జనగామ జిల్లా: ఓ కుటుంబ పంచాయితీలో జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగింది. గొడవతో ఒక్కసారిగా బాధితులు కేకలు వేయడంతో ఎస్సై వినయ్‌కుమార్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చేరుకుని పెద్దమనుషులను మందలించారు. గాయపడివారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు మోటం పూర్ణ, పోలీసుల కథనం ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కడమంచి యాదయ్య, దుర్గమ్మ దంపతుల కుమార్తె మోటం పూర్ణను 2013, నవంబర్ 9న రఘునాథపల్లికి చెందిన అశోక్‌కు ఇచ్చి వివాహం చేశారు.
వివాహ సమయంలో రూ.4 లక్షల నగదు, తులంన్నర బంగారం కట్నంగా అందించారు. అశోక్ ప్రైవేట్ ఉద్యోగం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. మొదట్లో వారి సంసారం సాఫీగా సాగింది. వారికి ఎనిమిదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రఘునాథపల్లిలో తన ఇంటివద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పూర్ణ గతేడాది సెప్టెంబర్ 2, 2024లో రెండో ఫ్లోర్‌నుంచి కిందపడింది. ఈఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆమెను భర్త అశోక్, అత్తామామ మోటం రాముల, శ్రీనివాస్ సరిగ్గా చూసుకోవడం లేదు. సరైన వైద్య చికిత్స చేయించలేదు. మరో రూ.20 లక్షలు అదనపు కట్నం తేవాలని, లేని పక్షంలో మరో వివాహం చేసుకుంటానంటూ పూర్ణను భర్తతో పాటు అత్తామామలు ఆరు నెలలుగా వేధిస్తున్నారు.
ఈ విషయమై హైదరాబాద్ ఉప్పల్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా భర్త తీరులో మార్పు రాలేదు. దీంతో పూర్ణ మూడు నెలల నుంచి ఘన్‌పూర్‌లో అమ్మగారింటి వద్ద ఉంటోంది. అయితే పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కోసం బుధవారం పిలిపించారని, పంచాయితీలో తన బాధను చెపుతుండగానే భర్త అశోక్, అత్త రాముల, మామ శ్రీనివాస్.. తమపై దాడి చేశారని బాధితురాలు వాపోయింది. దాడిలో తన అత్త రాయి విసరగా అమ్మ దుర్గమ్మకు తీవ్రగాయమైందని, భర్త, మామ కలిసి తమ్ముడు పవన్‌పై దాడి చేశారని రోదించింది. కాగా, ఘర్షణ జరుగుతుండగా పెద్ద మనుషులు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.


