మృత్యు దిబ్బలుగా నదీ పరీవాహక ప్రాంతాలు
నేపాల్‌లో మెరుపు వరద ఘటనలో 392 దాటిన మరణాలు
1,500 మంది జాడ గల్లంతు
వారిలో 290 మంది భారతీయులే
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రపంచ దేశాల నుంచి వెల్లువెత్తుతున్న సాయం
కఠ్మాండు/న్యూఢిల్లీ/బీజింగ్: హిమాలయాల దేశం నేపాల్‌లో మెరుపు వేగంతో దూసుకొచ్చిన భారీ వరద, బురద నీటితో జలసమాధి అయిన అమాయకుల సంఖ్య అమాంతం పెరిగింది. లెండే నది, భోటెకోశీ నదీ పరీవాహక ప్రాంతాలను అమాంతం ముంచేస్తూ దిగువ గ్రామాలు, పట్టణాలను మరుభూములుగా మార్చేస్తూ కొనసాగిన జలవిధ్వంసంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య గురువారానికి 392 దాటింది.
ప్రకృతి అందాలను చూసేందుకు దేశవిదేశాల నుంచి వచ్చిన దాదాపు 1,500 మంది పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. వీరిలో 290 మంది భారతీయులు సైతం ఉన్నారు. ఎటుచూసినా ఐదు అడుగుల ఎత్తులో మేటవేసిన బురదలో ఇల్లు, రోడ్డు నామరూపాల్లేకుండా పోయాయి. డజను జలవిద్యుత్ కేంద్రాలు పూర్తిగా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఉగ్రరూపం దాల్చిన నది కాస్తంత ఉపశమించడంతో ప్రవాహంలో మరికొన్ని మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.
దీంతో తమ వారిని విగతజీవులుగా చూసిన ఆప్తులు, బంధువులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించడంతో ఆ ప్రాంతంలో శ్మశాన వాతావరణం అలుముకుంది. వేలాదిగా చెట్లు కూలాయి. పెద్ద సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వంతెనలు కాగితం పడవల్లా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మరోవైపు కాలంతో పోటీపడుతూ నేపాల్ సైనికులు, పోలీసులు, వలంటీర్లు, స్థానికులు యుద్ధ ప్రాతిపదికన అన్వేషణ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
శిథిలాల కుప్పలుగా మారిన దుకాణసముదాయాలు, ఇళ్ల నుంచి మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగిస్తున్నారు. జలం కంటే రెండింతలు శక్తివంతమైన ద్రవరూప సిమెంట్ తరహాలో భీకర వరద అలలు పోటెత్తడంతో విధ్వంసం ఊహించనంతగా జరిగిందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు.
వంతెనలు, రహదారులు నాశనంకావడంతో భూతల మార్గంలో రెస్క్యూ ఆపరేషన్లు క్లిష్టంగా మారాయి. దీంతో గత్యంతరంలేక హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను చేపడుతున్నారు. బాధితుల జాడ కోసం డ్రోన్ల దండును రంగంలోకి దింపారు. 800 మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు గల్లంతైన తమ వారి జాడ కోసం ఆప్తులు ఆస్పత్రుల వద్ద కళ్లు కాయలు కాచేలా వెతుకుతున్నారు.
రక్షించే పనిలో మోదీ సర్కార్
టిబెట్‌లోని మానససరోవర్‌తోపాటు ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్ర యాత్రల కోసం నేపాల్‌కు విచ్చేసిన వందలాది మంది భారతీయులను రక్షించి ఎలాగైనా స్వదేశానికి తరలించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. నేపాల్ ఆర్మీకి తోడుగా భారత్‌నుంచి జాతీయ విపత్తుస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను పంపిస్తోంది. నేపాల్ ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం, టూర్ ఆపరేటర్లతో కాఠ్మాండులోని భారత ఎంబసీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, గల్లంతైన వారి జాడ కోసం అహరి్నశలు శ్రమిస్తోంది. గురువారం నాటికి త్రిశూలి–1 జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 84 మంది భారతీయులను కాపాడినట్లు భారతవిదేశాంగశాఖ తెలిపింది. తమిళనాడుకు చెందిన 21 మందిని సైతం రక్షించారు. రసువాలో 11 మంది భారతీయులు సహా 27 మంది విదేశీ పర్యాటకులును గురువారం కాపాడారు.
గాయపడిన విదేశీయులను ఆర్మీ సాయంతో కఠ్మాండుకు హెలికాప్టర్లలో తరలించి ఆస్పత్రుల్లో చేరి్పంచారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన యాత్రికులను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. టిబె ట్‌లో చిక్కుకుపోయిన 200 మంది భారతీయులను తీసుకొస్తామని ఆయ హామీ ఇచ్చారు.
కొనసాగుతున్న భారత సాయం
జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో దిగువ ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. మౌలిక వసతులు సైతం దెబ్బతిన్న ఆ ప్రాంత ప్రజల కోసం భారత్ మానవతా సాయం కింద 10 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది.
ఆహారం, ఔషధాలు, జనరేటర్లు, దుప్పట్లు ఇలా మరో 37.5 టన్నుల సామగ్రినీ తరలించారు. మరోవైపు 28, 29వ తేదీల్లో ‘భారత్–నేపాల్ మైత్రి బస్ సేవా’ సరీ్వసులను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్, భారత్, ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనా,పలు దేశాలు, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంఘం, దాతృత్వ సంస్థలు ధన, వస్తు, ఔషధ, వలంటీర్ల రూపంలో సాయం అందిస్తున్నాయి.
ప్రభావిత ప్రాంతాల్లో షా పర్యటన
యువ ప్రధాని బాలేంద్ర షా గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయం చేస్తామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నువాకోట్ జిల్లాలోని బిదూర్ మున్సిపాలిటీలో సహాయక చర్యలను ప్రధాని స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు టిబెట్‌లోనూ ఇదే వరద విలయం సృష్టించడంతో చైనా ప్రధాని లీ క్వియాంగ్ సైతం గురువారం గిరోంగ్ టౌన్‌షిప్‌లో పర్యటించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.
భారత్‌కు కొట్టుకొచ్చిన మృతదేహాలు!!
ఉత్తరప్రదేశ్‌లోని గండక్ నదీప్రవాహంలో మూడు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. నేపాల్‌ను దాటాక వరద ప్రవాహం భారత్‌లోకే వస్తుంది. దీంతో అక్కడి నుంచే ఈ మృతదేహాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. గండక్ నదీప్రవాహంలో వీటిని కనుగొన్నట్లు రాష్ట్ర విపత్తు స్పందన దళ సభ్యుడు, కానిస్టేబుల్ బ్రిజ్‌మోహన్ తెలిపారు.
రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలోని నారాయణి నదిలోనూ వరద ఉధృతి పెరిగే ఆస్కారముందని అధికారులు తెలిపారు. మరోవైపు బిహార్‌లో ఆరు జిల్లాల్లోని నదీ పరీవాహక దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ రోవైపు ఈశా ఫౌండేషన్‌కు చెందిన డజన్ల మంది సభ్యుల జాడ గల్లంతైందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తంచేశారు.


