కాపాడే క్రమంలో అన్న మృత్యువాత...
క్షేమంగా ఒడ్డుకు చేరిన చెల్లి
తెలంగాణ: క్షణికావేశంలో వాగులో దూకిన చెల్లిని కాపాడబోయి అన్న మృత్యువాతపడిన ఘటనలో చెల్లి క్షేమంగా బయటపడింది. అయితే ఆమెను ప్రేతాత్మగా భావించి గ్రామస్తులు భయాందోళనలకు గురికావడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లి ఎక్స్ రోడ్‌లో నివసించే ఆలె లక్ష్మి గంగాధర్‌లకు కుమారుడు గణేశ్, కూతురు లయ ఉన్నారు.
లయ ఎంబీఏ పూర్తి చేయగా. గణేష్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో గణేష్ ఇటీవల జన్నేపల్లికి వచ్చాడు. బుధవారం సాయంత్రం అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ లయ సమీపంలోని వాగు వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి దూకింది.
ఆమె వెనకాలే వెళ్లిన గణేశ్.. చెల్లిని రక్షించడం కోసం వాగులో దూకాడు. ఈత రాక నీట మునిగి మరణించాడు. విషయం తెలుసుకున్న నవీపేట పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌కు తరలించారు. కాగా, వాగులో దూకిన లయ చనిపోయి ఉంటుందని భావిస్తున్న తరుణంలో గురువారం తెల్లవారుజామున సంఘటన స్థలం వద్ద ఏడుస్తూ స్థానికులకు కనిపించింది. అయితే లయ చనిపోయి ప్రేతాత్మగా వచ్చి ఉంటుందని భావించి ఆమె వద్దకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు.
కుటుంబ సభ్యులు సైతం ఈ విషయాన్ని నమ్మకపోవడం గమనార్హం. తెల్లవారాక ఆమెను ఇంటికి తీసుకువెళ్లినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆమె ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. లయ దూకిన ప్రాంతంలో తక్కువ నీరు ఉండడంతో క్షేమంగా అవతలివైపు ఒడ్డుకు చేరుకుని ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి చేయడం లేదంటూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ...


