చల్లదనం మాయం..వేసవిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలు
సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు.. అడపాదడపా వర్షాలు.. 70 శాతం తేమ.. పగలు, రాత్రి ఉక్కపోత
రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి
తీవ్రమైన ఎల్‌నినోతో పాటు భౌగోళిక కారణాలు
శీతాకాలంపైనా ఎల్‌నినో ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ సెగలు కక్కుతోంది. సాధారణంగా ఉండాల్సిన చల్లదనం మాయమైంది. వేసవిని తలపించేలా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎల్‌నినో, ఇతర భౌగోళిక పరిస్థితులు రాష్ట్రంపై ప్రభావం చూపిస్తున్నాయి. అడపాదడపా వర్షం.. ఆ వెంటనే తీవ్రమైన ఉక్కపోత. ఇదీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలను తాకుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్ వంటి జిల్లాల్లో వాతావరణం అత్యంత విచిత్రంగా మారింది
తేమ ఎక్కువ..మేఘాలు నిల్
ఎల్‌నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడటం, మేఘాలు లేకపోవడంతో ఆగస్టు, సెప్టెంబర్ తొలిభాగంలో సుదీర్ఘ పొడి వాతావరణం ఏర్పడింది. ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల పగటిపూట సౌర వికిరణం (సోలార్ రేడియేషన్) నేరుగా భూమిని తాకుతోంది, తద్వారా పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతూ కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు కూడా చేరువవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత (హై హ్యుమిడిటీ ట్రాప్) కొనసాగుతోంది.
తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల్లో తేమ శాతం 70 శాతానికి పైగా ఉంటోంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండి, మేఘాలు లేనప్పుడు భూమి విడుదల చేసే వేడి అంతరిక్షంలోకి వెళ్లకుండా వాతావరణంలోనే బందీ అవుతోంది. దీనివల్ల రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. ప్రస్తుతం రాత్రి వేళల్లో 20–22 డిగ్రీల సెల్సియస్ ఉండాల్సిన ఉష్ణోగ్రతలు, 24–27 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి.
ముఖ్యమైన కారణాలు...
⇒ పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్‌నినో అంటారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం.. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ నుండి తీవ్రమైన ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్నాయి.
⇒ ఎల్‌నినో తీవ్రత వల్ల భారత ఉప ఖండంపై రుతుపవన ద్రోణి బలహీనపడింది. ఫలితంగా, బంగాళాఖాతంలో ఏర్పడాల్సిన అల్పపీడనాల సంఖ్య తగ్గింది. దీనివల్ల తెలంగాణకు అందాల్సిన స్థిరమైన వర్షాలు ఆగిపోయాయి.
⇒ ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఆగస్టు మాసంలో సాధారణం కంటే దాదాపు 38–64% తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 17 నాటికి కూడా రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు తీవ్రంగా కొనసాగుతోంది
⇒ వాతావరణ విచ్చిన్నత (ఫ్రాంగ్‌మ్యాంటెడ్ మాన్‌సూన్)..ఎల్‌నినో ప్రభావం వల్ల రుతుపవన వాతావరణం దెబ్బతింది. నిరంతరంగా కురిసే ముసురు వానలకు బదులుగా, సుదీర్ఘమైన కరవు పరిస్థితులు (డ్రై స్పెల్), ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే విచిత్ర వాతావరణం ఏర్పడింది.
⇒ హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, రోడ్లు పగటి వేడిని పీల్చుకుని రాత్రి వేళల్లో ఆ వేడిని వాతావరణంలోకి విడుదల చేయడం వల్ల రాత్రిపూట కూడా విపరీతమైన ఉక్కపోత ఉంటోంది.
4, 5 రోజుల్లో వర్షాలు
సెప్టెంబర్ 17 నాటి వాతావరణ అంచనాల ప్రకారం... రానున్న 4–5 రోజులలో స్థానిక ద్రోణుల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ విభాగం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు పెరిగిన ఉష్ణోగ్రతల నుండి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయని భావిస్తున్నప్పటికీ, ఎల్‌నినో ప్రభావం రాబోయే శీతాకాలంపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు


