వాగ్వాదానికి దిగిన ఇరువర్గాల బంధువులకు సర్ది చెబుతున్న పోలీసులు, పెద్దలు
మహబూబ్‌నగర్: ఇష్టం లేని పెళ్లిని వధువు నిరాకరించడంతో పీటల మీద తంతు ఆగిపోయిన ఘటన మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం అబ్బాయిది మండలంలోని క్యాంపు రాయవరం కాగా.. అమ్మాయిది బిజినేపల్లి మండలం సల్కలాపేట. సంబంధం పెద్దల సమక్షంలో కుదరగా ఆగస్టు 16 న వివాహం చేయడానికి నిర్ణయించారు.
కానీ అమ్మాయి తనకు కొంత సమయం కావాలని, ఇప్పుడే పెళ్లి వద్దని పెద్దలను కోరింది. అందుకు నిరాకరించిన వారు పెళ్లి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసి అనుకున్న తేదీనే ఇరు వర్గాల బంధువులు కల్యాణ మండపాలకు చేరుకున్నారు. వధువు పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇప్పటికే వంటలు, డెకరేషన్, సన్నాయి, ఏర్పాట్లు తదితర వాటికి ఖర్చు రూ.లక్ష దాటిందని, వాటిని ఎవరూ భరించాలని అబ్బాయి తరఫు వారు ప్రశ్నించారు. గొడవ పెద్దదవుతున్న సమయంలో ఎవరో పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. ఖర్చుల విషయంలో ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడి, సగం సగం భరించేలా పోలీసులు ఒప్పించడంతో సమస్య సద్దుమణిగింది. పెళ్లికి వచ్చిన వందలాది మంది నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.


