చింతల్(హైదరాబాద్): మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి జన్మదినం సందర్భంగా ఐడీపీఎల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ప్లెక్సీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక మాజీ కార్పొరేటర్‌లు విజయ శేఖర్ గౌడ్, మహమ్మద్ రషీదా మహ్మద్ రఫీ ఫొటోలు లేనందుకు ఆగ్రహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీని చించి నినాదాలు చేశారు. సుచిత్ర నుంచి కొంపల్లి వరకు ఫ్లైఓవర్ పిల్లర్లపై ప్రీతి రెడ్డి జన్మదిన వాల్ పోస్టర్లు అతికించారు.
ఇక్కడ కూడా పోస్టర్లలో ఉన్న మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఫొటోలకు నలుపు రంగు వేసి నిరసన కొనసాగించినట్లు తెలుస్తోంది. దీనిపై డాక్టర్ ప్రీతిరెడ్డి స్పందిస్తూ.. ‘ఇది నా జన్మదిన వేడుకలు. పార్టీ కార్యక్రమం కాదు. అలా అయ్యి ఉంటే ప్రొటోకాల్ ప్రకారం అందరి ఫొటోలు వేసే వాళ్లం. ఆ ఫ్లెక్సీలను నా అభిమానులు, కాలేజీ, హాస్పిటల్ స్టాఫ్ అభిమానంతో వేశారు. నాఫ్లెక్సీలు చింపిన వారు నా మనోబలాన్ని మాత్రం చించలేరు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కాస్త వేచి చూద్దాం.. బంగారం!


