రాజమహేంద్రవరంలోని రాజానగరం పోలీసులు స్వాదీనం చేసుకున్న గంజాయి
స్వయంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మత్తు మందుల దందా
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
రెండు నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో ప్రకటించి రెండేళ్ల పాలనలో దందాకు గేట్ వేగా మార్చేసిన చంద్రబాబు సర్కారు
ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తున్న టీడీపీ కీలక నేతల కుటుంబాలు
గంజాయిని ఆదాయ వనరుగా మార్చుకుని పచ్చ ముఠాల ఆగడాలు
రెడ్‌బుక్ పాలనలో కారులో గంజాయి తరలిస్తూ దొరికిపోయిన ఖాకీలు
ఉత్తరాంధ్ర నుంచి హిందూపురం దాకా విస్తరించిన మత్తు జాడలు
విజయవాడ కేంద్రంగా రాజధాని ప్రాంతంలో యథేచ్ఛగా విక్రయాలు
హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు అక్రమ రవాణా
ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా చిక్కేది టీడీపీ కూటమి నేతలే
డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో తెలంగాణ
పోలీసులకు పట్టుబడ్డ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్
డ్రగ్స్ దందాలో దొరికిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుదీర్‌రెడ్డి
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో గంజాయి గుప్పు ఇచ్చాపురం నుంచి రాజధాని ప్రాంతం మీదుగా హిందూపురం దాకా వ్యాపిస్తోంది. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో గ్రామ గ్రామాన గంజాయి దొరుకుతుండటంతో రాష్ట్రం అక్రమ రవాణాకు గేట్ వేగా మారిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ గంజాయి గుప్పుమంటోంది. విచ్చలవిడిగా సాగుతున్న మత్తు మందుల విక్రయాలపై స్వయంగా టీడీపీ నేతలే పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. పచ్చ ముఠాలు యువతను గంజాయి మత్తులో ముంచి సొమ్ము చేసుకుంటున్నాయి. దేశంలో డ్రగ్స్, గంజాయి దందా మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే బహిర్గతమవుతున్నాయి. ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా టీడీపీ కూటమి నేతలే చిక్కుతున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో తెలంగాణ పోలీసులకు చిక్కగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరకడం గమనార్హం.
తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడులో ఏకంగా ఇద్దరు ఎస్‌ఐలే గంజాయి తరలిస్తూ పట్టుబడటం రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచక పాలనకు నిదర్శనం. పోలీసులు యాక్సిడెంట్ చేసిన కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడంతో గంజాయి బండారం బట్టబయలైంది. గంజాయి సాగు, రవాణాను అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో కూటమి నేతల కనుసన్నల్లోనే య«థేచ్ఛగా దందా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో గంజాయి దందాకు గేట్ వేగా మార్చేశారు.
టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్) జిల్లా కేంద్రంగా గంజాయి మాఫియాకు ఊపిరి పోసింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గంజాయి సాగుతోపాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి భారీగా కొనుగోలు చేసి ఏపీ పరిధిలో నిల్వ చేస్తున్నారు. ఏఎస్‌ఆర్ జిల్లాలో కుటీర పరిశ్రమ తరహాలో లిక్విడ్ గంజాయి యూనిట్లను నెలకొల్పారు. ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సిండికేట్ భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ సాగిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు దర్జాగా గంజాయి తరలిస్తున్నారు. హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఎక్కువగా గంజాయి పట్టుబడటం గమనార్హం. 
మదనపల్లెలో పట్టుబడిన రూ.32 లక్షల గంజాయి, కూల్ లిప్స్
అక్రమ రవాణాలో కన్నా అనుచరులు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు ఇద్దరు గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. అల్లూరి జిల్లా నుంచి తమిళనాడుకు 220 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా సత్తెనపల్లికి చెందిన షేక్ మొహమ్మద్ రఫీ, డ్రైవర్ ఫయాజ్, పెద్దబయలు మండలం తారాజు జలపాతానికి చెందిన కిల్లో తిమోతి ఈ ఏడాది జూలై 15న గుడివాడ జంక్షన్ వద్ద పోలీసులకు చిక్కారు.
ప్రాణాలు తీస్తున్న మత్తు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గంజాయి జాడలు మారుమూల పల్లెల వరకు పాకాయి. యువతే లక్ష్యంగా పాఠశాలలు, కళాశాలల వద్ద విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో హత్యలకు సైతం వెనుకాడడం లేదు. అక్రమ రవాణా అడ్డుకుంటే వాహనంతో ఢీకొట్టిన ఘటనలున్నాయి. ఆగస్టు 2వ తేదీన దగదర్తి మండలం సున్నపుబట్టి జాతీయ రహదారిపై 313 కేజీల గంజాయి పట్టుబడింది. రెండున్నరేళ్లుగా సుమారు 1,170 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో చెన్నైకు సరఫరా చేస్తున్న గంజాయి లభ్యమవుతోంది. గూడూరులో గంజాయి ప్యాకెట్ రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. పొట్టి శ్రీరాములు పార్కువీధి, రైల్వే పార్శిల్ ఆఫీస్, ముత్యాలపేట సందు, రైల్వే క్వార్టర్స్ సమీపంలో జోరుగా విక్రయాలు సాగుతున్నా ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో బైపాస్‌రోడ్డులోని పాత నూనె మిల్లు ప్రాంతంలో, మున్సిపల్ బస్టాండ్ ఎదురు వైపు సినిమా హాలు వెనుక ఉన్న ఖాళీ స్థలాల మరుగు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు దర్జాగా సాగుతున్నాయి.
కారిడార్‌లా ఒంగోలు
గంజాయి రవాణాకు ఒంగోలు కారిడార్‌లా మారింది. విశాఖ నుంచి ఒంగోలు వెళ్లే రైళ్లు, జాతీయ రహదారుల మీదుగా పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది. ఇటీవల ఒంగోలులో మినీ లారీలో తమిళనాడుకు తరలిస్తున్న 280 కేజీల గంజాయి పట్టుబడింది. ఒంగోలు శివారులో యాక్సిడెంట్ జరగడంతో ఇది దొరికింది. మోచర్ల సమీపంలో కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న కారులో పెద్ద మొత్తంలో గంజాయి దొరకడం కలకలం రేపింది. కొండపి మండలంలో టంగుటూరు వద్ద తరచూ గంజాయి పట్టుబడుతోంది. చీమకుర్తిలో గంజాయి చాక్లెట్లను టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇటీవలే శంఖవరప్పాడు వద్ద ఏకంగా పోలీసుల కారులోనే గంజాయి లభ్యం కావడం సంచలనం సృష్టించింది. మార్కాపురం పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం సమీప గ్రామాల్లోని పొలాల్లో గంజాయి సాగు చేస్తున్న ఘటనలు గతంలో వెలుగు చూశాయి.
మత్తులో ఘర్షణలు
పోలీసు రికార్డుల ప్రకారం ఏలూరు జిల్లాలో 489 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 342 మంది గంజాయి విక్రేతలున్నట్లు నిర్ధారించారు. అరకు, ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. గంజాయి మత్తులో భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెంలో ఘర్షణలు జరిగాయి.
ఏజెన్సీ నుంచి దేశ రాజధానికి..!
ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు రాజమహేంద్రవరం మీదుగా గంజాయి తరలిపోతోంది. మెజారిటీ సరకు గుట్టుగా తెలంగాణ, బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీకి తరలిస్తున్నారు. రాజమహేంద్రవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా విక్రయాలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో 120 కిలోల గంజాయి కొనుగోలు చేసి పుణేకు తరలిస్తుండగా కొవ్వూరు జాతీయ రహదారి సమీపంలో జూలై 4న పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తెలంగాణలోని కోదాడకు 15.5 కిలోల గంజాయి తరలిస్తున్న ఐదుగురు విద్యార్థులను కోరుకొండ పోలీసులు జూలై 18న అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరంలో చిన్న చిన్న ప్యాకెట్లుగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నా పట్టించుకునే నాథుడు లేరు. తాజాగా మలికిపురం మండలం లక్కవరంలో ఓ వ్యక్తి నుంచి 1,150 గ్రాముల గంజాయిని స్వా«దీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అంతర్వేదిలో మూడు నెలల క్రితం గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కాకినాడలో పొట్లాలు
అరకు, విశాఖ రూరల్, పాడేరు నుంచి కాకినాడకు గంజాయి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా చిన్న పొట్లాలుగా మార్చి విక్రయిస్తున్నారు. కాకినాడ జిల్లా పరిధిలో ఏడాది వ్యవధిలో 11 గంజాయి కేసులు నమోదయ్యాయి.
సిక్కోలులో హైకోర్టు లోగో అతికించి..
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడులో తాజాగా పోలీసుల తనిఖీల సందర్భంగా 3.85 కిలోల గంజాయి తరలిస్తున్న నలుగురు తమిళనాడు వాసులు పట్టుబడ్డారు. ఒడిశాలోని గుణుపూర్ నుంచి తమిళనాడుకు రైలుమార్గంలో వెళ్లేందుకు యత్నిస్తూ చిక్కారు. గత రెండేళ్లలో ఇచ్ఛాపురంలో 1,200 కిలోలకుపైగా గంజాయి పట్టుబడింది. కొద్ది రోజుల క్రితం మెళియాపుట్టి మండలం జాడుపల్లి వద్ద 500 కిలోలకు పైగా గంజాయి తరలిస్తున్న బొలేరో.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో స్థానికులు పట్టుకున్నారు. హైకోర్టు లోగో స్టిక్కర్లు అతికించిన కారులో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠా చిలకపాలెంలో పట్టుబడింది. ఈ ఏడాది ఆగస్టు 2వతేదీన విజయనగరం రైల్వేస్టేషన్‌లో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒడిశాలోని మునుగుడ నుంచి చెన్నైకు తరలిస్తున్న రెండున్నర కిలోల గంజాయి పట్టుకున్నారు.
ఉత్తరాంధ్ర నుంచి అనంతకు..
అనంతపురం పోలీసులు రెండు నెలల క్రితం గంజాయి సరఫరా చేస్తున్న 14 మందిని అరెస్ట్ చేసి ఏడు కిలోలు స్వాదీనం చేసుకున్నారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ కేంద్రంగా గంజాయి సరఫరా జరుగుతోంది. విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి రైలుమార్గం ద్వారా గుంతకల్లు జంక్షన్‌కు గంజాయి తరలించి వివిధ మార్గాల్లో జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
గంజాయి ముఠాల ఘాతుకం
వైఎస్సార్ కడప జిల్లాలో కూటమి నేతలు గంజాయి దందాలో మునిగిపోయారు. కడప టూ టౌన్, చిన్న చౌక్, రిమ్స్ పీఎస్, తాలూకా ప్రాంతాలలో అమ్మకాలు జరుగుతున్నాయి.
⇒ ఇంజక్షన్ల ద్వారా మత్తు మందులు తీసుకుంటున్నారు. దీని వెనుక పచ్చముఠాలున్నాయి.
⇒ కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలంకాని పల్లె ప్రాంతంలో నివసిస్తున్న పెద్ద దస్తగిరి అనే వ్యక్తిని గంజాయి బ్యాచ్ మొదట గ్రామంలో గాయపరిచి తర్వాత రిమ్స్ పీఎస్ పరిధిలో వెంటాడి దారుణంగా హత్య చేసింది.
ఎర్రగడ్డల లోడు మాటున..
మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఎరగాని మిట్ట వద్ద ఎర్రగడ్డల లోడు ఆటోలో దాచిన సుమారు రూ.4 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
అరకు నుంచి కర్నూలుకు..
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదోని గంజాయికి గేట్‌వేగా మారింది. ఆదోని, ఎమ్మిగనూరు. ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా గంజాయి సాగు జరుగుతోంది. కర్నాటక పోలీసుల దాడుల్లో 50 కేజీల గంజాయి పట్టుబడింది. బళ్లారిలో పెద్ద ఎత్తున లభ్యం కావడంతో తనిఖీలు చేపట్టారు. గూడూరు మండలం పులకుర్తి క్రాస్ దగ్గర ఇటీవల 751.20 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండలం బోయిలకుంట్లకు చెందిన వ్యక్తి నుంచి 8 నెలల క్రితం సుమారు 3 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. కర్నూలు అర్బన్ తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేజీల గంజాయి పట్టుబడింది. అరకు నుంచి కారులో గంజాయి తెస్తూ 2025 సెప్టెంబర్ 16న కర్నూలులో పోలీసులకు పట్టుబడ్డారు. కర్నూలుతో పాటు చుట్టుపక్కల దాదాపు 50 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పొట్లాల రూపంలో గంజాయి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది.
కుప్పంలో గుప్పు గుప్పు
చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి బెంగళూరుకు ఎగుమతి చేసే గంజాయి చిత్తూరు జిల్లా మీదుగానే రవాణా అవుతోంది. కుప్పానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు ఒడిశా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. చిత్తూరులో ఇద్దరు టీడీపీ మహిళా నాయకులు గంజాయి విక్రయించడంపై పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సీఎం ఇలాకాలో దందాపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు
సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో గంజాయి, గుట్కా, హాన్స్ లాంటి ప్రాణాంతక మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండడంపై స్వయంగా టీడీపీ నాయకులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లావ్యాప్తంగా మత్తు రక్కసి కోరలు చాస్తుండడంతో విద్యార్థులు, యువత భవిష్యత్ ప్రమాదంలో పడిందని చిత్తూరు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూలై 20వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో కలెక్టర్ సుమిత్ కుమార్‌కు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఫిర్యాదు చేశారు. 
గంజాయి రవాణాలో కీలక ప్రాంతాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా (ఏఎస్‌ఆర్ ) పెదబయలు మంగ బంద నుంచి దుంబ్రిగూడ, అరకు పాండ్రంగి, బొబ్రా, అనంతగిరి మీదుగా బోడౌరో చెక్‌పోస్టు దాటుకుని ఎస్.కోట, ఎల్.కోట, అలమండ, కొత్తవలస మీదుగా విశాఖ వైపు తరలిస్తున్నారు. ఒడిశా కోరాపుట్ నుంచి బరంపురం, సాలూరు మీదుగా విజయనగరంలోకి చేరవేస్తున్నారు. జయపూర్ నుంచి సునాబేడ, పి.కోనవలస, సాలూరు రూరల్, బాడంగి, తెర్లాం మీదుగా శ్రీకాకుళం, నరసన్నపేట, మెలియపుట్టి, గోపాల్‌పూర్ మీదుగా బరంపురం వెళుతోంది.
విశాఖకు తరలించే మార్గాలివి..
రాయగడ నుంచి కూనేరు మీదుగా కొమరాడ, పార్వతీపురం టౌన్, సీతానగరం, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం మీదుగా విశాఖకు తరలిస్తున్నారు.
బెజవాడలో భారీగా విక్రయాలు
రాజధాని ప్రాంతం అడ్డాగా ప్రధానంగా విజయవాడ సిటీలో గంజాయి విక్రయాలు భారీగా జరుగుతున్నాతున్నా పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా గంజాయి రవాణా జరుగుతోంది. ఒడిశా, వైజాగ్, మన్యం నుంచి సరుకు తెస్తూ స్మగ్లర్లు పెద్ద ఎత్తున పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడ్డారు. జూన్ 9వ తేదీన లారీలో 140 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ఈగల్ బృందం పట్టుకుంది. వీరిలో కింగ్‌పిన్ సొహైల్ జూన్ 11న పటమట పోలీసుల కళ్లు గప్పి కోర్టులో ప్రవేశ పెట్టకముందే పరారయ్యాడు. ఈ ఏడాది జూన్ 24న భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 5 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. జూలై 13న గవర్నర్‌పేటలో అరుమిల్లి బాలసాయి శ్రవణ్ కుమార్‌ను అరెస్టు చేసి 26.38 గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. 
జూన్ 24వ తేదీన విజయవాడలో పట్టుబడిన గంజాయి విక్రేతల అరెస్టు చూపుతున్న ఎక్సైజ్ అధికారులు
రాజస్థాన్‌కు చెందిన ముకేశ్ ఓపీఎం (నల్లమందు) విక్రయిస్తూ పటమట పోలీసులకు పట్టుబడ్డాడు. ఈగల్ తనిఖీల్లో పట్టుబడినవి మినహా పోలీసులు దాడులు చేసి పట్టుకుంది చాలా తక్కువ. భవానీపురంతో పాటు రూరల్ పరిధిలో నిత్యం గంజాయి విక్రయాలు జరుగుతున్నా చర్యలు శూన్యం. పెనమలూరు నియోజకవర్గం గంజాయికి అడ్డాగా మారింది. మన్యం నుంచి వ్యాపారులు ఇక్కడికి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నారు. ప్రత్యేక మార్గాల ద్వారా విద్యార్థులు, యువత, కాలువ కట్ట ప్రాంత వాసులకు గంజాయి చేరుతోంది. ఇక్కడి నుంచి ప్రైవేటు వాహనాలలో బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు చేరవేస్తున్నారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా అవుతోంది. గుడివాడ, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో గంజాయి రవాణా, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
అరకు నుంచి తిరుపతికి గంజాయి
తిరుపతి రూరల్: అల్లూరి జిల్లా అరకు నుంచి కిలోల కొద్దీ గంజాయి గుట్టుగా తిరుపతికి చేరుతోంది. ఆపై తిరుపతిలో చిన్న ప్యాకెట్లుగా మారి చిల్లర దందాకు తెరలేస్తోంది. అరకు–తిరుపతి మధ్య గుట్టుగా సాగుతున్న ఈ గంజాయి సరఫరా వ్యవహారాన్ని తిరుపతి రూరల్ పోలీసులు రట్టు చేశారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 6.35 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. సీఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల ప్రకారం.. అవిలాల పంచాయతీ ధనలక్ష్మి నగర్‌కు చెందిన విక్రమ్‌రెడ్డి, తిరుచానూరుకు చెందిన మురుగన్ అరకు నుంచి గంజాయి తీసుకొచ్చి తిరుపతిలో గుట్టుగా విక్రయిస్తున్నాడు. పెద్ద మొత్తంలో తీసుకొచ్చిన గంజాయిని నేరుగా విక్రయించకుండా, 50 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా చేసి చిల్లరగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. వీరిద్దరి కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టిన పోలీసులు, వారి కార్యకలాపాలపై పక్కా సమాచారం సేకరించి ఆదివారం ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అరకు నుంచి తిరుపతికి గంజాయి ఎలా చేరుతోంది? ఈ సరఫరా వెనుక ఇంకెవరున్నారు? ఎవరెవరికి విక్రయిస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు
గంజాయికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ విక్రయాలను అడ్డుకున్నాడనే ఆగ్రహంతో నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పెంచలయ్యను ఏడాది క్రితం ఓ ముఠా దారుణంగా హత్య చేసింది. మూడు నెలల క్రితం ఆత్మకూరు ఏసీఎస్‌ఆర్ కాలనీలో ఓ యువకుడు గంజాయి మత్తులో పలువురిపై దాషీ్టకానికి పాల్పడుతుండడంతో అడ్డుకోబోయిన కరిముల్లా అనే వ్యక్తిని బీరు బాటిల్‌తో తలపై కొట్టడంతో తీవ్ర గాయమై రక్త స్రావమైంది.
⇒ పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు ఇద్దరు ఇటీవల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు.
⇒ ఏడాది క్రితం శ్రీకాకుళం టీడీపీ కార్యాలయానికి చెందిన ఓ వ్యక్తి గంజాయి బ్యాచ్‌తో జరిగిన ఘర్షణలో తలకు బలమైన గాయం తగలడంతో చనిపోయాడు.
⇒ విశాఖ బీచ్ రోడ్డులో యువత పగలు రాత్రి తేడా లేకుండా గంజాయి మత్తులో జోగుతోంది. గంజాయిని నర్సీపట్నం మీదుగా విశాఖకు తరలించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
⇒ తిరుపతి నగరంలోని జీవకోన, మంగళం, దాసరి మఠం, బస్టాండ్ పరిసరాలు, ఎం ఆర్ పల్లి, పోస్టల్ కాలనీ తదితర ఏరియాలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
⇒ శ్రీకాళహస్తి పట్టణంలో కూడా గంజాయి విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు తెలుస్తోంది.


