సాక్షి, హైదరాబాద్: రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు, గణేశ్ నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో ప్రయాణ సంబంధిత ఇబ్బందులు, రహదారులపై ఒత్తిడిని తగ్గించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ నెల 18 నుంచి 25 వరకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉద్యోగులకు దశలవారీగా ముందుగానే విధులు ముగించే అవకాశం కల్పించాలని కోరారు.
వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఉల్పించాలని ఐటీ సంస్థలు, ఇతర సంస్థలకు సూచించారు. ఈ నెల 17 నుంచి 25 వరకు వాతావరణ పరిస్థితులు మారుతాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ సంస్థలు, విద్యా సంస్థల ప్రతినిధులతో కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ గురువారం వర్చువల్ సమావేశం నిర్వహించారు.
వర్షాలు, నిమజ్జన ఊరేగింపుల కారణంగా రహదారులపై ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగుల ప్రయాణాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని పోలీసులు సూచించారు. ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు దశలవారీగా ముందస్తు లాగౌట్ అవకాశంకల్పించాలని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రోత్సహించాలని కోరారు. సైబరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలు కూడా 18 నుంచి 25 వరకు ఆన్‌లైన్ లేదా వర్చువల్ తరగతులు నిర్వహించాలని సూచించారు.


