ఎంబీబీఎస్ సీట్లకు ఎగబాకిన కటాఫ్‌లు ఆలిండియా కోటా తొలి రౌండ్ సీట్లను ఇటీవల కేటాయించిన ఎంసీసీ గతేడాదితో పోలిస్తే పెరిగిన మార్కుల తీవ్రత
పోటీలో నిలవని సాధారణ స్కోర్లు
2025లో జనరల్‌లో 534 స్కోర్ వరకు సీటు
ఈసారి 572 దగ్గరే ఆగిపోయిన పరిస్థితి
రిజర్వేషన్ విభాగాల్లోనూ పెరిగిన కటాఫ్‌లు
త్వరలో రాష్ట్రస్థాయిలో తొలి విడత కౌన్సిలింగ్ షురూ
రాష్ట్రస్థాయి కన్వీనర్ ప్రవేశాలకు 14 వేల మందికి పైగా దరఖాస్తు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ 2026–27 విద్యా సంవత్సరం కౌన్సెలింగ్‌లో గతేడాదితో పోలిస్తే కటాఫ్ స్కోర్లు భారీగా ఎగబాకుతున్నాయి. ఆలిండియా కోటా మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఇటీవల మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ)సీట్లు కేటాయించింది. వీటిని గమనిస్తే.. 2025తో పోలిస్తే ఈసారి కటాఫ్ మార్కులు భారీగా పెరిగాయి. 2025లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఆలిండియాలో 534 స్కోర్ వరకూ ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి. ఈ ఏడాది 572 స్కోర్ వద్దే సీట్ల కేటాయింపు నిలిచిపోయింది. గతేడాది జాతీయ స్థాయిలో 12.36 లక్షల మంది నీట్‌లో అర్హత సాధించగా.. ఈ దఫా 11.21 లక్షల మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో అర్హుల సంఖ్య తగ్గినప్పటికీ టాప్ స్కోర్లలో ఎక్కువ మంది విద్యార్థుల మధ్య పోటీ పెరగడంతో ఈ దఫా కటాఫ్‌లు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
ఒక్కో సీటుకు ముగ్గురికిపైనే పోటీ
రాష్ట్రస్థాయిలో తొలి విడత కౌన్సెలింగ్‌ను ఆరోగ్య విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించనుంది. ఇప్పటికే కన్వీనర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం 14,310 మందితో తాత్కాలిక మెరిట్ జాబితాను యూనివర్సిటీ విడుదల చేసింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేసి, ఆప్షన్లు స్వీకరించి సీట్లను కేటాయించనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ కళాశాలల్లో 2,631, ప్రైవేట్‌లో 1,950 చొప్పున 4,581 ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్లు రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన గమనిస్తే ఒక్కో ఎంబీబీఎస్ సీటుకి ముగ్గురికి పైగానే పోటీ పడుతున్న పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రస్థాయిలో ఇలా..
దేశంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో 15 శాతం సీట్లను ఆలిండియా కోటాలో ఎంసీసీ భర్తీ చేస్తుంది. ఈ సీట్లలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో పోటీ ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో కటాఫ్‌లు ర్యాంక్‌ల వారీగా పరిశీలిస్తే గతేడాదితో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉంటోంది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో గతేడాది ఓపెన్ కేటగిరిలో 7,267 ర్యాంకర్‌కు చివరి సీటు దక్కింది. ఈ ఏడాది 4,443 దగ్గరే సీట్ల కేటాయింపు నిలిచిపోయింది.
ఓబీసీల్లో గతేడాది 9,669 వరకూ సీటు దక్కగా ఇప్పుడు 5,016 దగ్గరే సీట్లన్నీ భర్తీ అయిపోయాయి. కర్నూలు మెడికల్ కళాశాలలో గతేడాది ఓపెన్‌లో 18,768 ర్యాంక్ సాధించిన విద్యారి్థకి చివరి సీటు దక్కగా.. ఈసారి 8,311 ర్యాంక్ దగ్గరే చివరి సీటు ఆగిపోయింది. ఓబీసీల్లో అయితే గతంలో 21,291 ర్యాంకర్‌కు సీటు దక్కగా.. ఈ సారి 11,197 వరకే అవకాశం లభించింది. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు భారీగా పెరిగాయి.


