నాగర్‌కర్నూల్ జిల్లా: ఆ కుటుంబంపై మృత్యువు పగబట్టింది. ఉదయం విధులకు బయలుదేరిన తల్లి బస్టాండ్‌లోనే అకస్మాత్తుగా మృతి చెందగా, ఈ విషాద వార్త తెలుసుకుని పరామర్శించేందుకు వస్తున్న కుమారుడు, కోడలు, అల్లుడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో కోడలు, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందారు.
గంటల వ్యవధిలోనే ముగ్గురూ మృత్యువాత పడటంతో నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రాయవరం గ్రామానికి చెందిన లావుడ్యా లలిత (50) గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం విధులకు వెళ్లేందుకు అచ్చంపేట బస్టాండ్‌కు చేరుకున్న ఆమె అక్కడే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అంత్యక్రియలకు వస్తూ అనంతలోకాలకు..
లలిత మృతి విషయం తెలుసుకున్న హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆమె కుమారుడు శ్రీకాంత్, కోడలు చంద్రకళ (32), అల్లుడు నాగరాజు (35) అచ్చంపేటకు బయలుదేరారు. ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనంపై వస్తుండగా నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేయబోయారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కోడలు చంద్రకళ, అల్లుడు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతదేహాలను నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో రాయవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.


