breaking news
Family issue
-
‘మా బాగోగులు చూసేవారే లేరు’.. వృద్ధ దంపతుల ఆవేదన!
తెలంగాణ: కాటికి కాలుచాచిన తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఓ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన గునిగంటి కట్టయ్య (85), భార్య సరోజన (80)లకు ఇద్దరు కుమారులు రవికుమార్, రాజ్‌కుమార్‌లున్నారు.16 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా పదేళ్ల క్రితం నాలుగెకరాలు తమవద్ద ఉంచుకుని, కొడుకులకు చెరో ఆరెకరాలు పంచి ఇచ్చారు.ఆరేళ్ల క్రితం చిన్నకుమారుడు రాజ్‌కుమార్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆస్తులు ఇచ్చినప్పటినుంచి పెద్దకుమారుడు, చిన్నకుమారుడి భార్య ఎవరూ తమ బాగోగులు చూడడం లేదని వాపోయారు. తమకున్న భూమిలో కొంత అమ్ముకొని తమ అవసరాలను తీర్చుకుంటామంటే రాజ్‌కుమార్ భార్య అంజలి, వారి పిల్లలు అమ్మకుండా అడ్డు పడడమేకాక నర్సంపేట కోర్టులో మూడు నెలల క్రితం కేసు వేసిందని కంటతడి పెట్టారు. ఈ వయస్సులో కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం, ఆర్థిక పరమైన ఇబ్బందుల నేపథ్యంలో దిక్కుతోయని స్థితిలో ఉన్నామని వాపోయారు.ఇదీ చదవండి: ‘మమ్మల్ని చూసేవారెవరు?’.. వృద్ధ దంపతుల చివరి నిర్ణయం! -
సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
సాక్షి, విజయవాడ: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘనకు సంబంధించిన వివాదంలో తన కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ సంచలన వీడియోను విడుదల చేసిన ఆయన.. మేఘనను కన్నకూతురిలా చూసుకున్నామని, పిల్లల మధ్య వచ్చిన విభేదాలను పెద్దవి చేసి రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు.నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని జోగి రమేష్ పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం, చదివించడం, వారికి వివాహం చేయడం తమ బాధ్యత అని చెప్పారు. అదే బాధ్యతలో భాగంగా తన కుమారుడు రాజీవ్‌కు మేఘనతో ఘనంగా వివాహం జరిపించామని తెలిపారు.వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయని, పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారని అన్నారు. విడిపోవాలని ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. అయితే వారి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా పరిస్థితి కోర్టు వరకు వెళ్లిందని చెప్పారు. జూన్ 8న తన కుమారుడు రాజీవ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడని, జూలై 24న మేఘన తమ కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని జోగి రమేష్ తెలిపారు. విడాకుల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు.మతమార్పిడి ఆరోపణలపై స్పందనమేఘన ఇచ్చిన ఫిర్యాదులో మతమార్పిడికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంపై జోగి రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భార్య బైబిల్ చదివితే తప్పా? ఏసుక్రీస్తు బోధనలు వినడం తప్పా? అని ప్రశ్నించారు. తమ కుటుంబం అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్పారు. తిరుపతి వెళ్తామని, దుర్గగుడికి వెళ్తామని, యాగాల్లో కూడా పాల్గొంటామని తెలిపారు. కేవలం మత విశ్వాసాల ఆధారంగా తన కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.ఎల్లో మీడియాపై ఆగ్రహంటీడీపీ అనుకూల ఎల్లో మీడియా సంస్థలు తన కుటుంబ సమస్యను పదేపదే ప్రసారం చేసి వ్యాపారం చేసుకున్నాయని జోగి రమేష్ అన్నారు. ఒక కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా బహిరంగంగా చర్చించడం సమంజసం కాదన్నారు. “మీకు పిల్లలు లేరా? మీకు కుటుంబాలు లేవా?” అంటూ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ వ్యవహారాలను రోడ్డుపైకి తీసుకురావద్దని కోరారు.మహా టీవీ వంశీని ఉద్దేశించి కూడా జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ వివాదంపై నెల రోజులుగా వార్తలు ప్రసారం చేస్తూ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తన కుమారుడు రాజీవ్ సామర్థ్యం గురించి ప్రశ్నించే ముందు.. ఈ వ్యవహారం వెనుక ఉన్న వారిని ప్రశ్నించాలని అన్నారు. కుటుంబ విషయాలను రాజకీయ, మీడియా అంశంగా మార్చడం సరికాదని వ్యాఖ్యానించారు.చంద్రబాబు, లోకేష్.. ఏ ఇంట్లో లేవు?తనపై రాజకీయ కక్షతోనే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని జోగి రమేష్ చెబుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బీసీ నేతలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కారుమూరి, సునీల్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నికల తర్వాత తన కుమారుడిని అరెస్ట్ చేయించారని, నకిలీ మద్యం కేసులో తనను.. తన సోదరుడిని 83 రోజుల పాటు జైలులో పెట్టారని గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. “రాజకీయంగా నాపైకి రండి.. వ్యక్తిగత విషయాల్లోకి రావద్దు” అని చంద్రబాబు, నారా లోకేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఆధారాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలుతన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతానని జోగి రమేష్ తెలిపారు. కుటుంబ వివాదాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికారు. తన కుమారుడు, మేఘన మధ్య సమస్యలు ఉన్నప్పటికీ.. మేఘనను తాను కన్నకూతురిలానే చూసుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. “ఏ కుటుంబంలో సమస్యలు లేవో చంద్రబాబు చెప్పాలి” అని ప్రశ్నించిన ఆయన.. ప్రముఖుల కుటుంబాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు.వసంత కృష్ణప్రసాద్ వల్లే ఇదంతా..మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయానికి తన కోడలు మేఘన వెళ్లిన సంచలన వీడియోను విడుదల చేసిన జోగి రమేష్.. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. తాను ఏ రోజూ వసంత కృష్ణప్రసాద్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొంటానని చెప్పారు. వ్యక్తిగత అంశాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదన్నారు.“ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. ప్రజా సమస్యలపై నా పోరాటం కొనసాగుతుంది” అని జోగి రమేష్ పేర్కొన్నారు. తన గొంతు నొక్కేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: గంజాయి ఊడలు..'కుప్పంలో గుప్పు'! -
రూ.20 లక్షల కట్నం తేకపోతే మరో పెళ్లి చేసుకుంటా..!
జనగామ జిల్లా: ఓ కుటుంబ పంచాయితీలో జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగింది. గొడవతో ఒక్కసారిగా బాధితులు కేకలు వేయడంతో ఎస్సై వినయ్‌కుమార్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చేరుకుని పెద్దమనుషులను మందలించారు. గాయపడివారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు మోటం పూర్ణ, పోలీసుల కథనం ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కడమంచి యాదయ్య, దుర్గమ్మ దంపతుల కుమార్తె మోటం పూర్ణను 2013, నవంబర్ 9న రఘునాథపల్లికి చెందిన అశోక్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.4 లక్షల నగదు, తులంన్నర బంగారం కట్నంగా అందించారు. అశోక్ ప్రైవేట్ ఉద్యోగం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. మొదట్లో వారి సంసారం సాఫీగా సాగింది. వారికి ఎనిమిదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రఘునాథపల్లిలో తన ఇంటివద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పూర్ణ గతేడాది సెప్టెంబర్ 2, 2024లో రెండో ఫ్లోర్‌నుంచి కిందపడింది. ఈఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆమెను భర్త అశోక్, అత్తామామ మోటం రాముల, శ్రీనివాస్ సరిగ్గా చూసుకోవడం లేదు. సరైన వైద్య చికిత్స చేయించలేదు. మరో రూ.20 లక్షలు అదనపు కట్నం తేవాలని, లేని పక్షంలో మరో వివాహం చేసుకుంటానంటూ పూర్ణను భర్తతో పాటు అత్తామామలు ఆరు నెలలుగా వేధిస్తున్నారు. ఈ విషయమై హైదరాబాద్ ఉప్పల్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా భర్త తీరులో మార్పు రాలేదు. దీంతో పూర్ణ మూడు నెలల నుంచి ఘన్‌పూర్‌లో అమ్మగారింటి వద్ద ఉంటోంది. అయితే పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కోసం బుధవారం పిలిపించారని, పంచాయితీలో తన బాధను చెపుతుండగానే భర్త అశోక్, అత్త రాముల, మామ శ్రీనివాస్.. తమపై దాడి చేశారని బాధితురాలు వాపోయింది. దాడిలో తన అత్త రాయి విసరగా అమ్మ దుర్గమ్మకు తీవ్రగాయమైందని, భర్త, మామ కలిసి తమ్ముడు పవన్‌పై దాడి చేశారని రోదించింది. కాగా, ఘర్షణ జరుగుతుండగా పెద్ద మనుషులు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. -
సుఖనిద్రకు ‘స్లీప్ డైవోర్స్’.. భారతీయ భార్యాభర్తలపై సర్వే ఇలా..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘‘నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే / అండనే బంటు నిద్ర అదియునొకటే..’ అని రాశారు అన్నమయ్య. రాజు పోయే నిద్ర, బంటు పోయే నిద్ర... రెండూ ఒక్కటే , నిద్రలో తేడాలు ఉండవు అని అర్థం. రాజు, బంటు వేర్వేరుగా ఎవరి నిద్రలో వారు ఉంటారు కనుక తేడాలు ఉండకపోవచ్చు కానీ, ఒకే పరుపుపై పవళించే భార్యా భర్తల నిద్రల్లో మాత్రం తేడాలు ఉంటాయి. ఇద్దరిలో ఒకరు గురక పెడుతుంటే రెండో వారి నిద్ర పాడవుతుంది. ఏసీ ఎక్కువ తక్కువలు ఇద్దరిలో ఒకరి నిద్రను కబళిస్తాయి. ఫ్యాను స్పీడు, పరుపు గట్టితనం ఇద్దరికీ ఒకే రకంగా అనుకూలంగా లేకుంటే ఇద్దరిలో ఒకరికి నిద్ర కరువవుతుంది. ఇద్దరిలో ఒకరు తెల్లవార్లూ నిద్రలో భంగిమలు మారుస్తుంటే రెండో వారికి కలత నిద్రే మిగులుతుంది.నయా ట్రెండ్... స్లీప్ డైవోర్స్‘‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు’’ అనే మాట... కలిసి పడుకునే భార్యాభర్తల విషయంలో మాత్రం నిజం కాదు. నిద్ర పోవటానికి అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పటికీ.. ఒకరి సౌఖ్యం ఇంకొకరికి అసౌకర్యం కావచ్చు. నిద్ర సుఖమెరగదు అనే మాట అర్థం లేనిదవచ్చు. అప్పుడిక ఎవరికి వారుగా, వేర్వేరు పడకలపై నిద్రించటమే.. సుఖనిద్రకు మార్గం. ఇలా వేర్వేరుగా పడుకోవటాన్నే ‘స్లీప్ డైవోర్స్’ అంటున్నారు!కాపురాలను నిలబెడుతుందిభారతీయ దంపతులలో 78 శాతం మంది ‘స్లీప్ డైవోర్స్’కు మొగ్గు చూపుతున్నారని ‘రెస్‌మెడ్’ గ్లోబల్ స్లీప్ తాజా సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యధిక శాతం. తర్వాతి రెండు స్థానాల్లో చైనా (67 శాతం), దక్షిణ కొరియా (65 శాతం) ఉన్నాయి. నిద్రలో గురకపెడుతున్న జీవిత భాగస్వామి నుండి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయిస్తున్న వారికి సైతం, మొదట ఈ ‘స్లీప్ డైవోర్స్’ను సూచించి కాపురాలను నిలబెడుతున్నారు లైఫ్ కోచ్‌లు, సైకో థెరపిస్టులు, ఆధునిక కౌన్సెలర్లు. అంటే.. విడాకులను నివారించటం కోసం ‘నిద్ర విడాకులి్న’ తీసుకోవటం! బాగుంది కదా. కళకళలాడుతూ నిద్ర లేస్తారునిద్ర ఎంత పెద్ద సమస్యో నిద్రాభంగాన్ని అనుభవించేవారికి గానీ తెలియదు. నిద్రలేమి అలసటను కలిగిస్తుంది. క్రమంగా నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తుంది. చివరికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గుముఖం పడుతుంది. అందుకే నిద్రకు ముఖం వాచిన దంపతుల కంటే, కంటి నిండా నిద్రపోయే దంపతులు కళకళలాడుతూ ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. కలిసి ఉండేందుకే విడిపోవటంఎంత భార్యాభర్తలైనా, ఏ ఇద్దరు మనుషుల శరీర స్వభావాలు, వారి సమయా సమయాలు ఒకటి కాదు కనుక... ఒకే మంచంపై ఇబ్బందిగా, ఇరుకుగా అనిపించినప్పుడు వేర్వేరు గదుల్లో, లేదా వేర్వేరు పడకలపై నిద్రించటమే మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. స్లీప్ డైవోర్స్ నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది. నిద్రకు అంతరాయాలను తొలగిస్తుంది. మనసుకు, మెదడుకు ప్రశాంతనిస్తుంది. ఎవరికి కావలసి విధంగా వారు గది వాతావరణాన్ని, గదిలోని వెలుతురును అమర్చుకోవటం వల్ల తేలిగ్గా నిద్రపట్టి, దీర్ఘనిద్రలోకి జారి, శరీరానికి సత్తువ లభిస్తుంది.చిన్న చిన్న సమస్యలూ ఉన్నాయి!స్లీప్ డైవోర్స్‌తో చక్కగా నిద్ర పట్టి రీచార్జ్ అవుతున్నప్పటికీ, ఇలా వేరుగా పడుకోవటం అన్నది మానసికమైన ఎడబాటుకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని మనో వైజ్ఞానిక నిపుణులు అంటున్నారు. పిల్లలు ఉన్న దంపతులకు ఇంకో సమస్య ఎదురౌతుంది. తల్లిదండ్రులు నిద్ర కోసం విడి విడిగా పడుకుంటున్నారని వారు అనుకోరు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా ఏంటి అని ఊహించుకుంటారు! ఏకాంతంగా ఉండేందుకు దొరికే ఆ కొద్ది గంటల్లో భార్యభర్తలు తమ నిద్రకోసం ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల వారి మధ్య సంభాషణ కూడా తగ్గిపోతుంది. తద్వారా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన దాంపత్య అనుబంధానికి అవరోధం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కాస్త జాగ్రత్త పడితే చాలు. ఏమైనా, నిద్రలేమి ముందు మిగతావన్నీ చిన్న విషయాలు కనుక నిరభ్యంతరంగా ‘స్లీప్ డైవోర్స్’ను పాటించవచ్చనీ, పాటిస్తూనే ఒకరి అవసరాలను ఒకరు కనిపెట్టుకుంటూ కుటుంబ జీవనాన్ని సాఫీగా కొనసాగింవచ్చునని థెరపిస్టులు అభయం ఇస్తున్నారు. -
6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని..
సాక్షి,గోవిందరావుపేట(వరంగల్): మండల కేంద్రంలో పట్టపగలే సినీఫక్కీలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మండల కేంద్రంలోని పోస్టాఫీస్ పక్కనే ఉన్న అడ్వకేట్ దామెల్ల సుధాకర్ ఇంటి వద్ద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..బుధవారం మధ్యాహ్నం రెండు కార్లలో నంబర్లు కనిపించకుండా జాగ్రత్త పడి యువకులు వచ్చారు. కారుదిగి ఇంటిలోకి వెళ్లి అక్కడే ఉన్న యువతి సోదరుడిని, తల్లిని కొట్టి యువతి శాంతిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలేం జరిగిందో వచ్చిందెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెంటనే యువతి తల్లి దామెళ్ల రజని, కుమారుడితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శాంతి భర్త చంద్రగిరి బాలరాజు తన కూతురును బలవంతంగా తీసుకుని వెళ్లినట్లు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పస్రా ఎస్సై కరుణాకర్‌రావు వెంటనే అన్ని మార్గాలలోని పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 6 నెలల క్రితమే వారికి వివాహమైందని కానీ శాంతి మాత్రం తల్లిదండ్రుల సూచనతోనే తల్లిగారి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోపం పెంచుకున్న బాలరాజు కొందరి సహాయంతో ఈ కిడ్నాప్ వ్యవహారానికి పాల్పడినట్లు సమాచారం. భర్తే అయినా ఇలా కార్లలో వచ్చి కిడ్నాప్ చేసేందుకు సాహసించడం మండలంలో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: ఏంకష్టం వచ్చిందో.. వివాహమైన ఐదు నెలలకే.. -
ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య
బాపట్ల (గుంటూరు జిల్లా) : కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాపట్లలోని తుఫాన్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు తన పెద్ద కుమార్తె కృష్ణవేణి(30)ని ఒంగోలుకు చెందిన తన మేనల్లుడు శేఖర్‌కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశాడు. కృష్ణవేణి, రమేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు లక్ష్మీప్రసన్న(9), అమ్ములు(6) ఉన్నారు. కాగా లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న శేఖర్ భార్య, పిల్లలతో బాపట్లలోని దేవుడుమాన్యంలో నివసిస్తున్నాడు. అయితే శేఖర్ తాగుడుకు బానిస కావడంతో భార్యతో తరచు గొడవపడేవాడు. నిత్యం వేధింపులు, గొడవల కారణంగా మనస్తాపానికి గురైన కృష్ణవేణి భర్త లేని సమయం చూసి గురువారం రాత్రి ఇద్దరు కుమార్తెలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. బాపట్ల మండలం మహాత్మాజీపురం రైల్వేట్రాక్‌పై శుక్రవారం విగతజీవులై పడి ఉన్న తల్లీ, బిడ్డల మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబసభ్యులు మందలించారని ఆత్మహత్య
తణుకు (పశ్చిమగోదావరి) : అప్పు విషయమై భార్య, కుమార్తె మందలించడంతో ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు 3వ వార్డులో నివాసం ఉంటున్న ప్రత్తిపాటి పెంటయ్య రజక వృత్తి చేసుకుంటూ.. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎన్ఎంఆర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల అతడు రూ.15 వేలు అప్పు చేశాడు. కాగా ఆ విషయం తెలిసి భార్య, కుమార్తె ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందని సోమవారం రాత్రి ప్రశ్నించారు. అప్పులు చేయడం తగదని మందలించడంతో ముగ్గురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో పెంటయ్య తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మంగళవారం ఉదయం డ్యూటీకని బయలుదేరిన అతడు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ గ్రౌండ్ ఫ్లోర్లో మెట్ల ప్రాంతం వద్ద గల కొక్కేనికి నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడు. కొంతసేపటికి సమీపంలోని పండ్ల వ్యాపారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


