యాదాద్రి భువనగిరి జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని వరుసకు కొడుకైన వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య(38), శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు పంతంగి గ్రామ శివారులోని శనిగలగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు.
శారదకు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్న భర్త దానయ్య ఆమెను పలుమార్లు మందలించాడు. శారద గతంలో పంతంగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి వెళ్లిపోయి తిరిగి భర్త వద్దకు వచ్చింది. ఇటీవల దానయ్య సొంత అన్న కుమారుడు రాపోలు శివతో శారద వివాహేతర సంబంధం పెట్టుకుంది. దానయ్యకు ఈ విషయం తెలియడంతో ఇద్దరిని మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన రాపోలు శివ తన బాబాయి అయిన దానయ్యను చంపుతానంటూ గతంలో పలుమార్లు బెదిరించాడు.
దురాజ్‌పల్లికి వెళ్లాల్సి ఉండగా..
దానయ్య ఆదివారం సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లికి వెళ్లాల్సి ఉండగా.. భార్య శారద అతడిని దురాజ్‌పల్లికి వెళ్లకుండా ఆపి పొలం వద్దకు తీసుకెళ్లింది. కొంతసేపటి తర్వాత తన ప్రియుడు రాపోలు శివను పొలం వద్దకు పిలిపించుకుంది. శారద, శివ ఏకాంతంగా ఉన్న సమయంలో దానయ్య గమనించి శివతో గొడవపడ్డాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో దానయ్య కిందపడిపోగా అతడి కాళ్లను శారద బిగ్గరగా పట్టుకుంది. శివ అక్కడే ఉన్న బండరాళ్లతో దానయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.
భార్య ప్రవర్తనపై అనుమానంతో..
హత్య చేసిన తర్వాత శారద పక్క పొలంలో పనిచేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి తన భర్త కనిపించడంలేదని చెప్పింది. చుట్టుపక్కల వెతకగా దానయ్య రక్తపు మడుగులో కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శారద ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజం ఒప్పుకుంది. అప్పటికే రాపోలు శివ సెల్‌ఫోన్లు, తన దుస్తులను తీసుకొని పారిపోయాడు. వాటిని చిట్యాల మండలం గుండ్రాంపల్లి చెరువులో పడేయగా.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులకు శివ పట్టుబడ్డాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి భార్యకు చాలా మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆమెకు సోషల్ మీడియాలో రకరకాల అకౌంట్లు ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు ఆమెతో సంబంధాలు కలిగి ఉన్నారని డీఎస్పీ తెలిపారు.


