చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం! | Hyderabad Woman Dies During Treatment Hospital Negligence Alleged | Sakshi
Sakshi News home page

చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం!

Aug 25 2026 8:53 AM | Updated on Aug 25 2026 8:53 AM

Hyderabad Woman Dies During Treatment Hospital Negligence Alleged

మృతురాలు దివ్య(ఫైల్‌), ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు

మృతదేహాన్ని వదిలి డాక్టర్ల పరార్‌

ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసంచేసిన బంధువులు

ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న యాజమాన్యం..!

సాక్షి, హైదరాబాద్‌: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వివాహిత మృతి చెందింది.దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రిని ధ్వంసం చేశారు.వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం పరారైంది. వివరాల్లోకి వెళితే.. కాచిగూడకు చెందిన దివ్య (35) చిన్నపాటి ఆనారోగ్య సమస్యతో మారేడుపల్లిలోని బృందావన్‌ ఆసుపత్రిలో చేరారు.

వారం రోజుల క్రితమే ఆమెను పరీక్షించిన వైద్యులు సోమవారం ఆపరేషన్‌ చేస్తామని చెప్పడంతో, ఆదివారం రాత్రి అడ్మిట్‌ అయ్యారు. సోమవారం ఉదయం చికిత్స ప్రారంభించారు. తొలుత పేషెంట్‌కు రక్త స్రావం అవుతోందని.. అదనపు రక్తం కావాలని చెప్పారు. ఇంతలోనే పెషెంట్‌ వైట్‌ బ్లడ్‌ సెల్స్‌ పడిపోయాయని, బ్లడ్‌ సెల్స్‌ తెప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరికొద్ది సేపటికి పేషెంట్‌ మృతి చెందినట్లు చెప్పి, మృతదేహాన్ని అక్కడే వదిలేసి వైద్యులు తప్పించుకున్నట్లు మృతురాలి బంధువులు పేర్కొన్నారు. దీంతో  ఆందోళనకు దిగడంతో మరికొందరు బంధువులు కూడా మద్దతు పలికారు.

ఆసుపత్రి అద్దాలు, పూలకుండీలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి ఆసుపత్రి యాజమాన్యం, బాధితులతో మాట్లాడారు. ల్యాప్రోస్కోపీ సమయంలో ప్రమాదవశాత్తూ వెయిన్‌ తెగిపోవడంతో తీవ్రంగా రక్తస్రావంతో పాటు పెషెంట్‌ గుండెపోటుకు గురై ఉంటుందని వైద్యులు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు రాతపూర్వక సమాధానం అనంతరం బాధితులు శాంతించినప్పటికీ, నిర్లక్ష్యపు వైద్యం చేసిన ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

కేసు నమోదు... 
మృతురాలి భర్త వికాస్‌ ఫిర్యాదు మేరకు అస్పత్రి వైద్యులు శ్రీకాంత్, గీతాంజలి పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

ఎమ్మెల్యే పరామర్శ.. 
దివ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీ గణేష్‌ పరామర్శించారు. బృందావన్‌ ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement