ఆస్తులు పంచినా అయినోళ్లేతోనే కన్నీళ్లు!
న్యాయం చేయాలని వేడుకుంటున్న వృద్ధ దంపతులు
తెలంగాణ: కాటికి కాలుచాచిన తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఓ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన గునిగంటి కట్టయ్య (85), భార్య సరోజన (80)లకు ఇద్దరు కుమారులు రవికుమార్, రాజ్‌కుమార్‌లున్నారు.16 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా పదేళ్ల క్రితం నాలుగెకరాలు తమవద్ద ఉంచుకుని, కొడుకులకు చెరో ఆరెకరాలు పంచి ఇచ్చారు.
ఆరేళ్ల క్రితం చిన్నకుమారుడు రాజ్‌కుమార్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆస్తులు ఇచ్చినప్పటినుంచి పెద్దకుమారుడు, చిన్నకుమారుడి భార్య ఎవరూ తమ బాగోగులు చూడడం లేదని వాపోయారు. తమకున్న భూమిలో కొంత అమ్ముకొని తమ అవసరాలను తీర్చుకుంటామంటే రాజ్‌కుమార్ భార్య అంజలి, వారి పిల్లలు అమ్మకుండా అడ్డు పడడమేకాక నర్సంపేట కోర్టులో మూడు నెలల క్రితం కేసు వేసిందని కంటతడి పెట్టారు. ఈ వయస్సులో కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం, ఆర్థిక పరమైన ఇబ్బందుల నేపథ్యంలో దిక్కుతోయని స్థితిలో ఉన్నామని వాపోయారు.
ఇదీ చదవండి: ‘మమ్మల్ని చూసేవారెవరు?’.. వృద్ధ దంపతుల చివరి నిర్ణయం!


