చిక్కిన నకిలీ డీఎస్పీ.. | Fake DSP Arrested For Rs 1.2 Crore Fraud In Hyderabad After Five Years On The Run, Check More Details Inside | Sakshi
Sakshi News home page

చిక్కిన నకిలీ డీఎస్పీ..

Aug 25 2026 8:42 AM | Updated on Aug 25 2026 9:38 AM

Fake DSP Arrested For- Rs 1.2 Crore Fraud In Hyderabad

డబ్బులు రెండింతలు చేస్తామని రూ.1.2 కోట్లు స్వాహా 

సాక్షి, హైదరాబాద్‌: డబ్బులు డబుల్‌ చేస్తామని వ్యాపారి నుంచి రూ.1.20 కోట్లు కాజేసిన కేసులో కీలక నిందితుడు నకిలీ డీఎస్పీ కొండూరు రెడ్డి వెంకట్‌ రాజు ఎట్టకేలకు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు చిక్కాడు. దాదాపు ఐదేళ్లుగా పరారీలో ఉన్న అతడిపై మరో మూడు కేసులు ఉన్నట్లు డీసీపీ చైతన్యకుమార్‌ సోమవారం వెల్లడించారు.

మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్‌కుమార్‌ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఆయన స్నేహితుడు కోడటి జయప్రతాప్‌ 2018 డిసెంబర్‌లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్లు ఇస్తాడని చెప్పగా.. సునీల్‌కుమార్‌ నమ్మలేదు.

దీంతో 2019 అక్టోబర్‌ 28న అప్పుడు సీఐడీ విభాగంలో తిరుపతి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.మునిరామయ్యను జయప్రతాప్‌ హైదరాబాద్‌ తీసుకువచ్చి సునీల్‌ కుమార్‌ను కలిశారు. రూ.1.20 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ మునిరామయ్య నమ్మించారు. ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్‌ ప్రశ్నించడంతో.. మునిరామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రాజు అనే వ్యక్తిని తీసుకువచ్చి టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీగా పరిచయం చేశాడు.

డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ ఒప్పించారు. రెండేళ్లయినా డబ్బు తిరిగిరాకపోవడంతో సునీల్‌కుమార్‌ ఆరా తీయగా రాజు అనే డీఎస్పీనే లేరని తేలింది. సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో జయప్రతాప్, మునిరామయ్య, రాజు సహా ఐదుగురిపై 2021లో కేసు నమోదు చేశారు. 2021, 2022లో కొందరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూడో డీఎస్పీ రాజు బెంగళూరులో ఉన్నట్లు టీమ్‌–5 ఏసీపీ కె.కిరణ్‌  కనిపెట్టి పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement