డబ్బులిస్తే ఎంతటి ఉల్లంఘన అయినా బలాదూరే.. | Illegal Buildings Rise in Gachibowli | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తే ఎంతటి ఉల్లంఘన అయినా బలాదూరే..

Aug 25 2026 7:24 AM | Updated on Aug 25 2026 7:26 AM

Illegal Buildings Rise in Gachibowli

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ నిర్మాణం.. అధికారుల నోటీసులు.. క్రమబద్ధీకరణ ప్రయత్నం.. కోర్టు జోక్యం.. మళ్లీ అక్రమ నిర్మాణం..చర్విత చరణం.  

...ఇదీ హైదరాబాద్‌ మహానగరం తీరు. దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న సమస్య. ప్రభుత్వాలు మారాయి.. పథకాలు మారాయి.. నిబంధనలు మారాయి.. కానీ అక్రమ నిర్మాణాలను పుట్టుకలోనే అడ్డుకునే వ్యవస్థ మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.  టౌన్‌ ప్లానింగ్‌ అంటే..హైదరాబాద్‌ మహానగరంలో మనీ ప్లానింగ్‌గా మారింది.  

గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. నిర్మాణాన్ని అడ్డుకోవడంలో సంబంధిత టౌన్‌న్‌ప్లానింగ్‌ అధికారి విఫలమయ్యారంటూ సస్పెండ్‌ చేశారు. అక్రమ నిర్మాణాలపై విస్తృత తనిఖీలకు, ఉల్లంఘనలున్న చోట కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత యంత్రాంగం రంగంలోకి దిగింది. కానీ, భవనం కూలితేనే మేల్కొంటారా.. అప్పటిదాకా నిద్రపోతారా? అనే ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి.  

ఎప్పటి నుంచో ..  
అక్రమ నిర్మాణాలనుక్రమబద్ధీకరించేందుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2008లో బీపీఎస్‌ (బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌) తెచ్చారు. అప్పట్లోనే 2.05 లక్షల దరఖాస్తులందాయి. అక్రమ నిర్మాణాలను ఒకసారి క్రమబద్ధీకరించి సమస్యకు  శాశ్వత ముగింపు పలకాలని అప్పటి ప్రభుత్వం భావించింది. తర్వాత టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌)  అధికారంలోకి వచ్చాక  2015లోనూ అలాంటి ప్రయత్నమే చేసింది. పేరు మాత్రం బీఆర్‌ఎస్‌ (బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌)గా మారింది. అంతే తేడా. దాదాపు 1.27 లక్షల దరఖాస్తులందినట్లు అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుల ఆదేశాలతో ఆ దరఖాస్తులకు మోక్షం రాలేదు.

ఇంకా పెరిగాయి.. 
అయినప్పటికీ అక్రమ నిర్మాణాలు రాకుండా అధికారులు శ్రద్ధ చూపలేదు. పైపెచ్చు అక్రమార్కులతో చేయి కలిపి వారికి అండగా ఉండటంతో మరిన్ని అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయ నే ఆరోపణలున్నాయి. బీఆర్‌ఎస్‌ గడువు ముగిశాక వెలసిన అక్రమ నిర్మాణాలు రెండు లక్షల దాకా ఉంటాయని అంచనా. అలాంటి వాటిల్లోదే గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం. దీని వెనుక ‘పొలిటికల్‌ పవర్‌ ’ ఉందనే ఆరోపణలున్నాయి. బీపీఎస్, బీఆర్‌ఎస్‌లకు అందిన  దరఖాస్తుల్లోనూ సింహభాగం కూకట్‌పల్లి జోన్‌వి కావడం విశేషం. తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌లున్నట్లు సమాచారం.  

నోటీసులతో మమ  
ఏ ప్రమాదం జరిగినా అంతకుముందే నోటీసులిచ్చినట్లు అధికారులు చెబుతారు. తమపైకి రాకుండా ఉండేందుకు అదో  నైపుణ్యం. సాధారణ ప్రజల సెట్‌బ్యాక్‌లలో స్వల్ప ఉల్లంఘనలు కనిపిస్తే పదేపదే సతాయించే అధికారులకు భారీ భవంతులెందుకు కనిపించవో వేరుగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇవే ప్రశ్నలు వేశాయి. అక్రమ భవనాన్ని కూల్చడం మాత్రమే కాదు.. అది అక్రమంగా నిలబడేలా చేసిన వ్యవస్థనూ ప్రశ్నించాలన్నాయి. అంతేకాదు,  చట్టవిరుద్ధ నిర్మాణాలను కేవలం కాలం గడిచిందనే సాకుతో  కొనసాగించేందుకు వీల్లేదని స్పష్టం  చేశాయి. చట్టబద్ధంగా క్రమబద్ధీకరించలేని నిర్మాణాన్ని తొలగించాల్సిందేనని పేర్కొంటూ, అక్రమ నిర్మాణం ఎలా ఏర్పడిందో, అందులో అధికారుల పాత్రపై కూడా విచారణ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాన్ని జీహెచ్‌ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. బహుశా, ఈ నేపథ్యంలోనే కావచ్చు కొత్తగా రానున్న క్యూర్‌ చట్టంలో పకడ్బందీ ప్రతిపాదనలున్నాయి.

80 శాతం ఫిర్యాదులు టౌన్‌ప్లానింగ్‌పైనే.. 
 సోమవారం ప్రజావాణిలో సీఎంసీలో అందిన మొత్తం ఫిర్యాదులు 47 కాగా, టౌన్‌ప్లానింగ్‌వే 38 ఉన్నాయి. అంటే 80 శాతం. 
ఎంఎంసీలో మొత్తం 23 ఫిర్యాదుల్లో టౌన్‌ప్లానింగ్‌వి 19 అంటే  82 శాతం. 

వీటిని బట్టి నగరంలో అక్రమ నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. 

ఈ ఫిర్యాదులన్నీ నిజంగా అక్రమాలు అరికట్టడానికేనా ? అంటే కాదు. అక్రమ నిర్మాణదారులను డబ్బులు డిమాండ్‌ చేసేందుకు ఫిర్యాదులిచ్చేవారే ఇందులో ఎక్కువగా ఉంటారని సమాచారం. అంటే అక్రమాల ఆధారంతో మరో అక్రమం. ఇదీ నగరంలో టౌన్‌ (మనీ)ప్లానింగ్‌కు మరో ఉదాహరణ.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement