విష్ణువర్ధన్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కాగా, ఈ వివాదం, కొట్లాట తెలుగు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థునుల మధ్య దూరాన్ని పెంచింది. 

కాకినాడ వైద్యనగర్‌లోని ఎస్‌కే నర్సింగ్‌ ఆఫ్‌ కాలేజ్, ఆర్‌కే స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ పేరిట పక్క పక్క భవనాలతో పాటు మరో రెండు సంస్థల పేరిట ఎదురుగా ఉన్న భవనాల్లో నర్సింగ్‌ విద్య బోధిస్తున్నారు. వీటిల్లో నాలుగేళ్ల జీఎన్‌ఎం, మూడేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు బోధిస్తున్నారు. మణిపూర్, అసోం, నాగాలాండ్‌కు చెందిన 31 మందితో పాటు తెలుగు విద్యార్థునులు కలిపి సుమారు 400 మంది ఇక్కడ చదువుతున్నారు. 

శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మణిపూర్‌కు చెందిన విద్యార్థుని సెల్‌ఫోన్‌ చార్జింగ్‌లో ఉంచగా, అది కనిపించలేదు. దీనిపై ఆ విద్యార్థిని, మరికొందరు విద్యార్థునులు తోటి తెలుగు విద్యార్థునులను అడిగారు. దీనికి సరైన సమాధానం రాకపోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తెలుగు, ఉత్తరాదిగా విద్యార్థునులు భాష, ప్రాంతాల ప్రాతిపాదికన విడిపోయి పిడిగుద్దులతో కొట్టుకున్నారు. 

సమాచారం అందుకున్న ఆరుగురు పోలీసులు వచ్చినా వారిని నివారించలేక చేతులెత్తేశారు. కొందరు తెలుగు విద్యార్థునుల చేతిలో కర్రలు పట్టుకుని ఉన్న దృశ్యాలను మణిపూర్‌ విద్యార్థునులు తమ ఫోన్లలో చిత్రీకరించి, వాటిని తమ కుటుంబ సభ్యులకు, ఆయా రాష్ట్రాల్లోని సోషల్‌ మీడియాకు పోస్టు చేశారు. దీంతో, అక్కడి వారిలో ఆందోళన మొదలైంది. తమ విద్యార్థులకు భద్రత కల్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయడంతో మన రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 

అధికారుల పరిశీలన 
కాకినాడ కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బింధుమాధవ్‌లు ఆదివారం ఉదయమే నర్సింగ్‌ కళాశాల, స్కూల్‌ను సందర్శించారు. మణిపూర్‌ విద్యార్థునుల భద్రతపై నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. రక్షణ నిమిత్తం వారిని వేరే భవనానికి తరలించారు. సర్పవరం సీఐ ప్రకాష్‌ నేతృత్వంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్‌ విషయమై విద్యార్థినుల మధ్య వివాదం తలెత్తిందని, మరే ఇతర కారణాలూ లేవని, ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగిందని కలెక్టర్, ఎస్పీ మీడియాకు చెప్పారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారని వెల్లడించారు. 

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన 
మరోవైపు ఏపీ నర్స్‌ అండ్‌ మిడ్‌వైవ్స్‌ కౌన్సిల్‌ (ఏపీఎన్‌ఎంసీ) రిజి్రస్టార్‌ కె.సుశీల కాకినాడలోని నర్సింగ్‌ స్కూల్, కళాశాల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నర్సింగ్‌ కళాశాలల నిర్వహణపై తమకు పది రోజుల క్రితమే ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీనిపై విచారణ జరిపి, ఈ నెల 25లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా షోకాజ్‌ నోటీసు జారీ చేశామని చెప్పారు. నర్సింగ్‌ స్కూల్, కళాశాలలు నాలుగు పేర్లతో ఒకేచోట వేర్వేరు భవనాల్లో నిర్వహిస్తున్నారని, నిర్వహణ అధ్వానంగా ఉందని తెలిపారు.

రెండు స్కూళ్లు, నాలుగు కళాశాలల పేరిట ఒకే భవనంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. విద్యార్థుల బాధలు తెలుసుకున్నానని, ఇక్కడ దుర్భర పరిస్థితులున్నాయని చెప్పారు. ఒకవేళ ఆయా సంస్థల గుర్తింపు రద్దయితే ఇక్కడి విద్యార్థులకు వేరేచోటకు పంపుతామని తెలిపారు. ఈ నర్సింగ్‌ కళాశాలకు ఐఎన్‌సీ సరి్టఫికెట్‌ లేదన్నారు. సర్పవరం, కొవ్వూరు, ఎస్‌.అచ్యుతాపురం, విద్యుత్‌ నగర్‌ చిరునామాలతో వేర్వేరు సొసైటీలతో అనుమతులున్నప్పటికీ అన్నింటినీ వైద్యనగర్‌లోనే కొనసాగిస్తున్నారని వివరించారు.

 నర్సింగ్‌కు ఫిజికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ అవసరమని, కానీ విద్యార్థులకు ఎక్కడకూ పంపించడం లేదని చెప్పారు. ఈ విద్యా సంస్థల డైరెక్టర్లు విజయలక్ష్మి, సుశీల మీడియాతో మాట్లాడుతూ, తమ సోదరుడు ఎంతో సేవాభావంతో ఈ సంస్థలను స్థాపించారని, ఆ దంపతుల మరణాంతరం తాము పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇక్కడ చదువుకునేందుకు మణిపూర్‌ విద్యారి్థనులు 30 ఏళ్లుగా వస్తున్నారని, ఇదే చివరి బ్యాచ్‌ అని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement