‘నా చెల్లికి పట్టిన గతి ఎవరికీ రావొద్దు’.. | Nizamabad Revenge Murder Youtuber Vaishnavi Case | Sakshi
Sakshi News home page

‘నా చెల్లికి పట్టిన గతి ఎవరికీ రావొద్దు’..

Sep 18 2026 6:29 AM | Updated on Sep 18 2026 6:54 AM

Nizamabad Revenge Murder Youtuber Vaishnavi Case

నిజామాబాద్‌లో నడిరోడ్డుపై ప్రతీకార హత్య

యూట్యూబర్‌ వైష్ణవిని చంపిన భర్తను కత్తితో నరికి చంపిన ఆమె చిన్నాన్న కుమారుడు

తన చెల్లిని చంపినందుకే హత్య చేసినట్లు సెల్ఫీ వీడియో విడుదల

తనకు శిక్ష పడకుండా చూడాలని వీక్షకులకు విజ్ఞప్తి

తెలంగాణ: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం దారుణ హత్య జరిగింది. ఈ ఏడాది మార్చి 17న భార్య (ప్రముఖ యూట్యూబర్‌ వైష్ణవి)ను చంపిన కేసులో నిందితుడు, కోరుట్లకు చెందిన చిత్తారి హరిబాబు (27)ను మృతురాలి చిన్నాన్న కుమారుడు గంధం సంతోశ్‌ నడిరోడ్డుపై నరికి చంపాడు. పట్టణంలోని రాజరాజేంద్ర చౌరస్తా ప్రధాన రోడ్డుపై గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది.

ఆ సమయంలో హరిబాబు మంచినీళ్ల కోసం మరో దుకాణం వద్దకు వెళ్లగా.. కారులో వచి్చన ఓ వ్యక్తి... హరిబాబు మెడ, తలపై పలుమార్లు కత్తితో నరకడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితుడు అదే కారులో పారిపోయాడు. అయితే అనూహ్యంగా గురువారం రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసిన నిందితుడు సంతోశ్‌.. తన చెల్లిని చంపినందుకే హరిబాబును హతమార్చినట్లు పేర్కొన్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. అతను కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. హరిబాబును చంపుతామని 15 రోజుల క్రితమే వీడియోల్లో కొందరు హెచ్చరించారు. అన్నట్లుగానే హతమార్చడం గమనార్హం.

ప్రేమ పెళ్లి.. ఆపై హత్యతో.. 
కోరుట్ల మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన గంధం రాణి, దుర్గాప్రసాద్‌ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు వైష్ణవి ఉన్నారు. వైష్ణవి (18) యూట్యూబర్‌గా గుర్తింపు పొందింది. ఆమెను కోరుట్లకు చెందిన చిత్తారి హరిబాబు యూ ట్యూబ్‌ వీడియోల్లో చూసి ప్రేమించానని వెంటబడ్డాడు. ఇద్దరి దీ ఒకే సామాజికవర్గం కావడంతో 2025 ఆగస్టులో పెద్దల అంగీకరాంతో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వైష్ణవి, హరిబాబు మాదాపూర్‌లోని అత్తారింట్లో ఉండగా.. కొన్ని రోజులకు ఎక్కడ ఉండాలన్న విషయంలో ఇరు కుటుంబాల మధ్య కలహాలు తలెత్తాయి.

అలాగే వైష్ణవి గర్భం దాల్చాక దంపతుల మధ్య విభేదాలు ముదిరాయి. ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణి అయిన భార్యను మార్చి 17న రాత్రి ఆమె పుట్టింట్లోనే హరిబాబు హింసించి చంపాడు. ఈ కేసులో సుమారు మూడు నెలలపాటు జైల్లో ఉన్న అతను జూలైలో బెయిల్‌పై విడుదలై కొంతకాలం ఏపీలోని బంధువుల వద్ద తలదాచుకున్నాడు. మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లో ఉంటూ కూరగాయలు, మక్కకంకులు అమ్ముతూ జీవిస్తున్న తల్లి లక్ష్మి వద్దకు వచ్చాడు.

ఎవరికీ నా చెల్లి గతి పట్టొద్దనే.. 
‘నా చెల్లికి పట్టిన గతి ఎవరికీ రావొద్దనే హరిబాబును చంపేశా. వైష్ణవి విషయంలో గవర్నమెంట్‌ నాకు న్యాయం చేయలేదు. నేను కావాలని హత్య చేయలేదు. వేరే పనిపై నిజామాబాద్‌ వెళ్తే అనుకోకుండా నాకు హరిబాబు కనిపించడంతో చంపేసా. నాకు శిక్ష పడకుండా మీరంతా (ప్రజలు) బయటకు వచ్చి నాకు శిక్ష పడకుండా పోరాటం చేయండి. మీ కాళ్లు మొక్కుతా’ అంటూ గంధం సంతోశ్‌ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మరోవైపు అతని భార్య సానియా సైతం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. వైష్ణవిని చంపిన వ్యక్తి చనిపోయినందుకు ఆనందంగానే ఉందని.. అయితే తన భర్త ఇలా చేస్తాడని అనుకోలేదని.. జైలు నుంచి అతను వచ్చేదాకా ప్రజలే తనకు, తన ఇద్దరు పిల్లలకు తోడుండాలని కోరింది.

ఇదీ చదవండి: చంపేశారని ఎఫ్‌ఐఆర్.. ఇన్‌స్టా వీడియోతో బయటపడిన నిజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement