అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్ 1
రెవెన్యూ లోటులోనూ రాష్ట్రానిదే అగ్రస్థానం
ఇది బాబు సర్కారు బడ్జెట్ తొలి నాలుగు నెలల ప్రోగ్రెస్
2026–27 రాష్ట్రాల బడ్జెట్ తొలి నాలుగు నెలల సూచికలను వెల్లడించిన కాగ్
సాక్షి, అమరావతి: అనుభవం, విజన్, సంపద సృష్టిస్తా అంటూ నిత్యం గొప్పలు చెప్పుకొనే సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి, అధఃపాతాళానికి తొక్కేస్తున్నారు. ఆస్తుల కల్పన లేదు.. ఆదాయం లేదు.. అప్పులు మాత్రం బోలెడు. వారం వారం వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత చంద్రబాబుదే. రెవెన్యూ లోటులోనూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారు.కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ అప్పులు, రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నెల నెలా దిగజార్చేస్తూ సంపదను పెంచడంలో వెనుకబడిపోయిన చంద్రబాబు సర్కారు.. అప్పులు, రెవెన్యూ లోటును పెంచేస్తూ రాష్ట్రాన్ని నెంబర్ ఒన్ స్థానంలోకి తీసుకెళ్లినట్లుకంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి నాలుగు నెలల (ఏప్రిల్ నుంచి జూలై వరకు) రాష్ట్రాల బడ్జెట్ కీలక సూచికలను కాగ్ వెల్లడించింది. ఈ నాలుగు నెలల్లో రాష్ట్ర బడ్జెట్ అప్పులు దేశంలోని మిగతా రాష్ట్రాలకన్నా అత్యధికంగా ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఏపీ సగటున నెలకు రూ.12,300 కోట్ల చొప్పున నాలుగు నెలల్లోనే రూ.49,134 కోట్లు అప్పు చేసింది.
జూలై నెలలోనే ఏకంగా రూ.15,521 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పులో నాలుగు నెలల్లోనే 64.76 శాతం మేర చేసినట్లు వెల్లడించింది. నెల నెలా అప్పులు పెంచేస్తుండగా ఆస్తుల కల్పన వ్యయం తగ్గిపోతోందని కాగ్ పేర్కొంది. అప్పుల్లో భారీ వృద్ధి నమోదు చేస్తున్న చంద్రబాబు సర్కారు ఆస్తుల కల్పన వ్యయంలో తిరోగమనంలో పయనిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం జూలై నెల వరకు ఆస్తుల వ్యయంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు ఆస్తుల కల్పన వ్యయం 23.0 శాతం తగ్గిపోయింది.

అలాగే జూన్ నెలతో పోల్చితే జూలైలో ఆస్తుల కల్పన వ్యయం ఏకంగా 42.8 శాతం పడిపోయింది. ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో రెవెన్యూ లోటు కూడా నెల నెలా పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం రెవెన్యూ రాబడులను పెంచకపోవడమేనని స్పష్టమవుతోంది. రెవెన్యూ రాబడులను మించి వ్యయం చేస్తున్నారు. అంటే చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా ఎటువంటి ప్రతిఫలం లేని రంగాలకు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.


