జోధ్‌పూర్‌ నిఫ్ట్‌కు తెలుగు నగిషీ | Harishankar Prasad from Vijayawada has worked tirelessly as the Director of Jodhpur NIFT | Sakshi
Sakshi News home page

జోధ్‌పూర్‌ నిఫ్ట్‌కు తెలుగు నగిషీ

Aug 24 2026 5:24 AM | Updated on Aug 24 2026 5:24 AM

Harishankar Prasad from Vijayawada has worked tirelessly as the Director of Jodhpur NIFT

జోద్‌పూర్‌ నిఫ్ట్‌ డైరెక్టర్‌గా విజయవాడకు చెందిన హరిశంకర్‌ప్రసాద్‌ అలుపెరగని కృషి  

పార్లమెంట్‌లోని మార్షల్స్‌ డ్రెస్‌ డిజైన్, ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జెర్సీ రూపొందించింది ఈ సంస్థ విద్యార్థులే  

అద్భుత పనితీరుతో దేశంలోని టాప్‌టెన్‌లో ఒకటిగా జోధ్‌పూర్‌ నిఫ్ట్‌కు గుర్తింపు  

వరల్డ్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌లో లీడర్‌షిప్‌ అవార్డు అందుకున్న హరిశంకర్‌ప్రసాద్‌  

జోద్‌పూర్‌ నుంచి సాక్షి ప్రతినిధి: రాజస్థాన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టి–నిఫ్ట్‌) జోద్‌పూర్‌ క్యాంపస్‌ను దేశంలోని అగ్రశ్రేణి ఫ్యాషన్‌ విద్యాకేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో మన తెలుగోడి సత్తా ఉంది. విజయవాడకు చెందిన ప్రొఫెసర్‌ జి.హరిశంకర్‌ప్రసాద్‌ నాలుగేళ్లకుపైగా జోధ్‌పూర్‌ నిఫ్ట్‌ డైరెక్టర్‌గా చేసిన కృషి ఆ క్యాంపస్‌ను దేశంలోని టాప్‌టెన్‌ క్యాంపస్‌లలో ఒకటిగా నిలిపింది. 2000 జూన్‌లో నిఫ్ట్‌ హైదరాబాద్‌లో చేరిన ప్రసాద్‌.. షాహి ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఎఫ్‌ఎంఎస్‌ విభాగం అధిపతిగా, నిఫ్ట్‌ హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. 

ఆయన ఐఐటీ ఢిల్లీ, ఐఐఎఫ్‌టీ ఢిల్లీ, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో విద్యాభ్యాసం చేశారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో అకడమిక్‌ ప్రాజెక్టులు చేశారు. హైదరాబాద్‌ నిఫ్ట్‌లో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ 2021 అక్టోబర్‌ 1న జోద్‌పూర్‌ క్యాంపస్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో దాని దశ మారిపోయింది. అంకితభావంతో పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయన నిరూపించారు.

జోద్‌పూర్‌ క్యాంపస్‌ను పూర్తి రెసిడెన్షియల్‌గా మార్చారు. మూడు కొత్త హాస్టళ్ల నిర్మాణం, ఆడిటోరియం నవీకరణ, రోడ్లు, క్యాంపస్‌లో పూర్తి గ్రీనరీ, ఓపెన్‌ జిమ్, నిఫ్ట్‌ సెల్ఫీ పాయింట్, వాటర్‌ ఫౌంటెన్, ల్యాబ్‌లు–క్లాస్‌రూమ్‌ల ఆధునికీకరణ వంటివన్నీ ఆయన చొరవతోనే సాధ్యమయ్యాయి. ఫ్యాకల్టీ, స్టాఫ్‌కు మెరుగైన వర్క్‌స్పేస్‌లు, రీసెర్చ్‌ ప్రోత్సాహం, జాతీయ–అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, జర్నల్స్‌లో పరిశోధనపత్రాల ప్రచురణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.  

జోద్‌పూర్‌ క్యాంపస్‌కు జాతీయస్థాయి గుర్తింపు.. 
ఢిల్లీలో 1986లో ప్రారంభమైన నిఫ్ట్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 క్యాంపస్‌లు ఉన్నాయి. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ క్యాంపస్‌ 2010లో ప్రారంభమై 2015లో శాశ్వత క్యాంపస్‌కు మారింది. ప్రస్తుతం 26 మంది ఫ్యాకల్టీ సభ్యులున్నారు. హరిశంకర్‌ప్రసాద్‌ నాయకత్వంలో ఈ క్యాంపస్‌ ఇప్పుడు దేశంలోని ఫ్యాషన్‌ విద్యలో జాతీయస్థాయి గుర్తింపు సాధించింది.  

దేశంలోని టాప్‌ 10 ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో నిఫ్ట్‌–జోద్‌పూర్‌ స్థానం సంపాదించింది. పార్లమెంట్‌ నూతన భవనంలో మార్షల్స్‌ యూనిఫామ్‌ను డిజైన్‌ చేసింది జోధ్‌పూర్‌ నిఫ్ట్‌. ఐపీఎల్‌–2025కు రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ డే జెర్సీ డిజైన్‌ను రూపొందించింది కూడా ఈ క్యాంపస్‌ విద్యార్థులే. టెడ్‌ఎక్స్‌ నిఫ్ట్‌–జో«ద్‌పూర్, ఫ్యాషన్‌ షోలు, డిజైన్‌ కలెక్షన్‌ (2022 నుంచి), గ్రాడ్యుయేషన్‌ డేలను మొదటిసారిగా విజయవంతంగా నిర్వహించారు. 2025 డిసెంబర్‌ 31న న్యూఢిల్లీలో జరిగిన 46వ వరల్డ్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌లో లీడర్‌షిప్‌ అవార్డు అందుకున్నారు.  

సృజనాత్మక యువతకు ఫ్యాషన్‌ ప్రపంచంలో అవకాశాలు  
ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో జోద్‌పూర్‌ నిఫ్ట్‌ను సందర్శించిన ఏపీ మీడియా బృందంతో హరిశంకర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. సృజనాత్మకత కలిగిన యువతకు ఫ్యాషన్‌ ప్రపంచంలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ రంగంలో అపార ఉపాధి అవకాశాలున్నాయన్నారు. నిఫ్ట్‌ వంటి జాతీయసంస్థలు యువతకు అవకాశాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement