విమోచన దినోత్సవంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. చిత్రంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్
ఇదో రాజనీతిజ్ఞత, ధైర్యం, త్యాగాల గాథ
దేశ స్వాతంత్య్రోద్యమంలో ఓ కీలక ఘట్టానికి ముగింపు
ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, మేధావులు, సామాన్య పౌరుల భాగస్వామ్యం
జాతీయ సమగ్రతకు బాటలు వేయాల్సిన ఆవశ్యకతను ఈ ఘట్టం గుర్తుచేస్తుంది
హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
ఇది స్వాతంత్య్ర దినోత్సవం కాదు.. సంకల్ప దినోత్సవం: కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్
జాతీయ చరిత్రలో అత్యంత విశిష్టమైన రోజు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
సాక్షి, హైదరాబాద్: విభిన్న రాజకీయ పరిస్థితుల నడుమ ఎన్నో సంఘర్షణలకు గురైన ప్రజలను ఏకతాటి పైకి తేవడంలో ఒక నవ స్వతంత్ర దేశం ఎదుర్కొన్న అసంఖ్యాక సవాళ్లను హైదరాబాద్ చరిత్ర ప్రతిబింబిస్తుందని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. ఈ పరిణామాలను రాజనీతిజ్ఞత, ధైర్యం, త్యాగాల గాథగా ఆయన అభివర్ణించారు. ప్రతి పౌరుడికీ సమాన స్థాయినిచ్చే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య సౌధం నిర్మించే దిశగా నిరంతర, బృహత్తర ప్రక్రియ కొనసాగిందని అన్నారు. హైదరాబాద్ విమోచన నేపథ్యంలో సాగిన ప్రజా ఉద్యమాన్ని ఆయన కొనియాడారు. ఆనాడు విద్యార్థులు, మేధావులు, రచయితలు, సామాజిక, రాజకీయ కార్యకర్తలు, రైతులు సహా సామాన్య పౌరులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. ఈ క్రమంలో అనేకమంది కఠిన కారాగార వాసం, హింస, అంతులేని వ్యక్తిగత కష్టనష్టాలకు గురయ్యారని తెలిపారు. రామ్‌జీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమురం భీమ్ వంటి దేశభక్తులకు ఈ సందర్భంగా ఆయన నివాళులర్పించారు. గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవంలో రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఏకీకృత సమైక్య భారత్‌కు పటేల్ పునాది
‘స్వతంత్ర భారత చరిత్రలో ఓ కీలక ఘట్టానికి హైదరాబాద్ సంస్థాన విమోచనం ముగింపు పలికింది. జాతీయ సమగ్రత, సార్వజనీనతకు బాటలు వేయాల్సిన ఆవశ్యకతను ఈ ఘట్టం మనకు గుర్తుచేస్తుంది. ఈ సంస్థాన విమోచనం ద్వారా బలమైన, ఏకీకృత సమైక్య భారత దేశానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢమైన పునాది వేశారు. దేశ ఐక్యత కోసం పౌరులందరూ ఒకే రీతిలో ఉండాల్సిన అవసరం లేదు. భిన్న భాషలు, విభిన్న సంప్రదాయాలు, విశ్వాసాలు గలవారై ఉండవచ్చు. అదేవిధంగా భిన్న రాజకీయ అభిప్రాయాల గలవారూ ఉండొచ్చు. అంతిమంగా రాజ్యాంగం, సార్వ¿ౌమాధికారం ప్రజలకే చెందుతాయన్న వాస్తవమే వారిని ఏకతాటిపై నిలుపుతుంది. నేటి వేడుక ఒక చారిత్రక తేదీ సంస్మరణకు మాత్రమే పరిమితం కాబోదు. ఇది భారత ప్రగతి ప్రస్థానాన్ని, దేశ సమైక్యతను సమున్నతంగా నిలిపే విలువలను గుర్తుచేసే సందర్భం.
కేంద్ర బలగాల కీలక పాత్ర
1947–1948 మధ్యకాలంలో దేశ నిర్మాణంలో కేంద్ర బలగాలు ఎంతో కృషి చేశాయి. నక్సల్ రహిత భారత్, ప్రతి రాష్ట్రం ప్రశాంతంగా శాంతి భధ్రతల సమస్యలు లేకుండా ఉండాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం.. విజన్. ఇందులో భాగంగా నక్సలిజం నిర్మూలనలో కూడా ఈ బలగాలు ఎంతో కీలక పాత్ర పోషించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, పర్యవేక్షణలో వామపక్ష తీవ్రవాదమైన నక్సలిజం దేశంలో అంతమైంది. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం పూర్తిగా కనుమరుగైన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రంలోని యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో గాం«దీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. తర్వాత సంస్థానాల ఏకీకరణకు పటేల్ ఎనలేని కృషి చేశారు. తదుపరి తరంలో నేడు ‘వికసిత భారత్–2047’దిశగా ప్రస్థానానికి ప్రధాని మోదీ సమర్థ సారథ్యం వహిస్తున్నారు..’అని ఉప రాష్ట్రపతి చెప్పారు.
హైదరాబాద్‌కు, జోద్‌పూర్‌కు మధ్య అనుబంధం: షెకావత్
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ‘ఇది కేవలం స్వాతంత్య్ర దినోత్సవం కాదు..సంకల్ప దినోత్సవం. జాతీయ ఏకతా దినం. హైదరాబాద్ విమోచన దినోత్సవం నుంచి ప్రేరణ పొంది సంకల్పబద్ధంగా ముందుకు సాగి, దేశం వికసిత్ భారత్ వైపు సాగేందుకు సంకల్పం ఉపకరిస్తుంది. దేశంలో అంతే ముఖ్యమైన పరివర్తన ఇప్పుడు మోదీ నేతృత్వంలో సాగుతోంది. సర్దార్ పటేల్ సాహసోపేత ‘ఆపరేషన్ పోలో’అన్యాయంపై న్యాయం సాధించిన విజయం. ఇందులో నా స్వస్థలం జో«ద్‌పూర్‌కు చెందిన సైనిక యోధులు, మా పూర్వీకులు, కుటుంబీకులు కూడా పాల్గొనడం నాకెంతో గర్వకారణం. ఆ విధంగా హైదరాబాద్‌కు జో«ద్‌పూర్‌కు మధ్య విడదీయరాని బంధం ఉంది. నేను ఇక్కడికి జోద్‌పూర్ ప్రతినిధిగా వచ్చా..’అని షెకావత్ అన్నారు.
వికసిత్ భారత్ దిశగా పునరంకితం కావాలి: గవర్నర్
గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తూ..జాతీయ చరిత్రలో హైదరాబాద్ విమోచన అత్యంత విశిష్టమైన, చారిత్రాత్మక దినమని చెప్పారు. నాటి పోరాటాలు, పూర్వీకులు పడిన కష్టానష్టాలు, బలిదానాలను నేటి యువత అర్థం చేసుకుని.. ఆ అనుభవాలు, వీరసైనికుల పోరాటం, త్యాగాల పునాదిగా వికసిత్ తెలంగాణ తద్వారా వికసిత్ భారత్ సాధన దిశగా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
వాళ్లెందుకు పోరాడాల్సి వచ్చింది: కిషన్‌రెడ్డి
‘నిజాం మంచి వాడని పాలకులు అంటున్నారు. అద్భుతమైన పాలన అందించి ఉంటే వందేమాతరం రామచంద్రరావు, భాగ్యరెడ్డి వర్మ, కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి ఎంతోమంది మహానుభావులు నిజాం అణచివేతకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాల్సి వచ్చింది?..’అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా నిజాంను కీర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రజాకార్ల ఆగడాలను కప్పిపుచ్చే ప్రయత్నం: బండి సంజయ్
రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు నిజాం గొప్పోడనే పరిస్థితి రావడం సిగ్గుచేటని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రజాకర్ల అఘాయిత్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
జాతీయ జెండా ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి
తొలుత పోలీస్ అమరవీరుల స్మృతి స్థూపం వద్ద ఉప రాష్ట్రపతి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాగా కేంద్ర బలగాలకు సంబంధించిన 10 బృందాలు డప్పు, డోలు, కోలాటం, గుస్సాడి, శివసత్తులు, లంబాడీ, బతుకమ ్మ, పేరిణి శివతాండవం కళా, నృత్యరూపాల ప్రదర్శించాయి. ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు బేగంపేట ఎయిర్‌పోర్టులో పలువురు నేతలు, అధికారులు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు.


