సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్‌ | Jogi Ramesh Breaks Silence on Family Row Says Meghana Was Like | Sakshi
Sakshi News home page

సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్‌

Aug 24 2026 12:16 PM | Updated on Aug 24 2026 1:00 PM

Jogi Ramesh Breaks Silence on Family Row Says Meghana Was Like

సాక్షి, విజయవాడ: గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి  జోగి రమేష్‌ స్పందించారు. తన కుమారుడు రాజీవ్‌, కోడలు మేఘనకు సంబంధించిన వివాదంలో తన కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్‌ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ సంచలన వీడియోను విడుదల చేసిన ఆయన.. మేఘనను కన్నకూతురిలా చూసుకున్నామని, పిల్లల మధ్య వచ్చిన విభేదాలను పెద్దవి చేసి రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు.

నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని జోగి రమేష్‌ పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం, చదివించడం, వారికి వివాహం చేయడం తమ బాధ్యత అని చెప్పారు. అదే బాధ్యతలో భాగంగా తన కుమారుడు రాజీవ్‌కు మేఘనతో ఘనంగా వివాహం జరిపించామని తెలిపారు.

వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయని, పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారని అన్నారు. విడిపోవాలని ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. అయితే వారి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా పరిస్థితి కోర్టు వరకు వెళ్లిందని చెప్పారు. జూన్‌ 8న తన కుమారుడు రాజీవ్‌ విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేశాడని, జూలై 24న మేఘన తమ కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని  జోగి రమేష్‌ తెలిపారు. విడాకుల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు.

మతమార్పిడి ఆరోపణలపై స్పందన
మేఘన ఇచ్చిన ఫిర్యాదులో మతమార్పిడికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంపై జోగి రమేష్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భార్య బైబిల్‌ చదివితే తప్పా? ఏసుక్రీస్తు బోధనలు వినడం తప్పా? అని ప్రశ్నించారు. తమ కుటుంబం అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్పారు. తిరుపతి వెళ్తామని, దుర్గగుడికి వెళ్తామని, యాగాల్లో కూడా పాల్గొంటామని తెలిపారు. కేవలం మత విశ్వాసాల ఆధారంగా తన కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

ఎల్లో మీడియాపై ఆగ్రహం
టీడీపీ అనుకూల ఎల్లో మీడియా సంస్థలు తన కుటుంబ సమస్యను పదేపదే ప్రసారం చేసి వ్యాపారం చేసుకున్నాయని జోగి రమేష్‌ అన్నారు. ఒక కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా బహిరంగంగా చర్చించడం సమంజసం కాదన్నారు. “మీకు పిల్లలు లేరా? మీకు కుటుంబాలు లేవా?” అంటూ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ వ్యవహారాలను రోడ్డుపైకి తీసుకురావద్దని కోరారు.

మహా టీవీ వంశీని ఉద్దేశించి కూడా జోగి రమేష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ వివాదంపై నెల రోజులుగా వార్తలు ప్రసారం చేస్తూ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తన కుమారుడు రాజీవ్‌ సామర్థ్యం గురించి ప్రశ్నించే ముందు.. ఈ వ్యవహారం వెనుక ఉన్న వారిని ప్రశ్నించాలని అన్నారు. కుటుంబ విషయాలను రాజకీయ, మీడియా అంశంగా మార్చడం సరికాదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, లోకేష్‌.. ఏ ఇంట్లో లేవు?
తనపై రాజకీయ కక్షతోనే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని జోగి రమేష్‌ చెబుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బీసీ నేతలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కారుమూరి, సునీల్‌ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలిపారు.  గతంలో ఎన్నికల తర్వాత తన కుమారుడిని అరెస్ట్‌ చేయించారని, నకిలీ మద్యం కేసులో తనను.. తన సోదరుడిని 83 రోజుల పాటు జైలులో పెట్టారని గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. “రాజకీయంగా నాపైకి రండి.. వ్యక్తిగత విషయాల్లోకి రావద్దు” అని చంద్రబాబు, నారా లోకేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఆధారాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు
తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతానని జోగి రమేష్‌ తెలిపారు. కుటుంబ వివాదాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికారు. తన కుమారుడు, మేఘన మధ్య సమస్యలు ఉన్నప్పటికీ.. మేఘనను తాను కన్నకూతురిలానే చూసుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. “ఏ కుటుంబంలో సమస్యలు లేవో చంద్రబాబు చెప్పాలి” అని ప్రశ్నించిన ఆయన.. ప్రముఖుల కుటుంబాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

వసంత కృష్ణప్రసాద్‌ వల్లే ఇదంతా..
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కార్యాలయానికి తన కోడలు మేఘన వెళ్లిన సంచలన వీడియోను విడుదల చేసిన జోగి రమేష్‌.. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. తాను ఏ రోజూ వసంత కృష్ణప్రసాద్‌ వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొంటానని చెప్పారు. వ్యక్తిగత అంశాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదన్నారు.

“ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. ప్రజా సమస్యలపై నా పోరాటం కొనసాగుతుంది” అని జోగి రమేష్‌ పేర్కొన్నారు. తన గొంతు నొక్కేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: గంజాయి ఊడలు..'కుప్పంలో గుప్పు'!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement