వృద్ధాప్య సమస్యలతో దంపతుల బలవన్మరణం
చివరి దశలో తమను చూసేవారు లేరని ఆవేదన
అనారోగ్యంతో గతంలోనే ముగ్గురు కుమారుల మృతి
వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిన కోడళ్లు, మనుమలు
జనగామ జిల్లా గబ్బెటలో విషాదఛాయలు
తెలంగాణ: జీవన గమనంలో వారు అలిసిపోయారు...ఒకరికొకరుగా జీవించి ఇక తమ వల్ల కాదంటూ లోకం విడిచి వెళ్లారు. వృద్ధాప్య సమస్యలు, చివరి దశలో చూసే వారు లేక ప్రాణాలు తీసుకున్నారు. ఏళ్లుగా కలిసున్న వారు చావునూ కలిసే స్వాగతించారు...ఈ వయసులో తమను పట్టించుకునే వారెవరు... సాయం చేసే వారు లేరనుకున్నారో ఏమో.... పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.
వృద్ధ దంపతుల మరణంతో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. గబ్బెట గ్రామానికి గైని పుల్లయ్య (86) గైని లక్ష్మి (81) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కొడుకులు సత్యనారాయణ, శ్రీనివాస్, అశోక్, ఇద్దరు కూతుళ్లు లలిత, మంజుల ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ముగ్గురు కొడుకులు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. దీంతో వారి భార్యలు, పిల్లలు ఉపాధి నిమిత్తం హైదరాబాద్, హనుమకొండకు వలస వెళ్లారు.
ఓ కూతురు నెల్లుట్ల, మరో కూతురు స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉంటున్నారు. పుల్లయ్య, లక్ష్మి సొంత గ్రామంలోనే నివసిస్తున్నారు. వీరికి పింఛన్ ఒకటే ఆదాయం. అప్పుడప్పుడు కోడళ్లు, కూతుళ్లు, వారి పిల్లలు వచ్చి వెళ్తుంటారు. వయసు భారం, అనారోగ్య సమస్యలతో వృద్ధులిద్దరూ కొంత కాలంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, ఈ క్రమంలో గురువారం ఉదయం తెల్లవారినా ఇంటి తలుపులు తీయలేదు. పాల ప్యాకెట్ ఇచ్చేందుకు వచి్చన వ్యక్తి అనుమానంతో లోపల చూశాడు.
ఇద్దరు మంచంపై పడి ఉండడంతో చుట్టు పక్కల వారిని పిలిచాడు. విషం తాగారని గుర్తించారు. అప్పటికే పుల్లయ్య మరణించగా, కొనఊపిరితో ఉన్న లక్ష‍్మీని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె అక్కడ మృతి చెందింది. పుల్లయ్య మృతదేహానికి జనగామలో, లక్ష్మి మృతదేహానికి వరంగల్‌లో పోస్టుమార్టం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు. కుమార్తె లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు.
గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com
ఇదీ చదవండి: వనస్థలిపురంలో షాకింగ్ ఘటన.. పాల వ్యాపారి దారుణ హత్య!


