ఇది జెన్‌జీ యుగం | CM Revanth Reddy Holds Key Meeting With Ministers and MLAs | Sakshi
Sakshi News home page

ఇది జెన్‌జీ యుగం

Aug 25 2026 5:56 AM | Updated on Aug 25 2026 5:56 AM

CM Revanth Reddy Holds Key Meeting With Ministers and MLAs

మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి, తుమ్మల, సీతక్క, ఉత్తమ్, పొంగులేటి, కావ్య, వీరేశం, శంకర్, నవీన్‌యాదవ్, యశస్విని, సంజయ్, సారయ్య, శ్రీహరి, వేం నరేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, లక్ష్మారెడ్డి, ఆది శ్రీనివాస్‌ తదితరులు

ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు పాతవైపోయాయి... అంతా ఇన్‌స్టాగ్రామ్‌లో నడుస్తోంది

సాంకేతికతను ఉపయోగించుకోకపోతే అవుట్‌డేట్‌ అవుతారు 

రూ.100 కోట్లకు ఎకరం అమ్మి సంకలు గుద్దుకున్నారు... నేను రూ.260 కోట్లకు అమ్మా 

సోషల్‌ మీడియాను బీఆర్‌ఎస్‌ బాగా ఉపయోగిస్తోంది... మనం చెక్‌ పెట్టకపోతే ఎలా? 

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశంలో సీఎం రేవంత్‌ దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: ఇది జెన్‌జీ యుగమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కాలం చెల్లినవారవుతారని (అవుట్‌డేట్‌) ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘సోషల్‌ మీడియా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు పాతవైపోయాయి. ఇప్పుడు యువత ఇన్‌స్టాగ్రాంలో హల్‌చల్‌ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్‌స్టాగ్రాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రేవంత్‌ సోమవారం విలేకరుల సమావేశం అనంతరం కాసేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాను బీఆర్‌ఎస్‌ విస్తృతంగా వినియోగిస్తోందని, దీనికి చెక్‌ పెట్టేలా కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా పనిచేయాలన్నారు. ‘నాడు ఎకరం రూ.100 కోట్లకు అమ్మితేనే సంకలు గుద్దుకున్నారు. కానీ నేను ఎకరం రూ.260 కోట్లకు అమ్మా. రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ రంగం ఊపందుకుంటోంది. ఇటీవలి కాలంలో రియల్‌ కార్యకలాపాలు 18 శాతం పెరిగాయని నివేదికలు చెపుతున్నాయి. ఇవేవీ సోషల్‌మీడియాలో కనిపించవు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌ కోసం స్మార్ట్‌ కార్డులు తెచ్చాం.

కానీ సంగారెడ్డిలో పంపిణీ చేసిన ఆ ఒక్క రోజే ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత అందరూ మర్చిపోయారు’ అని చెప్పారు. ఎమ్మెల్యేలందరూ వారి కార్యక్రమాలతోపాటు రాష్ట్ర పార్టీ, ఏఐసీసీ కార్యక్రమాలను కూడా సోషల్‌ మీడియాలో పెట్టాలని, ఇందుకోసం ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే సిబ్బందికి ఐ అండ్‌ పీఆర్‌ శాఖతో ఓరియంటేషన్‌ క్లాస్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల సందర్భంగా మనందరం కలిసి పనిచేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా పనిచేస్తే 100కు పైగా సీట్లు గెలుస్తామన్నారు. అలాగే, 22ఏ భూముల గురించి ఎవరూ మాట్లాడొద్దని. ఇది మన హయాంలోనే వచి్చంది కాదని, ఈ సమస్య బీఆర్‌ఎస్‌ హయాంలో కూడా ఉందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.  

వివాదాలొద్దు...  
ఎమ్మెల్యేలందరూ వివాదాల జోలికి వెళ్లకుండా నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌ సూచించారు. తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను గ్రీన్‌ చానల్‌ ద్వారా విడుదల చేస్తామని, వెంటనే ఆ పనుల మీద దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, కార్యక్రమ నిర్వహణకు సంబంధించి విప్‌లు సభ్యులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. 

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, విప్‌లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, వీర్లపల్లి శంకర్, ప్రేమ్‌ సాగర్‌ రావు, నవీన్‌ యాదవ్, మట్టా రాగమయి, మందుల సామేల్, వెడ్మ బొజ్జు, కోరం కనకయ్య, తోట లక్ష్మీకాంతరావు, రాందాస్‌ నాయక్, కడియం శ్రీహరి, డాక్టర్‌ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె.ఆర్‌.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మురళీ నాయక్, యశస్విని రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రఘువీర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు.

ఏ ఒక్కరి కోసమో కాదు: భట్టి 
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారం లేకపోతే ఎన్ని అవమానా­లు ఎదుర్కొన్నామో అందరికీ తెలుసునని డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యానించారు. అధికారం వచి్చన తర్వాత కష్టపడుతున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఒకరిద్దరి ప్రయోజనాల కోసం పారీ్టని, ప్రభుత్వాన్ని ఫణంగా పెట్టుకోలేమని, మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టేలా అందరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

క్రమశిక్షణ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే
కొండా సుస్మిత వ్యవహారంపై సీఎం స్పందన
సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ తనపై చేసిన ఆరోపణలు, విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేరుగా స్పందించడానికి నిరాకరించారు. ఈ వివాదంపై విలేకరుల సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ  అంశం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని,  కమిటీ తీసుకునే నిర్ణయాన్ని పార్టీ, తాము, అందరూ కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్నారు. ఊహాజనిత అంశాలను ప్రస్తావించవద్దని మీడియాను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement